
భూతల, గగనతల దాడుల నుంచి కాపాడే రక్షణ వ్యవస్థ
అమెరికా భద్రతకు త్వరలో అత్యాధునిక వ్యవస్థ
175 బిలియన్ డాలర్లతో ప్రతిపాదించిన అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్: ప్రపంచంలోనే అగ్రరాజ్యం, అతిపెద్ద ఆర్థికవ్యవస్థ, అమేయమైన సైనిక శక్తి.. ఇలా అన్నీ ఉన్నా అమెరికాను సువిశాలమైన, విస్తారమైన భూభాగం భయపెడుతోంది. భూమి ఎక్కువుంటే ఎందుకు భయపడాలనే సందేహం రావొచ్చు. దేశం ఓ మోస్తరు విస్తీర్ణంలో ఉండే ఉన్న భూభాగమంతటికీ సమగ్ర స్థాయిలో రక్షణ కల్పించొచ్చు. అదే విశాల భూభాగమైతే శత్రు దేశ క్షిపణులు ఎక్కడ పడతాయో ఊహించడం కూడా కష్టం.
అమెరికాను వేధిస్తున్న ఈ సమస్యకు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థతో చెక్ పెడతానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో ప్రకటించారు. మొత్తంగా 175 బిలియన్ డాలర్ల వ్యయంతో గోల్డెన్ డోమ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాట్లుచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 2029 జనవరిలోగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి యావత్ అమెరికా భూభాగాన్ని శత్రు దుర్బేధ్యంగా మార్చేస్తానని ఆయన ప్రకటించారు.
అయితే ఈ గోల్డెన్ డోమ్ వ్యవస్థను ఏర్పాటుచేయడం అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారమని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ స్పష్టంచేసింది. భూమి మీదే కాదు ఆకాశంలోనూ ఇందుకు సంబంధించి లేజర్ కాంతిపుంజం వెదజల్లే వ్యవస్థలను ప్రవేశపెట్టాల్సి ఉంటుందని బడ్జెట్ ఆఫీస్ తెలిపింది. ఇంతటి సంక్లిష్టమైన అధునాతన సాంకేతికతతో కూడిన అసాధారణ వ్యవస్థ నిర్వహణకు రాబోయే 20 సంవత్సరాల్లో ఏకంగా 542 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనావేసింది. ప్రస్తుతానికి అమెరికా పార్లమెంట్‌లో ట్రంప్ తొలి దఫాగా ప్రాజెక్ట్ కోసం కేవలం 25 బిలియన్ డాలర్లు మాత్రమే ప్రతిపాదించారని బడ్జెట్ ఆఫీస్ తెలిపింది.
ఏమిటీ గోల్డెమ్ డోమ్?
ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్ క్షిపణులను మన భూభాగంపై మోహరించిన సుదర్శన చక్ర(ఎస్–400) గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. మార్గమధ్యంలోనే ఆ మిస్సైళ్లను కూల్చేసింది. గాజా భూభాగం మీద నుంచి హమాస్ సాయుధులు సంధించిన వందలాది క్షిపణులను సైతం ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ గగనతల రక్షణ వ్యవస్థ ఇలాగే నేలమట్టంచేసి తమ నేలను కాపాడుకుంది. ఎస్–400, ఐరన్‌డోమ్‌లు భూతలం మీద మొహరించిన రక్షణ వ్యవస్థలు. వాహనాలపై బిగించిన రాకెట్ లాంఛర్ ఇందులో కీలకం.
అయితే అమెరికా సిద్ధంచేయబోతున్న గోల్డెన్ డోమ్ కాస్తంత భిన్నమైంది. ఇది భూతల, గగనతల రక్షణ వ్యవస్థల మేళవింపు. లేజర్ కాంతి ఎంతటి కఠినమైన లోహాలనైనా కోసి పారేస్తుంది. ఆకాశంలోని ఉపగ్రహం లాంటి వ్యవస్థ ఈ లేజర్ కాంతి పుంజాన్ని శత్రు క్షిపణులపై ప్రయోగించి వాటిని సెకన్ల వ్యవధిలో నాశనం చేస్తుంది. గోల్డెన్ డోమ్‌లో ఈ లేజర్‌కాంతి విభాగమే అత్యంత కీలకమైంది. గోల్డెన్‌డోమ్‌లో భాగంగా పెద్దసంఖ్యలో ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టి వాటిని నిఘా, దాడి వ్యవస్థలుగా తీర్చిదిద్దనున్నారు.
