
ఖతార్ ప్యాలెస్ అందాలకు ముగ్ధుడైన ట్రంప్
దోహా: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడు. అపర కుబేరుడు. అలాంటి ట్రంప్ సౌదీ అరేబియా, ఖతార్ అధినేతల ప్రాభవం చూసి నోరెళ్లబెట్టారు. వారి రాజభవనాలను చూసి అసూయపడ్డానని స్వయంగా చెప్పారు. ఖతార్ రాజప్రాసాదాల ఠీవి, సౌకర్యాలు చూసి, ‘‘ఇవేంటి ఇంత అద్భుతంగా ఉన్నాయి! వీటిని జీవితంలో కొనలేం’’ అని వ్యాఖ్యానించారు.
తన అత్యాధునిక ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానం కంటే అత్యంత విలాసవంత, అధునాతన బోయింగ్–747 రకం విమానాలను ఖతార్, సౌదీల్లో చూశానని చెప్పుకొచ్చారు. ఖతార్ నుంచి విమానాన్ని కానుకగా తీసుకోవడానికి సంకోచించబోనని బల్లగుద్దిమరీ చెప్పారు. ఖతార్ పాలకుడు అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ రాజభవనం ‘అమీర్ దివాన్’ను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యానని వెల్లడించారు. ‘‘స్వతహాగా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. నిర్మాణ నైపుణ్యం, కట్టడాల నేర్పు ఇట్టే పసిగడతా. మీ నివాసాలు భూలోక స్వర్గాలు. ఇంద్రభవనాలు. ఎంత పర్‌ఫెక్ట్‌గా కట్టారో!’’ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు.