కరిగిపోతున్న అమెరికా కలలు! | H-1B visa stamping delays continue in India | Sakshi
Sakshi News home page

కరిగిపోతున్న అమెరికా కలలు!

Jan 26 2026 4:54 AM | Updated on Jan 26 2026 4:54 AM

H-1B visa stamping delays continue in India

హెచ్‌–1బీ వీసా స్టాంపింగ్‌ ఇంటర్వ్యూలు 2027కు వాయిదా 

భారత్‌లోనే చిక్కుకుపోయిన వేలాది మంది వీసాదారులు  

యూఎస్‌ కాన్సులేట్లలో నానాటికీ పెరిగిపోతున్న బ్యాక్‌లాగ్‌లు   

షెడ్యూల్‌ లోగా అమెరికాకు వెళ్లకపోతే ఉద్యోగాలకు ఎసరు 

విదేశీయులకు వీసాలిచ్చే ఉద్దేశం అమెరికాకు లేదు: నిపుణులు

హెచ్‌–1బీ వీసా కలిగిన భారతీయ వృత్తి నిపుణులకు మరో శరాఘాతం తగిలింది. భార్యా పిల్లలకు దూరం కావడంతోపాటు ఏకంగా ఉద్యోగాలకు, అమెరికా స్వప్నాలకు ముప్పు ముంచుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. వీసా–స్టాంపింగ్‌ ఇంటర్వ్యూలు అనూహ్యంగా వాయిదా పడుతున్నాయి. భారత్‌లోని యూఎస్‌ కాన్సులేట్లలో బ్యాక్‌లాగ్‌లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంటర్వ్యూలకు స్లాట్లు దొరకడం గగనంగా మారింది. 

వచ్చే ఏడాది దాకా స్లాట్లు ఖాళీగా లేవంటే పరిస్థితి తీవ్రతను ఊహించుకోవచ్చు. హెచ్‌–1బీ వీసా ఇంటర్వ్యూలన్నీ ఏకంగా 2027కు వాయిదా పడుతున్నాయి! ఈ ఏడాది ఫిబ్రవరి 18న జరగాల్సిన ఇంటర్వ్యూ వచ్చే ఏడాది మే 24 తేదీకి రీ షెడ్యూల్‌ కావడం గమనార్హం. హెచ్‌–1బీ వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయ వృత్తి నిపుణుల్లో పలువురు అత్యవసర పనులు లేదా వీసా స్టాంపింగ్‌ గడువు ముగియడంతో స్వదేశానికి చేరుకున్నారు. వారంతా మళ్లీ అమెరికా వెళ్లాలంటే ఇక్కడి యూఎస్‌ కాన్సులేట్లలో వీసా–స్టాంపింగ్‌ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

 ఇలాంటివారు వేలాది మంది ఉంటారని అంచనా. ఇంటర్వ్యూకు హాజరయ్యే వీలు లేక వారంతా ప్రస్తుతం స్వదేశంలోనే చిక్కుకుపోయారు. వారి కుటుంబాలేమో అమెరికాలోనే ఉండిపోయాయి. కంపెనీల యాజమాన్యాలు విధించిన గడువులోగా అమెరికా చేరుకోకపోతే ఉద్యోగం ఊడిపోవడం ఖాయమని వారిప్పుడు ఆందోళన చెందుతున్నారు. హెచ్‌–1బీ వీసా స్టాంపింగ్‌ ఇంటర్వ్యూ వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు ఈ–మెయిల్స్‌ వస్తున్నాయని దరఖాస్తుదారులు చెబుతున్నారు. కొన్ని ఇంటర్వ్యూలనైతే పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సమాచారం.

తదుపరి పరిణామాలేమిటి?  
భారతీయులు ఇతర దేశాల్లోని అమెరికా కాన్సులేట్లలో వీసా స్టాంపింగ్‌ చేయించుకొనే అవకాశం గతంలో ఉండేది. ట్రంప్‌ సర్కార్‌ ఆ వెసులుబాటును కూడా రద్దు చేసింది. ఎవరైనా సరే సొంత దేశంలోనే వీసా స్టాంపింగ్‌ కోసం ప్రయత్నించాలని తేలి్చచెప్పింది. ఇంటర్వ్యూలు పదేపదే వాయిదా పడుతుండడంతో హెచ్‌–1బీ వీసాదారులు ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారం అమెరికాకు చేరుకోలేకపోతున్నారు. దాంతో వ్యక్తిగత, ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భార్యాపిల్లలను దగ్గరుండి చూసుకోలేని దుస్థితి. పిల్లల చదువులు, ఉద్యోగ కాంట్రాక్టులు, హౌసింగ్‌ అగ్రిమెంట్లు చిన్నాభిన్నమవుతున్నాయి. చాలామంది తమ ఆవేదనను సోషల్‌ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. 

ట్రంప్‌ ప్రభుత్వం ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తోందని, తాము అమెరికాకు వెళ్లకుండా కుట్రలు సాగిస్తోందని దుమ్మెత్తి పోస్తున్నారు. హెచ్‌–1బీ వీసాదారులు ఎక్కువకాలం అమెరికా బయట ఉండి.. వీసా గడువు ముగిసిపోతే మరిన్ని కష్టాలు తప్పవు. ఎందుకంటే వీసా కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. దరఖాస్తు రుసుమును వారు పనిచేస్తున్న అమెరికా కంపెనీ భరించాలి. హెచ్‌–1బీ వీసా దరఖాస్తు ఫీజును ట్రంప్‌ ప్రభుత్వం లక్ష డాలర్లకు పెంచేసింది. అంత భారం భరించడానికి అమెరికా కంపెనీలు ఇష్టపడడం లేదు. విదేశీ వృత్తి నిపుణులను వదులుకోవడానికి సిద్ధపడుతున్నాయి. అంటే వీసా గడువు ముగిసేలోగా అమెరికాలో అడుగుపెట్టకపోతే ఉద్యోగంపై ఆశలు వదులుకోవాల్సిందే.  

