చరిత్రలో కొన్ని ఆహార పదార్థాలు రుచిని మాత్రమే అందించవు.. అవి అనేక భావోద్వేగాలు, మహా విపత్తుల నుండి విజయవంతంగా గట్టెక్కిన అద్భుత ధైర్యసాహస
గాథల్ని కూడా తమతో మోసుకొస్తాయి. అలాంటిదే జర్మనీలో పుట్టిన ‘బౌమ్‌కూచెన్’ అనే ఈ ప్రత్యేకమైన కేక్! ట్రీ కేక్ అని పిలిచే ఈ స్వీట్, వలయాలతో కూడిన చెట్టు కాండాన్ని పోలి ఉండడం వల్ల.. జపాన్‌లో దీర్ఘాయుష్షుకు, శ్రేయస్సుకు చిహ్నంగా మారింది. ఈ రుచికరమైన కేక్ ప్రయాణానికి.. మధురమే కాదు, కష్టాల కడలిని
ఈదిన చారిత్రక నేపథ్యం ఉంది. దీని మూలాలు.. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో, జపాన్‌లోని ఓ చిన్న ద్వీపమైన నినోషిమాలో బందీగా ఉన్న ఒక జర్మన్ మిఠాయి తయారీదారుతో ముడిపడి ఉన్నాయి.
యుద్ధ శిబిరంలో మొలకెత్తిన శాంతియుత ఆలోచన
నినోషిమా.. ఒకప్పుడు సైనిక క్వారంటైన్ కేంద్రంగా, తొలి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ యుద్ధ ఖైదీల శిబిరంగా ఉండేది. 1915లో చైనాలోని క్వింగ్డావోలో పట్టుబడిన జర్మన్ మిఠాయి తయారీదారు కార్ల్ జుఖైమ్ 1917లో ఇక్కడికి వచ్చాడు. నినోషిమాలోని జర్మన్ బందీలకు కొంతమేర స్వేచ్ఛ ప్రసాదించారు. దాంతో వారు వంట చేసుకోవడానికి అనుమతి పొందారు. అప్పుడే జుఖైమ్ తన బౌమ్‌కూచెన్ వంటకాన్ని ఇక్కడే పరీక్షించాడని భావిస్తున్నారు.
ఇప్పటికీ, నినోషిమాలో సందర్శకులు వెదురు కర్రపై పిండిని పోసి, బొగ్గుల నిప్పుపై వేడి చేస్తూ, పొరలు పొరలుగా బౌమ్‌కూచెన్ వంటకం తయారీ నేర్చుకుంటారు. కేక్ పొరలు బ్రౌన్ రంగులోకి మారిన ప్రతిసారీ, కొత్త పొర పోస్తారు. ఇది చెట్టు కాండంపై వలయాల మాదిరిగా మారుతుంది. ఈ పద్ధతిని జుఖైమ్ నూరేళ్ల క్రితం ఆ యుద్ధ శిబిరంలోనే ప్రారంభించారు.
భూకంపాలు,
బాంబు దాడులను తట్టుకుని..
యుద్ధం ముగిసిన తర్వాత కూడా జుఖైమ్ జపాన్‌లోనే ఉండిపోయాడు. మార్చి 1919లో హిరోషిమా ప్రిఫెక్చరల్ ప్రొడక్ట్స్ ఎగ్జిబిషన్‌లో ఆయన చేతితో చేసిన బౌమ్‌కూచెన్ వాణిజ్యపరంగా ప్రారంభమైంది. అది అద్భుతమైన ప్రజాదరణ పొందింది. 1922లో యోకోహామాలో ఒక పేస్ట్రీ షాప్‌ను కూడా తెరిచాడు. కానీ, 1923లో వశ్నిచ్చిన గ్రేట్ కాంటో భూకంపం ఆ వ్యాపారాన్ని నాశనం చేసింది. ఆ తర్వాత కోబ్‌కు మకాం మార్చి కాఫీ షాప్ తెరిచాడు.
కానీ రెండో ప్రపంచ యుద్ధం ముగియడానికి కేవలం రెండు నెలల ముందు, కోబ్‌పై అమెరికా జరిపిన బాంబు దాడుల్లో ఆ స్టోర్ కూడా నేలమట్టమైంది. అయినా, జుఖైమ్ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. తన భార్య ఎలిస్, అంకితభావం గల జపనీస్ సిబ్బంది సహాయంతో కోబ్‌లోనే వ్యాపారాన్ని తిరిగి వృద్ధి చేసుకున్నాడు. జపాన్ లొంగిపోయేందుకు ఒక రోజు ముందు, ఆగస్టు 14, 1945న జుఖైమ్ అనారోగ్యంతో మరణించినప్పటికీ, ఆయన స్థాపించిన జుఖైమ్ కో లిమిటెడ్ నేటికీ జపాన్ అగ్రశ్రేణి కాన్ఫెక్షనరీ సంస్థలలో ఒకటిగా కొనసాగుతుండటం విశేషం.
బౌమ్‌కూచెన్.. శాంతికి, సౌభాగ్యానికి ప్రతీక!
ఈ ‘వృక్ష కేక్’ మూలాలు విపత్తులు, యుద్ధాలతో ముడిపడి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం జపాన్ సంస్కృతిలో ఇది విడదీయరాని భాగమైంది. దీని వలయాల నిర్మాణం నిరంతరాయమైన జీవితానికి, వృద్ధికి ప్రతీకగా భావిస్తారు. పెళ్లిళ్లు, పుట్టినరోజుల వంటి శుభకార్యాలకు అత్యంత ప్రజాదరణ పొందిన బహుమతిగా మారింది. మచ్చా, చిలగడదుంపల వంటి స్థానిక వంటకాలతో కలిపి జపనీస్ శైలిలో మార్పులు చెందింది. నినోషిమా వెల్‌కమ్ సెంటర్ అధిపతి కజుకి ఒటాని చెప్పినట్లు.. ‘జుఖైమ్ వంట.. శాంతి కోసం చేసిన వ్యక్తీకరణ’. మరణం, విధ్వంసం చుట్టుముట్టిన చోట ఊపిరి పోసుకున్న బౌమ్‌కూచెన్ అనే ఈ తీపి వంటకం.. కష్టాల నుంచి బయటపడిన మానవ ఆశలు, మనుగడకు ఒక నిశ్శబ్ద సాక్ష్యంగా నిలిచింది. ఇది కేవలం ఒక కేక్ కాదు. యుద్ధాలనూ, విపత్తులనూ జయించిన ఒక అద్భుతమైన కథ!
– సాక్షి, నేషనల్ డెస్క్


