
8 గంటలే గడిచాయి మున్ముందు ఎన్నో ఆంక్షలుంటాయి
చైనా పైనా మరో దఫా టారిఫ్ బండ?
సూచనప్రాయంగా చెప్పిన ట్రంప్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: రష్యాతో వాణిజ్య మైత్రి కొనసాగిస్తున్న దేశాలపై టారిఫ్ క్షిపణుల్ని ప్రయోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అమ్ముల పొదిని మరింతగా వాడబోతున్నారా?. గురువారం అధ్యక్షభవనం శ్వేతసౌధంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ట్రంప్ ఇచ్చిన సమాధానాలను చూస్తే అమెరికా టారిఫ్‌ల మోత ఇప్పట్లో ఆగేలా లేదని స్పష్టమవుతోంది. మీడియా సమావేశంలో ప్రసంగిస్తున్న ట్రంప్‌ను విలేఖరులు భారత్ సంబంధిత ప్రశ్న సంధించారు.
‘‘ రష్యాతో ఎన్నో దేశాలు ముడిచమురు వాణిజ్యం చేస్తోంటే కేవలం భారత్‌ను మీరు లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 50 శాతం టారిఫ్ మోపారు. రష్యాతో చైనా సైతం ఇదే తరహా వాణిజ్యంచేస్తోంది. మరి చైనాపైనా టారిఫ్ మరోసారి పెంచుతారా?’’ అని ప్రశ్నించగా ట్రంప్ సంచలన విషయం చెప్పారు. ‘‘ భారత్‌పై రెండో దఫా టారిఫ్‌లు పెంచి కేవలం 8 గంటలే గడిచాయి. అప్పుడే ఏం అయిపోయింది? మున్ముందు ఏం జరగబోతోందో మీరే చూస్తారుగా.
పరోక్ష ఆంక్షలపర్వంలో భాగంగా రెండో దఫాలో మరింతగా టారిఫ్‌ను పెంచబోతున్నాం’’ అంటూ చైనాకు టారి‹ఫ్ వేడి తప్పదని ట్రంప్ పరోక్షంగా చెప్పారు. గత కొన్నేళ్లుగా చైనాతో వైరం ముదరడంతో భారత్‌తో అమెరికా సత్సంబంధాలను పటిష్టంచేసుకోగా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ మైత్రీబంధం కీలకమలుపు తీసుకుంది. రష్యాకు భారత్ వంటి దేశాలు కీలక వాణిజ్యభాగస్వాములుగా కొనసాగుతున్న తరుణంలో ఈ దేశాలపై సుంకాల కత్తి వేలాడదీసి రష్యాను ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి బలవంతంగా ఒప్పించాలని అమెరికా యతి్నస్తోంది. ఇందులోభాగంగా భారత్‌పై మరో పాతిక శాతం టారిఫ్‌ను విధించడం తెల్సిందే.
అమల్లోకి నూతన టారిఫ్
60కిపైగా దేశాలపై ట్రంప్ మోపిన కొత్త టారిఫ్‌లు గురువారం అమల్లోకి వచ్చాయి. గరిష్టంగా బ్రెజిల్, భారత్‌పై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. సిరియా(41 శాతం), లావోస్(40), మయన్మార్ (40), స్విట్జర్లాండ్(39), ఇరాక్(35), కెనడా(35), సెర్బియా(35), బోస్నియా హెర్జ్‌గోవినా(30), లిబియా(30), దక్షిణాఫ్రికా(30), మెక్సికో(25), బంగ్లాదేశ్(20), శ్రీలంక(20), తైవాన్(20), వియత్నాం(20), కాంబోడియా(19), పాకిస్తాన్(19శాతం)పై విధించిన అదనపు సుంకాలు గురువారం అమల్లోకి వచ్చాయి. తమకు మిత్రులుగా ఉన్న జపాన్, దక్షిణకొరియా, యూరోపియన్ యూనియన్ దేశాలపై కేవలం 15 శాతం సుంకాలు ట్రంప్ విధించారు. బ్రిటన్‌పై కేవలం 10 శాతం టారిఫ్‌లు విధించారు.