లేజర్ కాంతి, సెన్సార్లు, శాటిలైట్ల సమ్మేళనం
ఈ గోల్డెన్ డోమ్‌ను లేజర్ కాంతి, సెన్సార్లు, పలు ఉపగ్రహాల, క్షిపణుల సమ్మేళనంగా చెప్పొచ్చు. అన్నీ కలిసి ఏకకాలంలో సమన్వయంతో పనిచేస్తూ నవతరం ‘మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్’గా నిలిచిపోనున్నాయి. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే సెన్సార్లను భూతలం మీద ఉండే గగనతల రక్షణ వ్యవస్థతో అనుసంధానిస్తారు. ఫలానా ప్రాంతం నుంచి శత్రు క్షిపణి దూసుకొస్తున్న విషయాన్ని భూతల, గగనతల సమ్మిళిత వ్యవస్థలు గుర్తించి వెంటనే ఆకాశంలోని లేజర్ కాంతిపుంజ విభాగానికి చేరవేస్తాయి. లేజర్‌కాంతి అవసరంలేని సందర్భాల్లో శత్రు క్షిపణిని అడ్డుకునేందుకు వెనువెంటనే క్షిపణులను ప్రయోగిస్తారు. సొంత క్షిపణితో పనికాదని నిర్ధారించుకోగానే అత్యంత తీక్షణమైన లేజర్ కాంతిని ఆ శత్రు క్షిపణిపై ప్రసరింపజేస్తారు.
నేల మీద మొబైల్ లాంఛర్ నుంచి, యుద్ధవిమానం నుంచి వచ్చే క్షిపణులనూ ఈ లేజర్‌కాంతి నాశనం చేయగలదు. అలా అమెరికా గగనతలంలో కీలకమైన చోట్ల ఈ లేజర్‌బీమ్ లైటింగ్ సిస్టమ్స్‌ను సిద్ధంచేస్తారు. ఈ బహుళ అంచెల వ్యవçస్థలన్నీ ఎల్లవేళలా సమన్వయంతో పనిచేస్తూ అమెరికాను కంటికి రెప్పలా కాపాడతాయి. గోల్డెన్ డోమ్ ముఖ్యంగా నాలుగు పనులు చేస్తుంది. 1. ఫలానా చోట శత్రు క్షిపణి క్రియాశీలకంగా మారిందని గుర్తించగానే అది లాంఛర్‌ను దాటి బయటికొచ్చేలోపే నాశనంచేస్తుంది. 2. ఒకవేళ అప్పటికే బయల్దేరితే తొలిదశలోనే అడ్డుకుంటుంది. 3. లేదంటే మార్గమధ్యంలో నేలకూలుస్తుంది. 4. అప్పటికీ చేయిదాటిపోతే అది లక్ష్యాన్ని ఢీకొట్టే చిట్టచివరి నిమిషంలోనైనా మిస్సైల్‌ను మట్టుబెడుతుంది. ఈ పనులను కృత్రిమమేధ ఆధారిత కమాండ్ సిస్టమ్ చూసుకుంటుంది.

స్టార్‌వార్స్ సిద్ధాంతం నుంచి..
అంతరిక్షం నుంచి కాంతిపుంజాన్ని ప్రయోగించడమనేది ఇంకా ప్రయోగదశలోనే ఉందని అమెరికా ఎయిర్‌ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్ మెయింక్ మంగళవారం వెల్లడించారు. అమెరికా రక్షణ శాఖ, యూఎస్ నార్తర్న్ కమాండ్‌లు సమష్టిగా గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుపై పనిచేస్తు న్నాయి. ‘‘ సంప్రదాయక క్రూయిజ్, బాలిస్టిక్, హైపర్‌సోనిక్ క్షిపణులు, డ్రోన్లతోపాటు అణ్వస్త్ర సామర్థ్య క్షిపణులనూ ఈ గోల్డెన్ డోమ్ విజయవంతంగా అడ్డుకుంటుంది’’ అని రక్షణ మంత్రి పీట్ హెగ్సత్ చెప్పారు. యూఎస్ స్పేస్‌ఫోర్స్ జనరల్ మైఖేల్ గెటెలిన్ ఈ ప్రాజెక్ట్‌కు సారథ్యంవహిస్తారు.
