
పుతిన్‌ను హెచ్చరించిన ట్రంప్
వాషింగ్టన్/బెర్లిన్: ఉక్రెయిన్‌పై పుతిన్ దండయాత్రను ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. శుక్రవారం అమెరికా పరిధిలోని అలస్కాలో పుతిన్‌తో భేటీకి మరికొద్ది గంటలే ముగిలి ఉండగా ఆలోపే పుతిన్‌ను హెచ్చరిస్తూ ట్రంప్ వ్యాఖ్యానాలు చేయడం గమనార్హం. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంయుక్తంగా యురోపియన్ యూనియన్ సభ్యదేశాల అగ్రనేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో ట్రంప్ సైతం వర్చువల్‌గా భేటీ అయి రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించారు.
‘‘ శుక్రవారం అలస్కాలో పుతిన్‌తో భేటీ సవ్యంగా సాగుతుందని భావిస్తున్నా. యుద్ధాన్ని ఆపబోనని పుతిన్ గనక చెబితే రష్యా తీవ్ర పర్యావసానాలను ఎదుర్కోక తప్పదు. రెండో దఫా ఆంక్షలను విధంచాల్సి ఉంటుంది. ఒకవేళ భేటీ సత్ఫలితాలనిస్తే వెంటనే పుతిన్, జెలెన్‌స్కీల మధ్య భేటీని నిర్వహించేందుకు సిద్ధపడతా. ఇరువురి భేటీలో నన్ను అనుమతిస్తే నేనూ భాగస్వామినవుతా’’ అని ట్రంప్ అన్నారు. వర్చువల్ భేటీలో జెలెన్‌స్కీసహా యురోపియన్ యూనియన్ సభ్యుదేశాల అగ్రనేతలతోనూ ట్రంప్ మాట్లాడారు. జెలెన్‌స్కీతో వర్చువల్ భేటీ అద్భుతంగా సాగిందని ట్రంప్ అన్నారు.