దుబాయ్: రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే ఎయిర్ ట్యాక్సీ సేవను ఈ ఏడాది చివరి నాటికి దుబాయ్‌లో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో 45 నిమిషాలు పట్టే ప్రయాణాలు, ఫ్లయింగ్ ట్యాక్సీ ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే పూర్తవుతాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పామ్ జుమేరాకు 10 నిమిషాల్లో చేరుకోవచ్చు.
ఈ ట్యాక్సీ సర్వీస్ పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులకు దుబాయ్ నగరంలో వేగవంతమైన, సులభమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించనుంది. అమెరికాకు చెందిన జోబీ ఏవియేషన్ సంస్థ రూపొందించిన జోబీ ఎస్-4 ఎలక్ట్రిక్ విమానాన్ని ఈ సర్వీస్‌లో ఉపయోగించనున్నారు. పైలట్‌తో కలిపి మొత్తం ఐదుగురు ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. ఇది గంటకు సుమారు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
మొదటి దశలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ మెరీనా, పామ్ జుమేరాలోని అట్లాంటిస్ ది రాయల్ హోటల్ సమీప ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టీఏ) చైర్మన్ మత్తర్ అల్ తయర్ తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు చెప్పారు.
పూర్తిగా విద్యుత్తుతో నడిచే ఎయిర్ ట్యాక్సీలు కావడంతో శబ్ద, పర్యావరణ కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. ప్రయాణికులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఎయిర్ ట్యాక్సీలను బుక్ చేసుకోవచ్చు. దుబాయ్ ప్రజా రవాణా నెట్‌వర్క్‌తో ఈ సేవలను అనుసంధానించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. అయితే ఎయిర్ ట్యాక్సీ ఛార్జీలు ఎలా ఉంటాయన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు.


