జర్మనీలో కిల్లర్‌ డాక్టర్‌  | German doctor charged with murder of 15 patients | Sakshi
Sakshi News home page

జర్మనీలో కిల్లర్‌ డాక్టర్‌ 

Apr 17 2025 6:25 AM | Updated on Apr 17 2025 6:25 AM

German doctor charged with murder of 15 patients

15 మంది రోగులను హత్య చేసిన వైద్యుడు  

బెర్లిన్‌: తన వద్ద చికిత్స పొందుతున్న రోగులను కంటికి రెప్పలా సంరక్షించాల్సిన ఓ వైద్యుడు వారిని కిరాతకంగా హత్య చేశాడు. వైద్య వృత్తికే మచ్చ తెచ్చాడు. ఏకంగా 15 మంది రోగుల ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. హంతక డాక్టర్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. 40 ఏళ్ల ఆ డాక్టర్‌ 2021 సెపె్టంబర్‌ నుంచి 2024 జూలై వరకు 15 హత్యలు చేశాడు. బాధితుల్లో 12 మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వారి వయసు 25 నుంచి 94 ఏళ్ల దాకా ఉంది. చాలామంది వారి సొంత ఇళ్లల్లోనే హత్యకు గురయ్యారు.

 చికిత్స పేరిట రోగుల ఇళ్లకు చేరుకొని ప్రమాదకరమైన డ్రగ్స్‌ను ఇంజెక్షన్‌ రూపంలో ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో శ్వాస ఆగిపోయి నిమిషాల వ్యవధిలోనే రోగులు ప్రాణాలు విడిచారు. బాధితుల ఇళ్లకు నిప్పు పెట్టడం ద్వారా సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు కిల్లర్‌ డాక్టర్‌ ప్రయత్నించినట్లు తేలింది. తొలుత నలుగురి మృతిపై అనుమానం రాగా అధికారులు దర్యాప్తు చేపట్టారు. కానీ, డాక్టర్‌ చేతిలో 15 మంది హత్యకు గురైనట్లు వెల్లడయ్యింది. అయితే, అతడు ఈ హత్యలు ఎందుకు చేశాడన్నది తెలియరాలేదు. హంతకుడు తన నేరం ఒప్పుకోవడం లేదని సమాచారం. నిబంధనల ప్రకారం గోప్యత దృష్ట్యా అతడి పేరును ఇంకా బయటపెట్టలేదు. గత ఏడాది ఆగస్టు 6వ తేదీ నుంచి కస్టడీలో ఉన్నాడని, విచారణ కొనసాగుతోందని అధికారులు బుధవారం వెల్లడించారు. జర్మనీలో హత్య కేసుల్లో సాధారణంగా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు.   

Advertisement
 
Advertisement
Advertisement