జెన్-ఆల్ఫా (2010 నుంచి 2025 మధ్య జన్మించిన వారు) పెరుగుతున్న ప్రపంచంలో స్క్రీన్‌లు, స్మార్ట్ డివైస్‌లు జీవితంలో సహజ భాగాలు. వారికి ఇంటర్నెట్ లేకుండా గడిచిన రోజులు కథల్లో వినే విషయాల్లా అనిపించే అవకాశం ఉంది. డిజిటల్ కనెక్షన్ ఎప్పుడూ అందుబాటులో ఉండటంతో "ఆఫ్‌లైన్ జీవితం" అనే భావనే ఈ కొత్త తరానికి అపరిచితంగా మారుతోంది.
జెన్ ఆల్ఫా వాళ్లు ఇంటర్నెట్, డిజిటల్ పరికరాలను వాడుతూనే పెరుగుతున్నారు. అది వారి రోజువారీ జీవితంలో సహజ భాగంగా మారిపోయింది. వారు చదవడం, వినోదం పొందడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, విసుగొచ్చినప్పుడు లేదా ఒంటరిగా అనిపించినప్పుడు మాట్లాడడం వంటి పనులన్నీ ఎక్కువగా డిజిటల్ పరికరాలు, ఆన్‌లైన్ వేదికల ద్వారానే చేస్తున్నారు.
అంతకుముందున్న తరాలవారికి ఆన్‌లైన్‌లో ఉండటం ఒక కార్యకలాపం. వారు లాగిన్ అయ్యేవారు, అంతర్జాలంలో కొంత సమయం గడిపేవారు, తర్వాత లాగ్ ఆఫ్ అయ్యేవారు. జెన్ ఆల్ఫాకు మాత్రం ఇంటర్నెట్ అనేది వారు పెరిగే వాతావరణంగా మారిపోయింది.
జెన్ ఆల్ఫా తరం కంటే ముందు ఉన్న తరాలు ఇంటర్నెట్ లేకుండా కూడా జీవితాన్ని గడిపాయి. ప్రత్యక్షంగా మనుషులను కలుసుకోవడం, బయట ఆటలు ఆడటం, పుస్తకాల ద్వారానే సమాచారం తెలుసుకోవడం వంటి "ఆఫ్‌లైన్" జీవన విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని తొలి తరంగా జెన్ ఆల్ఫా తరం మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఇంటర్నెట్ లేని జీవితం ఎలా ఉండేదో జెన్ ఆల్ఫా వారికి పూర్తిగా తెలియకపోవచ్చు.
అంటే పిల్లల జీవితంలోని అన్ని దశల్లో, అన్ని విధాలుగా వర్చువల్ సంస్కృతి పెరుగుతోంది. డిజిటల్ ప్రపంచంలో జరిగే సామాజిక, విద్యా, వినోద కార్యకలాపాలకే వారు పరిమితం అవుతున్నారు. జెన్ ఆల్ఫాకు సాంకేతికత కేవలం వినోదం లేదా అభ్యాసానికి ఉపయోగించే సాధనం కాదు. సమాచారం పొందడం, సంభాషించడం, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుభవించడం వంటి విషయాల్లో అది ప్రధాన మార్గంగా మారుతోంది.
బ్లాక్‌బోర్డుల నుంచి స్మార్ట్‌బోర్డుల వరకు..
కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే.. మనం బ్లాక్‌బోర్డులను ఉపయోగించేవాళ్లమని గుర్తుకు వస్తుంది. ఉపాధ్యాయులు బోర్డులపై రాసేవారు. విద్యార్థులు వాటిని కాపీ చేసేవారు. యువతపై ప్రభావం చూపుతూ వేగవంతమైన సాంకేతికత ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. 2025లో భారత్‌లోని స్కూళ్లలో తరగతి గదుల‍్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. బ్లాక్‌బోర్డుల స్థానంలో స్మార్ట్‌బోర్డులు వచ్చాయి. ఇప్పుడు విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించడానికి ఎక్కువగా రాయడం లేదు. వీడియోలు చూపిస్తున్నారు, పీడీఎఫ్‌లు తెరిచి బోధిస్తున్నారు.
మన తల్లిదండ్రులు మన చిన్నతనంలో చెప్పిన “ఫోన్ ఎక్కువగా చూడొద్దు, కళ్లపై ప్రభావం పడుతుంది” లేదా “స్క్రీన్ సమయం తగ్గించు” అనే మాటలు ఇప్పుడు పనిచేయడం లేదు. ఒకప్పుడు దృష్టి మళ్లించే వస్తువులుగా భావించిన అదే స్క్రీన్లు ఇప్పుడు తరగతి గదులు, గ్రంథాలయాలు, చదువులో భాగస్వాములుగా మారాయి.
