
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి చైనా స్పందించింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని గట్టిగా కోరింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ సమస్యను ముగింపు పలికేందుకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధమేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉద్రిక్తత పెరగడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న సైనిక దళాల ఘర్షణపై చైనా.. నిన్న కూడా(శుక్రవారం) స్పందించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ చైనా వ్యతిరేకిస్తుందంటూ ఆయన స్పష్టం చేశారు.
కాగా, భారత్–పాక్ సైనిక ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కాదు’ అని అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ విస్పష్టమైన ప్రకటన చేశారు. అలాగే.. భారత్-పాకిస్తాన్ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. మొదట ఉగ్రవాదులు దాడి చేశారు కాబట్టి తర్వాత భారత సైన్యం ప్రతిదాడి చేసిందని పరోక్షంగా అంగీకరించారు