న్యూఢిల్లీ: గాజాలో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి (యూఎన్) నియమించిన స్వతంత్ర అంతర్జాతీయ దర్యాప్తు కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాకు చెందిన చిన్న పిల్లలను వ్యూహాత్మకంగా లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని, అక్కడ మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, నరమేధం జరుగుతున్నాయని ఈ కమిషన్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఉన్నత స్థాయి ఐరాస దర్యాప్తు కమిషన్‌కు భారతదేశానికి చెందిన ప్రముఖ మాజీ న్యాయమూర్తి, జస్టిస్ శ్రీనివాసన్ మురళీధర్ నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఈ నివేదికను పక్షపాతంతో కూడిన ఒక ‘ప్రచార పత్రం’గా ఇజ్రాయెల్ కొట్టిపారేసింది.
జస్టిస్ మురళీధర్ సంచలన వ్యాఖ్యలు
ఒరిస్సా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ శ్రీనివాసన్ మురళీధర్ ప్రస్తుతం ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు, తూర్పు జెరూసలేం, ఇజ్రాయెల్‌పై దర్యాప్తు చేస్తున్న ఐరాస కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు. నివేదిక విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్ (2025)లో కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చినప్పటికీ, అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేస్తూ, పాలస్తీనా చిన్నారులపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా పాలస్తీనా ప్రజల మనుగడను, వారి భవిష్యత్తును నిర్ణయించుకునే సామర్థ్యాన్ని ఇజ్రాయెల్ దెబ్బతీస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
నివేదికలోని షాకింగ్ నిజాలు
పాలస్తీనా గ్రూపును పూర్తిగా లేదా పాక్షికంగా తుడిచిపెట్టాలనే ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ అధికారులు, భద్రతా దళాలు ఈ దాడులకు పాల్పడుతున్నట్లు ఆధారాలు ఉన్నాయని కమిషన్ పేర్కొంది. కాల్పుల విరమణ తర్వాత కూడా చిన్నారులను ఉద్దేశపూర్వకంగానే చంపివేసినట్లు ఆధారాలు లభించాయని, ఇదే వారి నరమేధ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోందని జస్టిస్ మురళీధర్ తెలిపారు. మరోవైపు, ఈ కమిషన్ తీవ్ర పక్షపాతంతో, రాజకీయ ప్రేరేపితంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ఇజ్రాయెల్, ఈ నివేదికను పూర్తిగా తిరస్కరించింది.
జస్టిస్ మురళీధర్ ప్రస్థానం
జస్టిస్ శ్రీనివాసన్ మురళీధర్ భారత న్యాయవ్యవస్థలో ఎన్నో మైలురాళ్ల వంటి తీర్పులతో చెరగని ముద్ర వేశారు. చెన్నైలో న్యాయవాదిగా ప్రస్థానాన్ని ప్రారంభించి, 1990లో సుప్రీంకోర్టు అడ్వకేట్-ఆన్-రికార్డ్ పరీక్షలో టాపర్‌గా నిలిచారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా, లా కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. భారతదేశంలో హోమోసెక్సువాలిటీని నేరరహితం చేసిన బెంచ్‌లో ఆయన భాగస్వామిగా ఉన్నారు. అలాగే, 1984 నాటి యాంటీ-సిఖ్ అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ శిక్షను ఖరారు చేయడం, 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో బాధితుల సురక్షిత తరలింపు కోసం అర్థరాత్రి అత్యవసర విచారణ జరిపి పోలీసుల వైఖరిని తప్పుబట్టడం వంటివి ఆయన కెరీర్‌లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు.
ఇది కూడా చదవండి: కరాచీ దాడిపై పాక్‌కు భారత్ గట్టి కౌంటర్


