Netherlands: విద్యుత్‌ విమానం వచ్చేస్తోంది... | Dutch Startup Elysian Pursues Large Battery-Electric Airliner | Sakshi
Sakshi News home page

Netherlands: విద్యుత్‌ విమానం వచ్చేస్తోంది...

Aug 11 2024 4:43 AM | Updated on Aug 11 2024 4:43 AM

Dutch Startup Elysian Pursues Large Battery-Electric Airliner

ఏకధాటిగా 800 కి.మీ. ప్రయాణం 

2030 నాటికి అందుబాటులోకి! 

ప్రపంచమంతటా విద్యుత్‌ వాహనాల హవా పెరిగిపోతోంది. అదే బాటలో త్వరలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ విమానం కూడా రానుంది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 805 కిలోమీటర్ల దూరం వెళ్లగలిగేలా దీన్ని తయారు చేస్తున్నట్టు నెదర్లాండ్స్‌కు చెందిన ఎలిసియాన్‌ అనే స్టార్టప్‌ కంపెనీ ప్రకటించింది. ఈ9ఎక్స్‌గా పిలుస్తున్న ఈ విమానంలో 90 మంది ప్రయాణించవచ్చు. దీన్ని 2030 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ చెబుతోంది. 

‘‘అప్పటికల్లా విద్యుత్‌ బ్యాటరీల సామర్థ్యం బాగా పెరుగుతుంది. కనుక మా విమానం ప్రయాణ రేంజ్, మోసుకెళ్లగలిగే ప్రయాణికుల సంఖ్య కూడా కచ్చితంగా పెరుగుతాయి’’ అని కంపెనీ డిజైన్, ఇంజనీరింగ్‌ డైరెక్టర్‌ రేనార్డ్‌ డి వ్రైస్‌ వివరించారు. వీలైనంత తక్కువ బరువు, అదే సమయంలో పూర్తిస్థాయి భద్రత, గరిష్ట సామర్థ్యం ఉండేలా విమానాన్ని డిజైన్‌ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ‘‘ఈ9ఎక్స్‌ చూసేందుకు 1960ల నాటి జెట్‌ మాదిరిగా ఉంటుంది. 

ఇందులో 8 ప్రొపెల్లర్‌ ఇంజన్లు, బోయింగ్‌ 737, ఎయిర్‌బస్‌ ఏ230లను కూడా తలదన్నేలా 42 మీటర్ల పొడవైన రెక్కలుంటాయి’’ అని తెలిపారు. ఒక్కసారి మార్కెట్లోకి వచ్చిందంటే దేశీయంగా తక్కువ దూరాలకు తమ విమానమే బెస్ట్‌ ఆప్షన్‌గా మారుతుందని ధీమా వెలిబుచ్చారు. ‘‘అంతేకాదు, వాయు, శబ్ద కాలుష్యం కారణంగా విమా నాల రాకపోకలపై ఆంక్షలున్న ద్వితీయశ్రేణి నగరాలకు మా విమానం వరప్రసాదమే కాగలదు.

 పైగా ప్రయాణ సమయంలో విమానం లోపల ఎలాంటి శబ్దాలూ విని్పంచవు. ఇది ప్రయాణికులకు చక్కని అనుభూతినిస్తుంది. ప్రస్తుత విమానాల్లో క్యాబిన్‌ లగేజీ పెద్ద సమస్య. మా విమానంలో క్యాబిన్‌ లగేజీ సామర్థ్యాన్ని బాగా పెంచడంపైనా డిజైనింగ్‌లో ప్రత్యేక దృష్టి పెట్టాం. అదనపు క్యాబిన్‌ లగేజ్‌ ప్రయాణికులకు బాగా ఆకట్టుకునే అంశంగా నిలుస్తుంది’’ అని చెబుతున్నారు.

అరగంటలో చార్జింగ్‌ 
ఎలక్ట్రిక్‌ వాహనం అనగానే ప్రధానంగా ఎదురయ్యే సమస్య చార్జింగ్‌. విపరీత మైన పోటీ నెలకొని ఉండే దేశీయ వైమానిక రంగంలో విమానం ఎంత త్వరగా తర్వాతి ప్రయాణానికి సిద్ధమవుతుందన్నది చాలా కీలకం. ముఖ్యంగా చౌక విమానయాన సంస్థలకు ప్రయాణికుల ఆదరణను నిర్ణయించడంలో దీనిదే కీలక పాత్ర. ‘‘ఈ అంశంపైనా ఇప్పట్నుంచే దృష్టి సారించాం. అరగంటలోనే విమానం ఫుల్‌ చార్జింగ్‌ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అని వ్రైస్‌ చెప్పారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement