అదో ఐసు ముక్క!.. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలు | Donald Trump rules out force but renews Greenland demands at Davos | Sakshi
Sakshi News home page

అదో ఐసు ముక్క!.. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలు

Jan 22 2026 3:52 AM | Updated on Jan 22 2026 4:54 AM

Donald Trump rules out force but renews Greenland demands at Davos

కానీ మొత్తంగా మాకే కావాలి 

అందుకు నాటో సహకరించాలి 

కాదన్న వారిని గుర్తుంచుకుంటా 

యూరప్‌ దేశాలకు హెచ్చరికలు 

సైనిక చర్య ఉండబోదని వెల్లడి 

దావోస్‌ వేదిక నుంచి ప్రసంగం

దావోస్‌: గ్రీన్‌లాండ్‌ను కేవలం ‘ప్రపంచానికి మారుమూలగా ఉన్న ఒక మంచు ముక్క’గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభివరి్ణంచారు! అయితే, ‘‘వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యమున్న ప్రాంతం గనుకనే ప్రపంచ శాంతిభద్రతల నిమిత్తం దానిపై అమెరికా నియంత్రణ ఉండాలని కోరుతున్నా. అంతే తప్ప అక్కడున్న అరుదైన ఖనిజ నిల్వల కోసం కాదు’’ అని చెప్పారు. 

గ్రీన్‌లాండ్‌ను అమెరికా మాదిరిగా కాపాడే సత్తా మరే దేశానికీ లేదని చెప్పుకొచ్చారు. దావోస్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో బుధవారం ట్రంప్‌ గంటకు పైగా మాట్లాడారు. ‘ఇక్కడ సమావేశమైన ఎందరో మిత్రులారా, కొందరు శత్రువులారా!’ అంటూ ట్రంప్‌ తన ప్రసంగాన్ని మొదలుపెట్టడం విశేషం. ‘గ్రీన్‌లాండ్‌పై హక్కులు, యాజమాన్యం, సార్వ¿ౌమాధికారం... అన్నీ అమెరికాకే కావాలి’ అంటూ ఈ సందర్భంగా ఆయన మరోసారి కుండబద్దలు కొట్టారు. 

గ్రీన్‌లాండ్‌కు, యూరప్‌కు, ముఖ్యంగా డెన్మార్క్‌కు దశాబ్దాలుగా అమెరికా చేసిన మేలుకు బదులుగా తాను అడుగుతున్నది చాలా చిన్నదని చెప్పుకొచ్చారు. ‘‘అందుకు ఆ దేశాలు అవుననవచ్చు, కాదనీ అనవచ్చు. అయితే ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పదలచుకున్నా. కాదన్న దేశాలను నేను కచ్చితంగా గుర్తు పెట్టుకుంటా’’ అంటూ హెచ్చరించారు! అంతేకాదు, గ్రీన్‌లాండ్‌ స్వా«దీనం కోసం బలప్రయోగం చేయబోనని కూడా ట్రంప్‌ ప్రకటించారు. 

‘‘నేను సైనిక చర్యకు దిగుతానని చాలామంది అనుకుంటున్నారు. కానీ నాకు ఆ ఆలోచనే లేదు. గ్రీన్‌లాండ్‌పై బలప్రయోగానికి దిగను’’ అని స్పష్టం చేశారు. అయితే, ‘‘గ్రీన్‌లాండ్‌ ఉన్నది ఉత్తర అమెరికా ఖండంలో. కనుక అది మా భూభాగమే’’ అంటూ వాదించారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గ్రీన్‌లాండ్‌ను అమెరికాయే డెన్మార్క్‌కు అప్పగించింది. అది నిజంగా తెలివితక్కువ పని. ఆ దీవిని కాపాడే సత్తా డెన్మార్క్‌కు లేదు’’ అన్నారు. ట్రంప్‌ ప్రసంగం వినేందుకు       వచ్చిన పారిశ్రామిక ప్రముఖులు తదితరులతో దావోస్‌ వేదిక కిటకిటలాడిపోయింది. 

యూరప్‌ను ప్రేమిస్తా, కానీ... 
యూరప్‌ అంటే తనకెంతో ప్రేమ అని ట్రంప్‌ చెప్పుకున్నారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో ఆ ఖండాన్ని కాపాడింది అమెరికాయేనని చెప్పారు. కానీ కొంతకాలంగా యూరప్‌ మాటలు, చేతలు సరైన దిశలో సాగడం లేదని ఆక్షేపించారు. యూరప్‌ దేశాలపైనా, నాటో కూటమిపైనా ఈ సందర్భంగా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టారిఫ్‌లు మొదలుకుని పర్యావరణం, వలసల దాకా ప్రతి విషయంలోనూ యూరప్‌ దేశాలు పొరపాట్లపై పొరపాట్లు చేస్తున్నాయన్నారు.

 తమ గ్రీన్‌లాండ్‌ స్వాధీన యత్నాలకు అవి కలిసిరాకపోవడం ఘోర తప్పిదమని పదేపదే చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ఈ విషయమై తక్షణం సంప్రదింపుల ప్రక్రియకు యూరప్‌ దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వా«దీనం చేసుకోవడానికి నాటో కూడా మద్దతివ్వాలని అభిప్రాయపడ్డారు. అమెరికా గత అధ్యక్షులపై, ముఖ్యంగా జో బైడెన్‌పై ట్రంప్‌ విమర్శల వర్షం కురిపించారు. 

‘‘అమెరికాను బైడెన్‌ దివాలా స్థాయికి దిగజార్చారు. నేనొచ్చాక ఏడాదిలోనే దేశ ఆర్థిక పరిస్థితిని అద్భుతంగా తీర్చిదిద్దా’’ అని చెప్పుకున్నారు. యూరప్‌ మాత్రం తప్పుడు నిర్ణయాలతో ఆర్థికంగా అతలాకుతలం అవుతోందని ఎద్దేవా చేశారు. ‘‘చైనా నుంచి యూరప్‌ గాలిమరల్ని కొంటోంది. చైనా ఆర్థికంగా బలపడటం, యూరప్‌లో పక్షులు చనిపోవడం తప్ప వాటివల్ల ఒరిగేదేమిటి? చైనాలో ఎక్కడైనా గాలిమరల్ని వాడుతున్నారా?’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రపంచమంతటికీ ఆర్థిక ఇంజన్‌ అమెరికాయే. అమెరికా అభివృద్ధి చెందినప్పుడే ప్రపంచమంతా అభివృద్ధి సాధిస్తుంది’’ అన్నారు.

 ట్రంప్‌ తన ప్రసంగంలో గ్రీన్‌లాండ్‌కు బదులుగా పదేపదే ఐస్‌లాండ్‌ అని పేర్కొనడం విశేషం! భారత్, పాకిస్తాన్‌ మధ్య యుద్ధాన్ని నిలువరించానని దావోస్‌ వేదికపై కూడా ట్రంప్‌ పాత పాటే పాడారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధానికి ఇప్పటికైనా తెర దించకపోతే ఆ దేశాల అధ్యక్షులు పుతిన్, జెలెన్‌స్కీ మూర్ఖులే అవుతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు! అయితే, వాళ్లు మూర్ఖులు కాదని తనకు తెలుసంటూ ముక్తాయించారు. ట్రంప్‌ కాన్వాయ్‌ దావోస్‌ వేదిక వద్దకు వస్తుండగా నిరసనకారులు దారి పొడవునా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. 

మాక్రాన్‌ కళ్లద్దాలపై చెణుకులు 
ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ ధరించిన కళ్లద్దాలపై దావోస్‌ వేదికగా ట్రంప్‌ చెణుకులు విసిరారు. ‘‘నిన్న దావోస్‌ వేదికపై మాక్రాన్‌ అందమైన కళ్లద్దాలు ధరించడం చూశా. పాపం, ఆయనకు ఏమైందసలు?’’ అంటూ ప్రశ్నించడంతో సభికులంతా ఘెల్లున నవ్వారు. తాత్కాలిక కళ్ల సమస్య కారణంగా వాటిని ధరించక తప్పడం లేదని మాక్రాన్‌ చెప్పడం తెలిసిందే.

మావల్లే మీ ఉనికి! 
కెనడాపై ట్రంప్‌ ఫైర్‌ 
మార్క్, నోరు జాగ్రత్త! 
ప్రధానికి హెచ్చరికలు 
దావోస్‌ వేదికగా అమెరికాపై కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ గుప్పించిన విమర్శలపై ట్రంప్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను కూడా అదే వేదిక నుంచి ఆయనకు గట్టిగా చురకలు వేశారు. అమెరికా వల్లే కెనడా బతికి బట్టకడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘మార్క్‌ (కెనడా ప్రధానిని ఉద్దేశించి)! దశాబ్దాలుగా అమెరికా నుంచి కెనడా ఎన్నో తాయిలాలు అందుకుంటూ వచ్చింది. ఇకపై ఏ వ్యాఖ్యలైనా చేసేముందు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకో’’ అంటూ హెచ్చరించారు. తమ సాయం పట్ల కెనడాకు కృతజ్ఞతే లేదంటూ ఆక్షేపించారు. అమెరికా ఏకపక్ష పోకడలను కార్నీ మంగళవారం దావోస్‌ సదస్సులో ఏకిపారేయడం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement