
ద్వంద్వ ప్రమాణాలకు బలవుతూ వస్తోంది
బ్రిక్స్ సదస్సులో మోదీ ఆక్షేపణ
డుమ్మా కొట్టిన జిన్‌పింగ్
వర్చువల్‌గా హాజరైన పుతిన్
రియో డీ జనీరో: ప్రపంచ ఆర్థికవ్యవస్థ పురోగతికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్న దక్షిణార్ధ గోళ దేశాలు (గ్లోబల్ సౌత్) కీలక నిర్ణయాలు, ప్రయోజనాల విషయంలో బాధిత దేశాలుగా మిగిలిపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికైంది.
సదస్సుకు అధ్యక్ష, ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తున్న బ్రెజిల్‌లోని రియో డీ జనీరో నగరంలో ఆదివారం బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. సదస్సులో భాగంగా ప్లీనరీ సెషన్‌లో తొలుత బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా మాట్లాడాక మోదీ మాట్లాడారు.
అవన్నీ నెట్‌వర్క్‌లేని ఫోన్లే
‘‘ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడే గ్లోబల్ సౌత్ దేశాలు చివరకు ద్వంద్వ ప్రమాణాల కారణంగా బాధితదేశాలుగా మిగిలిపోతున్నాయి. అభివృద్ది, వనరుల పంపిణీ, భద్రత వంటి ఏ రంగంలో చూసినా గ్లోబల్ సౌత్ దేశాలకు దక్కేది శూన్యం. వాతావరణ మార్పుల కట్టడికి ఆర్థిక సాయం, సుస్థిరాభివృద్ధి, అధునాతన సాంకేతికత బదిలీ వంటి అంశాల్లో గ్లోబల్‌సౌత్ దేశాలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నాయి.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వ్యవస్థలు, సంస్థలను తక్షణం సంస్కరణల బాట పట్టించి దక్షిణార్ధ గోళ దేశాలకు న్యాయం జరిగేలా చూడాలి. విశ్వ ఆర్థికానికి కీలక భాగస్వామిగా ఉండి కూడా ప్రధాన నిర్ణయాత్మక వేదికలపై గ్లోబల్‌సౌత్‌కు స్థానం దక్కడం లేదు. వాటి వాణి వినపడటం లేదు.
ఇది ప్రాతినిధ్యం దక్కట్లేదనే మాట కంటే విశ్వసనీయంగా, ప్రభావవంతంగా పనిచేసి కూడా ఎలాంటి ప్రయోజనం, లబ్ధి పొందలేపోవడమే గ్లోబల్ సౌత్ దేశాలకు అశనిపాతమవుతోంది. 20వ శతాబ్దంలో ఆవిర్భవించిన ఎన్నో కీలక అంతర్జాతీయ వ్యవస్థల్లో మూడింట రెండొంతుల జనాభాకు అసలు ప్రాతినిధ్యమే దక్కడం లేదు. గ్లోబల్‌సౌత్ దేశాలు లేకుండా ఇలాంటి వ్యవస్థలన్నీ సిమ్‌కార్డు ఉన్నా నెట్‌వర్క్‌లేని మొబైల్ ఫోన్ లాంటివే’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదంపై సమిష్టి పోరు
ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా పోరాడాల్సిన అవసరం చాలా ఉందని మోదీ పిలుపునిచ్చారు. పహల్గాంలో అమాయక పర్యాటకులపై పాక్ ప్రేరేపిత జైషే ముష్కర మఠా జరిపిన పాశవిక దాడిని ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాధినేతలకు ఆయన గుర్తు చేశారు. బ్రిక్స్ వేదికగా ఆ దాడిని మరోసారి ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు అండగా నిలిచాయని గుర్తు చేసుకు న్నారు. మరోసారి అలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా పాక్‌కు మర్చిపోలేని రీతిలో సైనికంగా గుణపాఠం చెప్పామన్నారు. ఉగ్ర మూలాలను పెకిలించివేయనిదే ప్రపంచ శాంతి అసాధ్యమన్నారు.
టైప్‌రైటర్లతో నేటి సాఫ్ట్‌వేర్ నడవదు
‘‘సమకాలీన ప్రపంచం, కాలానికి తగ్గట్లుగా మేం మారతాం అని ప్రస్ఫుటంగా తెలియజెప్పేందుకే బ్రిక్స్ కూటమిలోకి కొత్త దేశాలను ఆహ్వానిస్తున్నాం. మా బాటలోనే ఐరాస భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ, బహుళజాతి అభివృద్ధి బ్యాంక్‌లు సంస్కరణలను తీసుకొచ్చి తమ చిత్తశుద్ధిని చాటాలి’’ అని మోదీ హితవు పలికారు. కృత్రిమమేధ యుగంలో సాంకేతికత వారం వారం అప్‌డేట్ అవుతోంది.
అలాంటప్పుడు 80 ఏళ్ల క్రితం ఏర్పడిన ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల్లో ఎప్పటికప్పుడు సంస్కరణల అప్‌డేట్లు జరగాల్సిందే. 20వ శతాబ్దినాటి టైప్‌రైటర్లతో 21వ శతాబ్దంలోని అధునాతన సాఫ్ట్‌వేర్ నడవదు. స్వీయ ప్రయోజనాలకంటే కూడా భారత్ మానవాళి ప్రయోజనాలకే పట్టకడుతుంది. బ్రిక్స్‌దేశాలతో కలిసి సమష్టిగా అన్ని రంగాల్లో నిర్మాణాత్మకమైన ప్రాతినిధ్యం వహించేందుకు మేం సదా సిద్ధంగా ఉన్నాం’’ అని మోదీ అన్నారు.