
వాషింగ్టన్: భారతదేశంలో పలువురు చిన్నారుల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ అమెరికాకు రాలేదని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ధృవీకరించింది. భారత్‌లో ఒక దగ్గు మందు కారణంగా పలువురు చిన్నారులు మరణించినట్లు వస్తున్న ఆరోపణల గురించి తమకు తెలిసిందని అమెరికా పేర్కొంది. ఈ ఉత్పత్తులు భారతదేశం నుండి మరే ఇతర దేశానికి ఎగుమతి కాలేదని ఎఫ్‌డీఏ పేర్కొంది.
విషపూరిత మందులు అమెరికాలో ప్రవేశించకుండా చూసే విషయంలో తాము అప్రమత్తంగా ఉన్నామని ఎఫ్‌డీఏ పేర్కొంది. అలాగే అమెరికా మార్కెట్ చేస్తున్న మందులు సురక్షితంగా, అత్యున్నత నాణ్యతతో ఉండేలా నిర్ధారించుకోవాలని తయారీదారులను ఎఫ్‌డీఏ కోరింది. భారతదేశంలో విక్రయిస్తున్న కొన్ని రకాల దగ్గు, జలుబు మందులలో విషపూరితమైన డైథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ ఉందనే వార్తల నివేదికల గురించి తమకు తెలిసిందని యూఎస్ ఎఫ్‌డీఏ తెలిపింది.
మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో 14 మంది చిన్నారుల మరణానికి కారణమైన దగ్గు మందులపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ఆరోగ్యశాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఈ తరహా దగ్గు మందుల నియంత్రణ చర్యలను బలోపేతం చేయడం, దేశంలో ఔషధ ఉత్పత్తుల భద్రత, నాణ్యతను నిర్ధారించడంపై చర్చించారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో 14 మంది చిన్నారులు కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ తీసుకున్న తర్వాత మూత్రపిండాల వైఫల్యం కారణంగా మరణించారు. ఔషధ నమూనాలలో 48.6 శాతం డైథిలిన్ గ్లైకాల్ ఉందని, ఇది అత్యంత విషపూరిత పదార్థమని అధికారులు తెలిపారు.ఈ ఘటన దరిమిలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది.
కోల్డ్‌రిఫ్ సిరప్‌కు తమిళనాడులో సంబంధిత ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించగా, దానిలో డైథిలిన్ గ్లైకాల్ అనే రసాయనం ఉందని, దీనిని తీసుకున్నప్పుడు తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం సంభవిస్తుందని, చివరికి మరణానికి కారణమవుతుందని నిపుణులు తెలిపారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్, సికార్‌లలో డెక్స్ట్రోమెథోర్ఫాన్ హెచ్‌బీఆర్ సిరప్ కారణంగా చిన్నారులు అనారోగ్యం బారిన పడ్డారని తెలియడంతో జైపూర్‌లోని కేసన్ ఫార్మా సరఫరా చేసిన 19 రకాల మందులను నిలిపివేసినట్లు రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వ్‌సర్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో దగ్గు మందు కారణంగా చిన్నారుల మరణాల దరిమిలా తమిళనాడు ప్రభుత్వం కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ స్టోర్‌లు, హోల్‌సేల్ డ్రగ్ డీలర్లపై దాడులు చేపట్టింది.