
ఆగస్టు 1 నుంచే అమల్లోకి..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ), మెక్సికో దేశాల ఉత్పత్తులపై 30 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. సుంకాలపై ఆయా దేశాలకు రాసిన లేఖలను సోషల్ మీడియాలో శనివారం పోస్టుచేశారు. అక్రమ వలసదారులు, మత్తు పదార్థాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మెక్సికో ప్రభుత్వం తమకు చక్కగా సహకరిస్తోందని మెక్సికోకు రాసిన లేఖలో ట్రంప్ ప్రశంసించారు.
మత్తు పదార్థాల నియంత్రణకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని మెక్సికో ప్రభుత్వానికి సూచించారు. అలాగే ఈయూతో అమెరికాకు వాణిజ్య లోటు ఉందని, ఇది తమ జాతీయ భద్రతకు ముప్పేనని తేల్చిచెప్పారు. ఈ లోటును పూడ్చడానికి కలిసికట్టుగా పనిచేద్దామని ఈయూకు రాసిన లేఖలో పిలుపునిచ్చారు. అమెరికా ఉత్పత్తులపై ఈయూ దేశాలు అధికంగా టారిఫ్‌లు విధిస్తున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన ఇప్పటిదాకా 24 దేశాలతోపాటు 27 దేశాలతో కూడిన ఈయూపై టారిఫ్‌లను ప్రకటించారు. మరికొన్ని దేశాలపై సుంకాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఏ రెండు దేశాల మధ్యనైనా సరే టారిఫ్‌లు ఒకేరకంగా ఉండాలని ట్రంప్ వాదిస్తున్నారు. ఒక దేశం నుంచి వచ్చే ఉత్పత్తులపై అధికంగా సుంకాలు వసూలు చేస్తూ.. అదే దేశానికి ఎగుమతయ్యే మన ఉత్పత్తులపై సుంకాలు తక్కువగా ఉండాలని కోరుకోవడం న్యాయం కాదని అంటున్నారు.