ఎందుకీ పరిస్థితి?  
అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తోంది. విదేశీ ఉద్యోగులపై ఆంక్షలు విధిస్తోంది. హెచ్‌–1బీ సహా ఇతర వీసాల దరఖాస్తుదారులపైనా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వారి సోషల్‌ మీడియా ఖాతాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులను, కామెంట్లను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు జల్లెడపడుతున్నారు. ఏమాత్రం అనుమానం వచి్చనా చాలు దరఖాస్తులను బుట్టదాఖలు చేస్తున్నారు. కొత్త నిబంధనల వల్ల హెచ్‌–1బీ వీసా స్టాంపింగ్‌ ఇంటర్వ్యూలు తొలుత 2025 డిసెంబర్‌లో వాయిదా పడ్డాయి.

 ఇంటర్వ్యూ తేదీలను మొదట 2026 మార్చి నెల.. తర్వాత జూన్‌.. అనంతరం అక్టోబర్‌కు రీషె డ్యూల్‌ చేశారు. అవి కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడుతున్నాయి. అంటే 18 నెలలకుపైగా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటికైనా అవకాశం దక్కుతుందన్న నమ్మకం లేదు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలోని అమెరికా కాన్సులేట్లలో బ్యాక్‌లాగ్‌లు పేరుకుపోయాయి. రెగ్యులర్‌ ఇంటర్వ్యూ స్లాట్లు దొరకడం లేదు. ఇప్పట్లో పరిస్థితి మారే అవకాశం లేని ఇమ్మిగ్రేషన్‌ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో ఉన్న హెచ్‌–1బీ వీసాదారులు ప్రస్తుతానికి అక్కడే ఉండిపోవాలని, ఇండియాకు వచ్చే సాహసం చేయొద్దని సూచిస్తున్నారు. ఒకవేళ వ
చి్చనా తిరిగివెళ్తారన్న గ్యారంటీ లేదని అంటున్నారు.

అమెరికా కంపెనీలకూ నష్టమే  
అమెరికాలో టెక్నాలజీ సంస్థలు, విద్య, వైద్య రంగాల కంపెనీలు తమకు అవసరమైన వృత్తి నిపుణుల కోసం ప్రధానంగా విదేశీయులపైనే ఆధారపడుతున్నాయి. వారికి హెచ్‌–1బీ వీసాలు లభించడానికి సహకరిస్తున్నాయి. వేలాది మంది హెచ్‌–1బీ వీసాదారులు స్వదేశాల్లోనే ఉండిపోవడం వల్ల ఆయా కంపెనీలు నష్టపోయే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ప్రాజెక్టులకు అంతరాయం కలుగుతోంది. వ్యయం పెరిగిపోతోంది. మరోవైపు అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న విప్రో, టీసీఎస్, టెక్‌ మహింద్రా లాంటి భారతీయ ఐటీ కంపెనీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. 

విదేశీ నిపుణులను కాకుండా అమెరికన్లను నియమించుకొనేందుకు ఆసక్తి చూపుతున్నాయి.  విదేశీయులపై ఆధారపడే పరిస్థితి లేకపోవడమే ఇందుకు కారణం. కఠినమైన వీసా నిబంధనల వల్ల అంతిమంగా అమెరికాకు నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నిబంధనలు తట్టుకోలేని వృత్తి నిపుణులు అమెరికాను కాకుండా ఇతర దేశాలను తమ గమ్యస్థానంగా ఎంచుకొనే అవకాశం ఉందని అంటున్నారు. వారు చివరకు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటారని, ఫలితంగా అమెరికాలోకి విదేశీ నిపుణుల రాక ఆగిపోతుందని చెబుతున్నారు. అదే జరిగితే ఇక్కడ ఉత్పత్తి కుంటుపడుతుందని, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.    

ఆ ఆలోచన మానుకోండి  
భారతీయుల కోసం గత 50 రోజుల్లో కొత్తగా వీసా ఇంటర్వ్యూ స్లాట్లు తెరిచినట్లు తాను వినలేదని అమెరికాలోని హూస్టన్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్‌ సంస్థ ప్రతినిది ఎమిలీ న్యూమన్‌ చెప్పారు. భారతీయులకు వీసాలు ఇవ్వాలన్న తొందర అమెరికా అధికారులకు ఎంతమాత్రం లేదన్నారు. సాధ్యమైనంత వరకు వీసాలు ఇవ్వకుండా ఉండడానికే ప్రయతి్నస్తున్నారని తెలిపారు. ఇది జో బైడెన్‌ పరిపాలన కాదని, ప్రస్తుతం పూర్తిగా విరుద్ధమైన పాలన అమెరికాలో కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. విదేశీయులకు వీసాలు ఇచ్చి, అమెరికాకు రప్పించుకోవాలన్న ఆలోచన ట్రంప్‌ ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. హెచ్‌–1బీ వీసాదారులు అమెరికాలోనే ఉండిపోవాలని, స్వదేశాలకు వెళ్లాలన్న ఆలోచన ఉంటే తక్షణమే మానుకోవాలని సూచించారు.  

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement