Sakshi News home page

సమయం ఆదియందు... మెల్లిగా సాగెను...!

Published Wed, Jul 5 2023 4:41 AM

Astronomers observe time dilation in early universe - Sakshi

ఎంతకూ రాని బస్సు కోసం అసహనంగా ఎదురు చూస్తున్నప్పుడో, చేస్తున్న పని పరమ బోరుగా అనిపిస్తున్నప్పుడో ఎలా ఉంటుంది? టైం అస్సలు సాగడం లేదని అనిపిస్తుంది.  కదూ! కానీ ఆదియందు, అంటే బిగ్‌ బ్యాంగ్‌ జరిగి, ఆ మహా విస్ఫోటనం నుంచి ఈ మహా సృష్టి పురుడు పోసుకుంటున్న తొలినాళ్లలో సమయం నిజంగానే నింపాదిగా సాగేదట! ఎంతగా అంటే, ఇప్పటి వేగంలో అది కేవలం ఐదో వంతు మాత్రమేనని అంతరిక్ష శాస్త్రవేత్తలు తాజాగా సూత్రీకరించారు...!

సృష్టి తొలినాళ్లలో సమయ విస్తరణ (టైం డైలేషన్‌) తీరుతెన్నులపై సిడ్నీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఓ అధ్యయనం జరిపారు. కాసర్స్‌ అని పిలిచే సృష్టిలోకెల్లా అతి తేజోమయమైన, అత్యంత చురుకైన బృహత్‌ కృష్ణబిలాల సమూహాలను లోతుగా పరిశీలించారు. దాదాపు 1,230 కోట్ల ఏళ్ల క్రితం కాలం ఇప్పుడు సాగుతున్న వేగంలో కేవలం ఐదో వంతు వేగంతో నడిచేదని తేల్చారు.

ఇలా చేశారు: పరిశోధక బృందం తమ అధ్యయనానికి కాసార్స్‌ను కాలమానినిగా మార్చుకుంది. బిగ్‌ బ్యాంగ్‌ తరువాత దాదాపు 150 కోట్ల ఏళ్ల కాల పరిధిలోని మొత్తం 190 కాసర్స్‌ నుంచి వెలువడే దురి్నరీక్ష్య కాంతులను పరిశోధనలో వాడుకుంది. పలు తరంగధైర్ఘ్యాల్లో వాటి ప్రకాశాన్ని నేడు ఉనికిలో ఉన్న కాసర్స్‌తో సరిపోల్చారు. కాల ప్రవాహ గతిలో చోటు చేసుకునే కీలక నిర్దిష్ట మార్పుల్లో కొన్ని నేటితో పోలిస్తే అప్పట్లో కేవలం ఐదో వంతు వేగంతో జరిగేవని తేల్చారు.

కోటి సూర్య సమప్రభలు...
కాసర్స్‌ అని పిలిచే కాంతిపుంజ సమూహంలోని ఒక్కో కృష్ణ బిలం పరిమాణం అత్యంత భారీగా ఉంటుంది. ఎంతగా అంటే, కొన్ని కృష్ణ బిలాలు సూర్యుని కంటే ఏకంగా కొన్ని వందల కోట్ల రెట్లు పెద్దవి! అవి తమ పరిధిలోకి వచ్చిన ఎంతటి పదార్థాన్ని అయినా అనంత ఆకర్షణ శక్తితో లోనికి లాగేసి అమాంతంగా మింగేస్తాయి. ఆ క్రమంలో లెక్క లేనన్ని వెలుతురు పుంజాలను సృష్టి మూలమూలలకూ వెదజల్లుతుంటాయి. చుట్టూ అనంత కాంతి వలయాలతో వెలుగులు విరజిమ్ముతూ
ఉంటాయి.  

‘కాలమనే కాన్సెప్ట్‌ మనకింకా పూర్తిగా అర్థమే కాలేదని చెబితే అతిశయోక్తి కాబోదు. కాలం తీరుతెన్నులు, పరిమితులు తదితరాల గురించి కూడా మనకు తెలిసింది బహు స్వల్పం. అందుకే టైం ట్రావెల్‌ ( భూత, భవిష్యత్తులోకి వెళ్లగలగడం) వంటివి సాధ్యం కాదని చెబితే అది తొందరపాటే అవుతుంది‘
– గెరైంట్‌ లెవిస్, అధ్యయన బృంద సారథి, సిడ్నీ యూనివర్సిటీ  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement