breaking news
electric passenger plane
-
జస్ట్ రూ.500 ఖర్చుతో ఎగిరిన విమానం!
విమాన ప్రయాణం అంటే భారీ ఇంధన వ్యయంతో కూడుకున్న వ్యవహారమనే భావన చాలా మందికి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా, అమెరికాలో జరిగిన ఓ ప్రయోగాత్మక విమాన ప్రయాణం భవిష్యత్ ఎలక్ట్రిక్ ఏవియేషన్‌పై ఆసక్తిని పెంచుతోంది. అమెరికాకు చెందిన హార్ట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన X1 బ్యాటరీ-ఎలక్ట్రిక్ విమానం ఈ నెల 12న తొలిసారి గాల్లోకి ఎగిరింది. 27 నిమిషాల ఈ పరీక్షా ప్రయాణానికి సుమారు 5 డాలర్లు (రూ.500 లోపే) విలువైన విద్యుత్ మాత్రమే వినియోగించినట్లు కంపెనీ వెల్లడించింది.1,100 అడుగుల ఎత్తుకు..న్యూయార్క్‌లోని ప్లాట్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన X1.. 27 నిమిషాల పాటు ప్రయాణించింది. ఈ సమయంలో 1,100 అడుగుల (సుమారు 335 మీటర్లు) ఎత్తుకు చేరుకుంది. ఒక పైలట్‌తో నిర్వహించిన ఈ పరీక్షలో ప్రయాణికులను ఎవరినీ తీసుకెళ్లలేదు. టేకాఫ్, పైకి ఎగరడం, మలుపులు, ల్యాండింగ్ వంటి దశలను పరీక్షించారు. విమానం పూర్తిగా బ్యాటరీలతో నడిచింది. దీని ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థ ఒక మెగావాట్‌కు పైగా శక్తిని అందించింది.చిన్న విమానం కాదు..X1ను సాధారణ చిన్న ప్రయోగాత్మక విమానంగా భావించడానికి వీల్లేదు. దీని రెక్కల వెడల్పు 106 అడుగులు (32.3 మీటర్లు), పొడవు 76 అడుగులు (23.2 మీటర్లు). టేకాఫ్ సమయంలో దీని బరువు 25,000 పౌండ్లకు పైగా అంటే సుమారు 11.3 టన్నులు. ఈ పరిమాణంతో X1 ఇప్పటివరకు గాల్లోకి ఎగిరిన అతిపెద్ద బ్యాటరీ-ఎలక్ట్రిక్ విమానంగా హార్ట్ ఏరోస్పేస్ పేర్కొంది.టికెట్ కూడా అంత చౌకేనా?ఇక్కడ రూ.500 ఖర్చుతోనే విమానం ప్రయాణించింది అంటే ఆ మొత్తం కేవలం 27 నిమిషాల పరీక్షా ప్రయాణంలో వినియోగించిన విద్యుత్ విలువ మాత్రమే. పైలట్ జీతం, నిర్వహణ, బీమా, విమానాశ్రయ రుసుములు, విమానం కొనుగోలు లేదా ఫైనాన్సింగ్ ఖర్చులు, బ్యాటరీల తయారీ, వాటి క్షీణత వంటి వ్యయాలు ఇందులో లేవు. అందువల్ల భవిష్యత్తులో విమాన టికెట్ రూ.500కు లభిస్తుందని దీన్ని బట్టి చెప్పలేం. అయితే విమానాన్ని నడిపే ఇంధన వ్యయం గణనీయంగా తగ్గే అవకాశం ఎలక్ట్రిక్ విమానాల ప్రధాన ఆకర్షణల్లో ఒకటి.అసలు లక్ష్యం 30 సీట్ల హైబ్రిడ్ విమానంX1ను కేవలం రికార్డు కోసం రూపొందించలేదు. హార్ట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తున్న ES-30 అనే 30 సీట్ల హైబ్రిడ్-ఎలక్ట్రిక్ ప్రాంతీయ విమానానికి అవసరమైన సాంకేతికతలను పరీక్షించడమే దీని ప్రధాన ఉద్దేశం. ES-30కు 2031లో సేవల్లోకి ప్రవేశించే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తోంది. కంపెనీ వివరాల ప్రకారం, ES-30 పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో సుమారు 200 కిలోమీటర్లు, హైబ్రిడ్ మోడ్‌లో గరిష్ఠంగా 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రూపొందిస్తున్నారు. సుమారు 30 నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తి చేసే లక్ష్యమూ ఉంది.నిర్వహణ ఖర్చులు 40 శాతానికి పైగా తగ్గుతాయటసాంప్రదాయ ప్రాంతీయ విమానాలతో పోలిస్తే ES-30 నిర్వహణ వ్యయం 40 శాతానికి పైగా తగ్గవచ్చని హార్ట్ ఏరోస్పేస్ అంచనా వేస్తోంది. తక్కువ విద్యుత్ వ్యయం, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థలో తక్కువ కదిలే భాగాలు, సరళమైన నిర్వహణ, విమానం ఎక్కువ సమయం అందుబాటులో ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణమని చెబుతోంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ కెనడా, జేఎస్ఎక్స్ వంటి సంస్థలు ES-30పై ఇప్పటికే ఆసక్తి లేదా కమిట్మెంట్లు వ్యక్తం చేశాయి.మరి చౌక విమాన ప్రయాణం ఎప్పుడు?ఎలక్ట్రిక్ విమానాలు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గే అవకాశం లేదు. టికెట్ ధరలో ఇంధనం లేదా విద్యుత్ ఖర్చుతో పాటు సిబ్బంది, విమానాశ్రయ రుసుములు, పన్నులు, నిర్వహణ, విమాన కొనుగోలు వ్యయం, మార్గంలో డిమాండ్ వంటి అనేక అంశాలు ఉంటాయి. అయితే సాంకేతికత ఆశించిన స్థాయికి చేరుకుంటే తక్కువ దూరం, ప్రాంతీయ మార్గాల్లో ప్రయాణ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న విమానాలను తక్కువ ఇంధన ఖర్చుతో నడపగలిగితే ప్రస్తుతం ఆర్థికంగా అనుకూలంగా లేని కొన్ని ప్రాంతీయ మార్గాలను తిరిగి ప్రారంభించేందుకు విమానయాన సంస్థలకు అవకాశం లభించవచ్చు.ఇదీ చదవండి: భారీ సంఖ్యలో టెక్ సిబ్బంది అవసరం.. -
Netherlands: విద్యుత్ విమానం వచ్చేస్తోంది...
ప్రపంచమంతటా విద్యుత్ వాహనాల హవా పెరిగిపోతోంది. అదే బాటలో త్వరలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ విమానం కూడా రానుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 805 కిలోమీటర్ల దూరం వెళ్లగలిగేలా దీన్ని తయారు చేస్తున్నట్టు నెదర్లాండ్స్‌కు చెందిన ఎలిసియాన్ అనే స్టార్టప్ కంపెనీ ప్రకటించింది. ఈ9ఎక్స్‌గా పిలుస్తున్న ఈ విమానంలో 90 మంది ప్రయాణించవచ్చు. దీన్ని 2030 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ చెబుతోంది. ‘‘అప్పటికల్లా విద్యుత్ బ్యాటరీల సామర్థ్యం బాగా పెరుగుతుంది. కనుక మా విమానం ప్రయాణ రేంజ్, మోసుకెళ్లగలిగే ప్రయాణికుల సంఖ్య కూడా కచ్చితంగా పెరుగుతాయి’’ అని కంపెనీ డిజైన్, ఇంజనీరింగ్ డైరెక్టర్ రేనార్డ్ డి వ్రైస్ వివరించారు. వీలైనంత తక్కువ బరువు, అదే సమయంలో పూర్తిస్థాయి భద్రత, గరిష్ట సామర్థ్యం ఉండేలా విమానాన్ని డిజైన్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ‘‘ఈ9ఎక్స్ చూసేందుకు 1960ల నాటి జెట్ మాదిరిగా ఉంటుంది. ఇందులో 8 ప్రొపెల్లర్ ఇంజన్లు, బోయింగ్ 737, ఎయిర్‌బస్ ఏ230లను కూడా తలదన్నేలా 42 మీటర్ల పొడవైన రెక్కలుంటాయి’’ అని తెలిపారు. ఒక్కసారి మార్కెట్లోకి వచ్చిందంటే దేశీయంగా తక్కువ దూరాలకు తమ విమానమే బెస్ట్ ఆప్షన్‌గా మారుతుందని ధీమా వెలిబుచ్చారు. ‘‘అంతేకాదు, వాయు, శబ్ద కాలుష్యం కారణంగా విమా నాల రాకపోకలపై ఆంక్షలున్న ద్వితీయశ్రేణి నగరాలకు మా విమానం వరప్రసాదమే కాగలదు. పైగా ప్రయాణ సమయంలో విమానం లోపల ఎలాంటి శబ్దాలూ విని్పంచవు. ఇది ప్రయాణికులకు చక్కని అనుభూతినిస్తుంది. ప్రస్తుత విమానాల్లో క్యాబిన్ లగేజీ పెద్ద సమస్య. మా విమానంలో క్యాబిన్ లగేజీ సామర్థ్యాన్ని బాగా పెంచడంపైనా డిజైనింగ్‌లో ప్రత్యేక దృష్టి పెట్టాం. అదనపు క్యాబిన్ లగేజ్ ప్రయాణికులకు బాగా ఆకట్టుకునే అంశంగా నిలుస్తుంది’’ అని చెబుతున్నారు.అరగంటలో చార్జింగ్ ఎలక్ట్రిక్ వాహనం అనగానే ప్రధానంగా ఎదురయ్యే సమస్య చార్జింగ్. విపరీత మైన పోటీ నెలకొని ఉండే దేశీయ వైమానిక రంగంలో విమానం ఎంత త్వరగా తర్వాతి ప్రయాణానికి సిద్ధమవుతుందన్నది చాలా కీలకం. ముఖ్యంగా చౌక విమానయాన సంస్థలకు ప్రయాణికుల ఆదరణను నిర్ణయించడంలో దీనిదే కీలక పాత్ర. ‘‘ఈ అంశంపైనా ఇప్పట్నుంచే దృష్టి సారించాం. అరగంటలోనే విమానం ఫుల్ చార్జింగ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అని వ్రైస్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్


