
న్యూఢిల్లీ: హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయులపై పిడుగుపాటులా పరిణమించిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రకటనను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసింది.
2025 జనవరిలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇమ్మిగ్రేషన్ విధానాలపై డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హెచ్1బీ వీసా నిబంధనలను సవరించాలనే నిర్ణయం ఈ క్రమంలోనిదే. తాత్కాలిక ఉద్యోగ వీసాలపై తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న చర్య అత్యంత కీలకమైనదిగా నిపుణులు పరిగణిస్తున్నారు. ‘మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే మన దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన వారికే ఇవ్వండి. ముఖ్యంగా అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి. మన ఉద్యోగాలను లాక్కోవడానికి ఇతర దేశాల ప్రజలను తీసుకురావడం ఆపేయండి’ అని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ పేర్కొన్నారు.
అమెరికా సర్కారు హెచ్1బీ కింద కొన్ని రంగాల్లో తాత్కాలికంగా విదేశీ కార్మికులను తీసుకువచ్చేందుకు కంపెనీలకు ఏటా 65 వేల వీసాలు ఇస్తుంటుంది. అడ్వాన్స్‌డ్ డిగ్రీలు కలిగిన కార్మికులకు మరో 20 వేల వీసాలు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడున్న విధానంలో వీసా కోసం లాటరీలో ప్రవేశించేందుకు స్వల్ప రుసుము చెల్లిస్తే సరిపోయేది. దీనికి ఆమోదం పొందిన తర్వాత, తదుపరి రుసుములు వేల డాలర్లలో ఉంటాయి. ఇది ఇప్పుడు ట్రంప్ విధించిన లక్ష డాలర్ల కన్నా చాలా చాలా తక్కువని చెప్పుకోవచ్చు. కాగా అన్ని వీసా రుసుములను కంపెనీలే చెల్లించాల్సి ఉంటుంది. హెచ్1బీ వీసాలకు మూడు నుంచి ఆరేళ్ల కాలానికి ఆమోదం లభిస్తుంది.
హెచ్1బీ వీసా కలిగినవారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం గత ఏడాది హెచ్1బీ వీసాల లబ్ధిదారుల్లో భారతదేశం ముందు వరుసలో ఉంది. మొత్తం వీసాలలో 71 శాతం భారతీయులకే లభించగా, చైనా 11.7శాతంతో తరువాతి స్థానంలో ఉంది. 2025 మొదటి ఆరు నెలలో అమెజాన్.కామ్, దాని క్లౌడ్-కంప్యూటింగ్ విభాగం ఏడబ్ల్యూఎస్ 12 వేలకుమించిన హెచ్1బీ వీసాలను ఆమోదింపజేసుకున్నాయి. మైక్రోసాఫ్ట్, మెటా సంస్థలు ఒక్కొక్కటి ఐదువేలకు మించినహెచ్1బీ వీసాలను పొందేందుకు ఆమోదం పొందాయి. ఇదిలాఉండగా అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఒక మిలియన్ డాలర్లు చెల్లించగలిగేవారికి గోల్డ్ కార్డ్‌ను తీసుకువచ్చేందుకు ట్రంప్ తాజాగా ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఒక లక్ష అమెరికన్ డాలర్లు భారతీయ కరెన్సీలో సుమారు రూ.88 లక్షలకు సమానం
