యూరప్‌ నిప్పుల గుండం | France records its hottest day ever as Europe withers in early heat wave | Sakshi
Sakshi News home page

యూరప్‌ నిప్పుల గుండం

Jun 24 2026 5:49 AM | Updated on Jun 24 2026 5:49 AM

France records its hottest day ever as Europe withers in early heat wave

నిప్పుల కొలిమిలా యూరప్‌ 

సగం ఫ్రాన్స్‌కు రెడ్‌ అలర్ట్‌  

ఐదు రోజుల్లో 40 మంది మృతి!

నిద్ర లేచేసరికే ఒళ్లంతా చెమటలు.. 
గాల్లో నిప్పులు కురుస్తున్నట్లు అనుభూతి.. ప్రస్తుతం ఫ్రాన్స్, బ్రిటన్‌ దేశస్తుల పరిస్థితిని చూస్తే.. కదలకుండా కూర్చున్నా ప్రాణాలు పోయేలా ఎండలు మండిపోతున్నాయి. వేడి తట్టుకోలేక ఉపశమనం కోసం ఈతకు వెళ్లిన వారిలో ఐదు రోజుల్లోనే ఏకంగా 40 మంది నీట మునిగి మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం 
పడుతోంది. ఖండంలో మెజారిటీ జనాభా ప్రస్తుతం మునుపెన్నడూ చూడని అత్యంత అసాధారణ ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

సగం దేశానికి గండం
ఫ్రాన్స్‌ జాతీయ వాతావరణ సంస్థ ‘మెటియో ఫ్రాన్స్‌’దేశంలోని దాదాపు సగానికి పైగా ప్రాంతాలను అత్యంత ప్రమాదకరమైన ‘రెడ్‌ హీట్‌ వేవ్‌ అలర్ట్‌’పరిధిలోకి తెచ్చింది. పగలు, రాత్రి తేడా లేకుండా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 

మృతుల్లో యువకులే అధికం 
ఫ్రాన్స్‌ ప్రధాని సెబాస్టియన్‌ లెకోర్ను సంక్షోభ సమీక్షా సమావేశం అనంతరం మాట్లాడుతూ.. గత గురువారం నుండి నీట మునిగి చనిపోయిన 40 మందిలో అత్యధికులు యువకులేనని తెలిపారు. ఫ్రాన్స్‌లో ఇళ్లకు, ప్రజా రవాణా వ్యవస్థలకు ఎయిర్‌ కండిషనింగ్‌ సదుపాయం పెద్దగా లేకపోవడంతో స్కూళ్లు, రైళ్ల రాకపోకలు, క్రీడా ఈవెంట్లపై ఈ ఎండల ప్రభావం పడింది. మానవ తప్పిదాల వల్లే వాతావరణంలో ఈ మార్పులు వస్తున్నాయని, రాబోయే ఐదేళ్లలో వాతావరణ రికార్డులు మరిన్ని బద్దలవుతాయని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది.  

బ్రిటన్‌ను వణికిస్తున్న వేడి గాలులు 
ఇటు ఇంగ్లిష్‌ చానల్‌ అవతలి వైపున్న బ్రిటన్‌లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. బ్రిటన్‌ వాతావరణ సంస్థ బుధ, గురువారాల కోసం ‘రెడ్‌ ఎక్స్‌ట్రీమ్‌ హీట్‌ వార్నింగ్‌’జారీ చేసింది. జూన్‌ నెల చరిత్రలోనే ఇవి అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు కావచ్చు. దక్షిణ ఇంగ్లాండ్‌లో 37 డిగ్రీలు, ఆగ్నేయ వేల్స్‌లో 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో తీవ్రత పెరిగి 39 డిగ్రీలు దాటవచ్చని, శుక్రవారం నుండి ఎండలు కాస్త తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.  

రికార్డులు బద్దలు
‘ఫ్రాన్స్‌ అంతటా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. దేశవ్యాప్తంగా ఉక్కిరిబిక్కిరి చేసేలా, తీవ్ర అలసటకు గురిచేసేలా ఎండలు కొనసాగుతున్నాయి’.. అని మెటియో ఫ్రాన్స్‌ పేర్కొంది. ఈ వారాంతం వరకు చాలా నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటే అవకాశం ఉందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌టైమ్‌ రికార్డులను తిరగరాసేలా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందంటున్నారు.

ఇదిలావుంటే, ఈ పరిస్థితి 2003 ఆగస్టు నాటి ఘోర ఉష్ణోగ్రతలను గుర్తు చేస్తోంది. అప్పట్లో ఏసీలు లేని వృద్ధాశ్రమాలు, అపార్ట్‌మెంట్లలో నివసించే దాదాపు 15,000 మంది వృద్ధులు ఎండల ధాటికి బలయ్యారు. ఆ తర్వాతే ఫ్రాన్స్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘హీట్‌ వాచ్‌ వార్నింగ్‌ సిస్టమ్‌’ను తీసుకొచ్చింది. యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన ‘కోపర్నికస్‌ క్లైమేట్‌ చేంజ్‌ సర్వీస్‌’ప్రకారం.. 1980ల నుండి ప్రపంచ సగటు కంటే యూరప్‌ ఖండం రెట్టింపు వేగంతో వేడెక్కుతోంది.  

    – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement