
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, మరో ఆరుగురిపై హత్యాభియోగాలు నమోదయ్యాయి. ఆరుగురిలో ఇద్దరు ఆమె కేబినెట్‌లో మంత్రులు, పదవి కోల్పోయిన పోలీస్ చీఫ్ తదితరులున్నారు. వీరు కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని మంగళవారం అధికారులు తెలిపారు. ఈ నెల 5వ తేదీన పదవికి రాజీనామా చేసి, భారత్‌కు పలాయనమైన తర్వాత హసీనాపై నమోదైన మొదటి కేసు ఇదే. జూలైలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఘర్షణల్లో ఓ దుకాణం యజమాని అబూ సయ్యద్ మరణించారు.
ఈ ఘటనపై ఢాకాలోని మహ్మద్‌పూర్ ఏరియాకు చెందిన అబూ సన్నిహితుడు అమిర్ హంజా షతిల్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలంటూ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ రాజేశ్ చౌదురి పోలీసులను ఆదేశించారని అధికారులు తెలిపారు. కాగా, ఫిర్యాదు చేసినందుకుగాను తనకు ఫ్రాన్స్ నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని అనంతరం షతిల్ చెప్పారు. కాగా, హత్యాభియోగాలు నమోదైన మంత్రులిద్దరూ రహస్యంగా ఇప్పటికే దేశం వీడగా మిగతా పోలీసు అధికారుల ఆచూకీ తెలియడం లేదని చెబుతున్నారు.
హిందువులతో యూనుస్ సమావేశం
బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనుస్ మంగళవారం శక్తిపీఠాల్లో ఒకటిగా పేరుగాంచిన ప్రఖ్యాత ఢాకేశ్వరి ఆలయం ఆవరణలో హిందూమత పెద్దలతో సమావేశమయ్యారు. ప్రజలందరి హక్కులకు రక్షణ కలి్పస్తామని ఈ సందర్భంగా యూనుస్ హామీ ఇచ్చారు. దాడులకు కారకులను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత పాలకుల విధానాలే దేశంలో ప్రస్తుత పరిస్థితులకు కారణమని ఆయన పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం పనితీరును బేరీజు వేసే ముందు సంయమనంతో వ్యవహరించాలని హిందూమత పెద్దలను ఆయన కోరారు. ‘అందరికీ సమాన హక్కులున్నాయి. అందరం ఒకే హక్కు ఉన్న ప్రజలం. మన మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు కలి్పంచవద్దు. దయచేసి, మాకు సహకరించండి ఓపిక పట్టండి. ఆ తర్వాత తీర్పు చెప్పండి. చేయగలిగి ఉండీ చేయడంలో విఫలమైతే మమ్మల్ని విమర్శించండి’అని యూనుస్ చెప్పినట్లు ‘ది డైలీ స్టార్’పేర్కొంది.