
గాజాలో యుద్ధం ముగించడానికి ‘20 సూత్రాల శాంతి ప్రణాళిక’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రతిపాదన
ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని హమాస్‌కు షరతు
ట్రంప్, టోనీ బ్లెయిర్ నేతృత్వంలో గాజా పునర్నిర్మాణం
వాషింగ్టన్: కల్లోలిత గాజాలో సంక్షోభానికి, విధ్వంసానికి తెరదించి, శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన ప్రతిపాదన చేశారు. ‘20 సూత్రాల శాంతి ప్రణాళిక’ను తెరపైకి తెచ్చారు. సోమవారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సమావేశమయ్యారు. గాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధాన్ని ముగించడమే ధ్యేయంగా ట్రంప్ ప్లాన్‌ను వైట్‌హౌస్ విడుదల చేసింది.
ఈ ప్రణాళిక తమకు ఆమోదయోగ్యమేనని నెతన్యాహు ప్రకటించారు. ట్రంప్ ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఇక హమాస్ సైతం అంగీకరిస్తే గాజాలో యుద్ధం వెంటనే ఆగిపోతుందని ట్రంప్ స్పష్టంచేశారు. హమాస్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించే అవకాశం లేకపోలేదని అమెరికా అధ్యక్షుడు సంకేతాలిచ్చారు. శాంతి ప్రతిపాదనపై 3 నుంచి 4 రోజుల్లోగా స్పందించాలని హమాస్‌కు డెడ్‌లైన్ విధించారు. లేకపోతే ‘విషాదకరమైన ముగింపు’ ఉంటుందని తేల్చిచెప్పారు.
స్వాగతించిన ఇస్లామిక్ దేశాలు
గాజా విషయంలో ట్రంప్ ప్లాన్‌ను ఈజిప్టు, జోర్డాన్, ఇండోనేషియా, పాకిస్తాన్, తుర్కియే, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్(యూఏఈ) తదితర ఇస్లామిక్ దేశాలు స్వాగతించారు. ఈమేరకు మంగళవారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. గాజాలో శాంతి కోసం అమెరికాతో కలిసి పనిచేస్తామని ప్రకటించాయి. చైనా, రష్యా, భారత్‌తోపాటు పలు యూరప్ దేశాలు సైతం స్వాగతించాయి.
ప్రధాని నరేంద్ర మోదీ హర్షం
ట్రంప్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. పాలస్తీనాతోపాటు ఇజ్రాయెల్ ప్రజల భద్రత, అభివృద్ధికి, శాశ్వత శాంతికి ఒక మార్గం ఏర్పడినట్లేనని, మొత్తం పశి్చమాసియాకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు.
హమాస్‌కు మరణ శాసనమే!
గాజాలో శాంతి సాధన దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికపై చర్చ మొదలైంది. దీనికి ఇజ్రాయెల్ వెంటనే అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు హమాస్ మాత్రం వేచిచూసే ధోరణితో ముందుకెళ్తోంది. ట్రంప్ ప్లాన్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉందని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటోంది. నిజానికి ట్రంప్ ప్లాన్ హమాస్‌కు మరణ శాసనమేనని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
ప్రణాళికలో కీలక అంశాలు
→ ట్రంప్ ప్లాన్‌ను ఇజ్రాయెల్, హమాస్ అంగీకరిస్తే గాజాలో దాడులు వెంటనే ఆగిపోతాయి. తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలందరినీ 72 గంటల్లోగా హమాస్ మిలిటెంట్లు విడుదల చేయాలి. ఒకవేళ బందీల్లో ఎవరైనా మృతిచెంది ఉంటే వారి మృతదేహాలను ఇజ్రాయెల్‌కు అప్పగించాలి.
→ బందీలకు విముక్తి లభించిన తర్వాత ఇజ్రాయెల్ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 250 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ ప్రభుత్వం విడుదల చేయాలి. 2023 అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయెల్ సైన్యం బంధించిన 1,700 మంది పాలస్తీనా పౌరులను సైతం విడుదల చేయాలి. గాజా నుంచి ఒక బందీ విడుదలైతే, అందుకు ప్రతిగా 15 మంది పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ విడుదల చేయాల్సి ఉంటుంది.
→ ట్రంప్ ప్రతిపాదనకు ఆమోదం లభించగానే ఇజ్రాయెల్ సేనలు దాడులు ఆపేసి గాజా నుంచి వెనక్కి వెళ్లిపోతాయి. గాజాలో ఇజ్రాయెల్ దళాలు ఖాళీ చేసిన స్థానంలోకి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్(ఐఎస్‌ఎఫ్) చేరుతుంది. పాలస్తీనా ప్రజలకు భద్రత కల్పిస్తుంది, పాలస్తీనా పోలీసులకు శిక్షణ ఇస్తుంది.
→ బందీలు క్షేమంగా ఇజ్రాయెల్‌కు చేరుకున్న తర్వాత హమాస్ మిలిటెంట్లు ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలి. వారికి క్షమాభిక్ష ప్రసాదిస్తారు. ఒకవేళ మిలిటెంట్లు గాజాను వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలని భావిస్తే అందుకు వారికి సహకారం లభిస్తుంది. అభ్యంతరం లేకపోతే గాజాలోనే ఉండిపోవచ్చు.
→ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ నేతృత్వంలోని ‘బోర్డ్ ఆఫ్ పీస్’ గాజాలో పరిపాలన, పునరి్నర్మాణాన్ని పర్యవేక్షిస్తుంది. గాజాను ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా అభివృద్ధి చేస్తారు.
→ పునరి్నర్మాణం తర్వాత గాజా పరిపాలన బాధ్యతలను పాలస్తీనియన్ అథారిటీకి అప్పగిస్తారు. ఈలోగా పాలస్తీనియన్ అథారిటీలో సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుంది.