ఆఫ్రికా దేశం ఉగాండాలో ఓ కొత్త సామాజిక సమస్య తలెత్తింది. తాము ప్రాణంగా పెంచుకుంటున్న పిల్లలు తమకు పుట్టినవారేనా అన్న అనుమానంతో పురుషులు భారీ సంఖ్యలో డీఎన్‌ఏ పితృత్వ పరీక్షల చేయించుకునేందుకు ఆసక్తి కనబరుస్తుండటం బాధకరం. అయితే, ఈ పరీక్షల ఫలితాలు వారి జీవితాలను అల్లకల్లోలం చేసి కాపురాలను కూల్చేస్తున్నాయి. ప్రస్తుతం ఉగాండ దేశంలో ఈ ధోరణి ఏ స్థాయిలో ఉందంటే, సాక్షాత్తు ప్రభుత్వమే రంగంలోకి దిగి "గుండె ధైర్యం ఉంటే తప్ప ఈ పరీక్షలకు వెళ్లొద్దు" అని సలహా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇటీవల కంపాలాలోని ఓ సంపన్న విద్యావేత్త కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనం సృష్టించింది. కోర్టు ఆదేశాల మేరకు జరిగిన డీఎన్‌ఏ పరీక్షలో, ఆయన ముగ్గురు పిల్లల్లో ఒకరు ఆయనకు పుట్టలేదని తేలింది. స్థానిక మీడియాలో ఈ వార్త విపరీతంగా హల్‌చల్ చేయడంతో, ఒక్కసారిగా చాలామంది పురుషుల్లో తమ సంతానంపై సందేహాలు మొదలయ్యాయి. ఇదే అదనుగా దేశవ్యాప్తంగా డీఎన్‌ఏ పరీక్షా కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలిసిపోయాయి.
ఆఖరికి రేడియోలు, ట్యాక్సీలపై కూడా ఈ టెస్టులకు సంబంధించిన ప్రకటనలు హోరెత్తించేస్తున్నాయి. మరోవైపు ఉగాండా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైమన్ పీటర్ ముండేయీ ప్రకారం, స్వచ్ఛందంగా డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకుంటున్న వారిలో 95% పురుషులే ఉంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, వీరిలో 98% మందికి పైగా ఫలితాలు తాము ఆ పిల్లలకు జీవసంబంధ తండ్రులు కారని నిర్ధారిస్తున్నాయి. దాంతో కుటుంబాలు విచ్ఛిన్నమై..ఎన్నో ఏళ్ల బంధాలు తెగిపోతున్నాయి.
అలా చేయడం నేరం..
దీంతో ఈ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు మతపెద్దలు, తెగల నాయకులు రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు స్థానిక గిరిజన నాయకుడు మోసెస్ కుటోయ్ వంటి సంప్రదాయ పెద్దలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన దగ్గరకు వచ్చే కుటుంబ వివాదాలను పరిష్కరించే క్రమంలో..తాను కూడా తన తండ్రి పోలికతో ఉండనంటూ ఉదాహణగా చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదీగాక ఇలా పిల్లల పితృత్వాన్ని శంకించడం పూర్వకాలంలో పెద్ద నేరమని, జరిమానా కూడా విధించేవారంటూ గుర్తు చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ వివాదాలు ఎక్కువగా ఆస్తి పంపకాలు, విడాకుల సమయంలోనే జరుగుతున్నట్లు సమాచారం. నిజానికి మత పెద్దల మాటలు ఒకప్పుడు కుటుంబాలను విచ్చిన్నం అవ్వకుండా కాపాడేవి. కానీ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ చేదు నిజాన్ని నిగ్గుతేల్చి చెప్పేయడంతో, ఉగాండా సమాజం తీవ్రమైన కలవరపాటుకి గురవుతోంది.
అదే ఈ సమస్యకు మూలం..
ఇక ఆఫ్రికా సంప్రదాయం ప్రకారం మహిళ తన భర్తకు సంతానాన్ని కని ఇవ్వకపోతేవిడాకులు ఇవ్వడం లేదా ఆమెను ఇంటి నుంచి బయటకు పంపడం చేసే వారు. చాలా కేసుల్లో పురుషుల్లోనే సంతాన సమస్యలు ఉన్నా, శిక్ష మాత్రం తమకు పడుతుండటంతో చాలా మంది మహిళలు ఇతరులతో కలిసి పిల్లలను కంటున్నారని ఓ అధికారి వెల్లడించారు.
(చదవండి: Inspiring Story: సక్సెస్ అంటే కోట్లు గడించడం కాదు..! కష్టానికి తలవంచకపోవడమే..)


