
ఆ దేశానికి రూ.4,850 కోట్ల రుణం ఇస్తాం
భారత ప్రధాని మోదీ ప్రకటన
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుతో భేటీ
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు
మాలె: భారత్, మాల్దీవ్స్ విశ్వసనీయమైన మిత్రదేశాలు అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మాల్దీవ్స్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకుంటామని, ద్వీప దేశానికి రూ.4,850 కోట్ల రుణం(లైన్ ఆఫ్ క్రెడిట్) ఇవ్వబోతున్నామని ప్రకటించారు. శుక్రవారం మాల్దీవ్స్ రాజధాని మాలెలో ప్రధాని మోదీ, మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు సమావేశమయ్యారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ నుంచి శుక్రవారం ఉదయం మాల్దీవులకు చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టులో మొహమ్మద్ ముయిజ్జుతోపాటు సీనియర్ మంత్రులు ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం రిపబ్లిక్ స్క్వేర్‌లో మోదీకి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఇండియా–మాల్దీవ్స్ మధ్య కొన్ని రోజుల క్రితం సంబంధాలు బలహీనపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.
సైనిక సామర్థ్యం పెంపునకు సహకారం
మాల్దీవులతో సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ స్పష్టంచేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడులు ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. భారత్ అమలు చేస్తున్న ‘పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం’, ‘మహాసాగర్’ విధానాల్లో మాల్దీవులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. రక్షణ రంగంలో పరస్పర సహకారం ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసానికి ఒక కొలమానం అని వివరించారు. మాల్దీవుల సైనిక సామర్థ్యం పెంపునకు భారత్ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి స్వా గతం పలకడం తన హృదయాన్ని హత్తుకుందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
రక్షణ శాఖ కార్యాలయం ప్రారంభం
ఇండియా–మాల్దీవ్స్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక సంబంధాలు, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్మారక తపాళ బిళ్లను మోదీ, ముయిజ్జు ఆవిష్కరించారు. వేర్వేరు కీలక రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) ఇరు దేశాలు సంతకాలు చేశాయి. మాల్దీవ్స్‌లో భారత యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి మరో ఒప్పందం కుదిరింది. రూ.4,850 కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌పై రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మాలె సిటీలో రక్షణ శాఖ కార్యాలయాన్ని మోదీ, ముయిజ్జు ప్రారంభించారు.