బియ్యం బస్తాల్లా బ్యాగులు ఉండేవి కదా..
పాఠశాల బ్యాగు పరిస్థితి మీకు గుర్తుండే ఉంటుంది. బియ్యం బస్తాల్లా బ్యాగులను మోసుకెళ్లేవాళ్లం. 6వ తరగతికే వెన్నునొప్పి వచ్చేది. ఐదారు సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు ఉండేవి.
జెన్ ఆల్ఫా పిల్లల సంగతే వేరు. తేలికైన బ్యాగులు ఉంటున్నాయి. కొన్ని స్కూళ్లకు పిల్లలు బ్యాగులు లేకుండానే వెళ్తున్నారు. ఎందుకంటే పాఠ్యపుస్తకం ఇప్పుడు పీడీఎఫ్ రూపంలో ఉంది. నోట్స్ గూగుల్ డాక్‌లో ఉన్నాయి. హోం వర్క్ గూగుల్ క్లాస్‌రూమ్‌లో ఇస్తున్నారు. చదువుకు సంబంధించిన అనేక విషయాలు వాట్సాప్ గ్రూపుల్లో లింక్ రూపంలో వస్తున్నాయి. అన్నీ టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌లోని ఒక ఫోల్డర్‌లో క్రమబద్ధంగా, సెర్చ్ చేయడానికి సులభంగా ఉంటాయి.
గత తరాలు పుస్తకాలను చదవడం నేర్చుకున్నాయి. నేటి విద్యార్థులు వీడియోలు, సామాజిక మాధ్యమాలు, ఆగ్మెంటెడ్ రియాలిటీ, కృత్రిమ మేధస్సు ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకుంటున్నారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే డిజిటల్ చిత్రాలు, సమాచారం జోడించి చూపే సాంకేతికత.
జెన్ ఆల్ఫా, స్క్రీన్ల మధ్య బంధం ఇప్పటికే పెరుగుతుండగా, కోవిడ్-19 మహమ్మారి దాన్ని మరింత వేగవంతం చేసింది. దాదాపు మూడు సంవత్సరాలు విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. తరగతులకు హాజరయ్యారు, పరీక్షలకు సిద్ధమయ్యారు, అసైన్‌మెంట్‌లు సమర్పించారు, స్నేహ సంబంధాలు కూడా పరికరాల ద్వారానే కొనసాగించారు. స్క్రీన్లు ఆప్షన్‌గా కాకుండా అత్యవసరంగా మారాయి.
దీనిలో ఉన్న మంచి విషయం నిజమే. వీడియోలో అగ్నిపర్వత విస్ఫోటనాన్ని చూసే పిల్లవాడు లేదా రంగులతో కూడిన కిరణజన్య సంయోగక్రియ చలనచిత్రాన్ని చూసే పిల్లవాడు... బోర్డుపై గీసిన చాక్ చిత్రాన్ని చూసే పిల్లవాడితో పోల్చితే దాన్ని భిన్నంగా అర్థం చేసుకుంటాడు.
ఇప్పుడు “పుస్తకం ఇంట్లో మరిచిపోయాను” అనే మాట లేదు. “అన్నీ నా చేతిలోనే ఉన్నాయి” అనే పరిస్థితి వచ్చింది. విద్యార్థులు అదే స్క్రీన్‌పై వారు యూట్యూబ్ చూస్తారు, స్నేహితులతో సంభాషిస్తారు. జెన్ ఆల్ఫా పిల్లవాడికి ఏదైనా అర్థం కాకపోతే పేరాను మళ్లీ చదవడు.. వీడియో కోసం వెతుకుతాడు. అది 8 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే, అవసరమైన భాగానికి నేరుగా వెళ్లిపోవచ్చు.
ఇప్పుడు దాదాపు ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం లభిస్తుంది. మిలీనియల్స్, జెన్ జెడ్ తరాలకు ఆఫ్‌లైన్‌లో ఉండటం రోజువారీ జీవితంలో సాధారణ భాగం. జెన్ ఆల్ఫాకు “ఆఫ్‌లైన్” క్రమంగా ఒక అనుభవం కంటే ఒక భావనగా మారవచ్చు. వారు దాని గురించి వింటారు గానీ, తరచుగా అనుభవించకపోవచ్చు.


