విద్యార్థులు లేక వెలవెలబోతున్న స్కూల్ డార్మిటరీ
నైజీరియా ప్రభుత్వం వెల్లడి
అబుజా: నైజీరియాలోని క్రైస్తవ మిషనరీ స్కూలు నుంచి శుక్రవారం వేకువజామున సాయుధులు కిడ్నాప్ చేసిన విద్యార్థుల సంఖ్య 300 పైమాటేనని అధికారులు శనివారం తెలిపారు. నైగర్ రాష్ట్రం పపిరి ప్రాంతంలోని సెయింట్ మేరీ మిషనరీ స్కూలులో 303 మంది విద్యార్థులతోపాటు 12 మంది టీచర్లను కూడా సాయుధులు తీసుకెళ్లారన్నారు. మొదట 215 మంది విద్యార్థులను తీసుకెళ్లారని తాము భావించామని, అయితే, కిడ్నాప్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన మరో 88 మంది విద్యార్థులను కూడా సాయుధులు బలవంతంగా తీసుకెళ్లినట్లు గుర్తించామన్నారు.
బాలురతోపాటు బాలికలు కూడా వీరిలో ఉన్నారు. అంతా 10 నుంచి 18 ఏళ్ల ఏళ్లలోపు వారని వివరించారు. పొరుగునే ఉన్న కెబ్బి రాష్ట్రం మాగా పట్టణంలోని ఓ పాఠశాల నుంచి వారం క్రితం 25 మంది పిల్లలను సాయుధులు ఎత్తుకెళ్లడం తెల్సిందే. ఈ కిడ్నాప్ ఘటనలకు బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించుకోలేదని అధికారులు తెలిపారు. ప్రభుత్వ హెచ్చరికలను ఖాతరు చేయకుండా తాము స్కూలు ఓపెన్ చేశామంటూ వస్తున్న వార్తలను మిషనరీ అధికారి ఒకరు ఖండించారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసు కూడా అందలేదని స్పష్టం చేశారు. విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయని ఓ అధికారి తెలిపారు.
డబ్బు కోసమేనా?
ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో సాయుధ గ్రూపులు పేరుతోపాటు డబ్బు కోసం స్కూళ్లను టార్గెట్ చేసుకుంటున్నాయి. సాయుధ ముఠాలు, జిహాద్ గ్రూపులు క్రైస్తవులనే లక్ష్యంగా చేసుకుంటున్నందున ఆ దేశానికి నిధులను నిలిపి వేస్తామంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం గమనార్హం. అయితే, సాయుధులు ఎత్తుకెళ్తున్న పిల్లల్లో క్రైస్తవులతోపాటు ముస్లింలు కూడా ఉంటున్నారు. 2014లో జిహాదీ గ్రూపు బోకో హరామ్ ఓ స్కూలుపై దాడి చేసి 276 మంది బాలికలను అపహరించడం అంతర్జాతీయంగా సంచలనం రేపింది.
నాలుగేళ్ల తర్వాత మరో స్కూలు నుంచి 110 మంది బాలికలను ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత సంక్షోభం నెలకొన్న రాష్ట్రాల్లో డజను వరకు సాయుధగ్రూపులు పుట్టుకొచ్చాయి. ఇవి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లను ఎంచుకుని, పిల్లల కిడ్నాప్‌లకు పాల్పడుతున్నాయి. చిబోక్ దాడి అనంతరం దాదాపు 1,500 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసిన సాయుధ ముఠాలు, డబ్బు తీసుకుని వీరిలో చాలామందిని వదిలేశాయి. మత విశ్వాసాల కంటే డబ్బుకే ఈ గ్రూపులు ప్రాధాన్యమిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.