ఫోర్‌స్టార్ జనరల్ అయిన గెటెటిన్‌కు వైమానిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. తాము సైతం ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములుగా చేరతామని కెనడా తన ఆసక్తిని వెల్లడించింది. ఆయుధరంగ దిగ్గజం ‘లాక్‌హీడ్ మార్టిన్’ సంస్థ గోల్డెన్ డోమ్ ఉపకరణాలను అభివృద్ధిచేయనుంది. 80వ దశకంలో అమెరికా అధ్యక్షునిగా సేవలందించిన రొనాల్డ్ రీగన్ ‘స్టార్‌వార్స్’ సిద్ధాంతం, ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ వ్యవస్థల నుంచే గోల్డెన్ డోమ్ ఆలోచన పురుడుపోసుకుంది. క్షిపణులను అడ్డుకునే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్, ఏగిస్ సిస్టమ్‌లనూ గోల్డెన్ డోమ్‌లో వినియోగించనున్నారు.
సందేహాలు, అనుమానాలు
ఇంతవరకు అంతరిక్షంలో పరీక్షించని ఈ వ్యవస్థను కేవలం నాలుగేళ్లలోపు ఎలా అందుబాటులోకి తెస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. గోల్డెన్ డోమ్‌లో పెద్ద సంఖ్యలో కొత్త ఉపగ్రహాలు, ఏఐ సెన్సార్లు అవసరం. ప్రపంచంలోనే అత్యధిక రుణభారాన్ని మోస్తున్న అమెరికా సర్కార్ ఈస్థాయి కొత్త భారీ బడ్జెట్‌ను ఇంత తక్కువ సమయంలో సమకూర్చుకోగలదా? అసలు ఇది సమర్థవంతంగా పనిచేస్తుందా? అనే సందేహాలు ఎక్కువయ్యాయి.
హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం తొలినాళ్లలో ఒకేరోజు ఒకేసారి 20 నిమిషాల వ్యవధిలో హమాస్ 5,000 స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించింది. వాటిని అడ్డుకోవడంలో ఐరన్‌డోమ్ విఫలమైంది. ఈ నేపథ్యంలో ఒక సాయుధ సంస్థే ఇన్ని మిస్సైళ్లను ప్రయోగించగల్గితే పేద్ద యుద్ధమే వస్తే రష్యాలాంటి దేశం ఇంకెంత స్థాయిలో విరుచుకుపడుతుందో ఊహించడం కూడా కష్టం. ఈ నేపథ్యంలో గోల్డెన్ డోమ్ శక్తిసా మర్థ్యాలు ఏపాటివో అందుబాటులోకి వస్తేగానీ చెప్పలే మని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడ్డారు.
చైనా, రష్యా నుంచి ముప్పు..
రష్యా, చైనా తమ ఉపగ్రహాలకు అధునాతన శక్తిసామర్థ్యాలను సంతరింపజేశాయి. అవి అమెరికా ఉపగ్రహాలను నిర్వీర్యంచేయగలవు. ఈ నేపథ్యంలో గోల్డెన్ డోమ్ అవసరం ఏర్పడిందని అమెరికా రక్షణ వర్గాలు తెలిపాయి. కేవలం అంతరిక్షంలో వాడేందుకు రష్యా ఒక కొత్తతరహా అణ్వాయుధాన్ని తయారుచేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ అణ్వాయుధం అంతరిక్షంలో సంచరిస్తూ విడతలవారీగా పేలుతూ సమీప శత్రుదేశ ఉపగ్రహాలను నాశనంచేయగలదని అమెరికా వాదిస్తోంది. అమెరికా గోల్డెన్ డోమ్ ఆలోచనను ఇప్పటికే రష్యా, చైనాలు తీవ్రంగా తప్పుబట్టాయి. శక్తివంతమైన లేజర్‌కాంతి వ్యవస్థలను అంతరిక్షంలో ఏర్పాటుచేసి ఉప గ్రహాలు సంచరించే కక్ష్యలను రణక్షేత్రాలుగా మార్చొద్దని ఇరు దేశాలు గోల్డెన్ డోమ్ ఆలోచనపై అభ్యంతరం వ్యక్తంచేశాయి.