
బెంగళూరు టెక్నీషియన్ ఉగాండాలో ఒంటరిగా వదిలేసినందుకు యజమానిపై కేసు వేసి, రూ.3 లక్షలకు పైగా గెలుచుకున్నాడు. టెక్నికల్ కన్సల్టెంట్ - కంపెనీ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంలో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అతని బకాయిలు, ఇతర పత్రాలను ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసిందన్న ఐటీ ఉద్యోగి వాదనను సమర్ధించిన కోర్టు రూ. 3 లక్షల బకాయిలు, 6 శాతం వార్షిక వడ్డీ, రిలీవింగ్ లెటర్ ,అతని ఒరిజినల్ విద్యా సర్టిఫికెట్లను అతనికి తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం పాపారెడ్డిపాళ్యంలోని ఐటీఐ లేఅవుట్‌లో నివసించే రక్షిత్ ఎంవీ, సెప్టెంబర్ 2016లో లోకస్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో చేరారు. డిసెంబర్ 2019లో ఉగాండాలోని కంపాలాలో ఒక క్లయింట్ ప్రాజెక్ట్ కోసం రక్షిత్‌ను నియమించారు. ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. అయితే పదే పదే అభ్యర్థించినప్పటికీ అతనికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వకుండా కంపెనీ నిర్లక్ష్యం చేసింది. పైగా పొడిగించిన స్టే సమయంలో తన జీత భత్యాలను ఏకపక్షంగా సగానికి తగ్గించిందనీ, నెలకు చెల్లించాల్సిన పీఎఫ్ రూ.3,600 రూపాయలు జమ చేయలేదని వాదించారు. అలాగే దేశీయ ప్రయాణం,ఇతర ఛార్జీలు మొత్తం రూ. 3 లక్షలతో సహా అదనపు ఖర్చులను కూడా చెల్లించలేదు. దీంతో జూలై 2020 వరకు తాను అక్కడ చిక్కుకుపోయానని రక్షిత్ ఆరోపించారు. చివరికి2020 ఆగస్టులో రాజీనామా చేశానని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జీతం కోత , పొడిగించిన స్టేతో సహా అన్ని నిర్ణయాలను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అధికారిక ఇమెయిల్ కమ్యూనికేషన్ లేకుండా మౌఖికంగా తెలియజేశారని, అందువల్లే తనకు వ్రాతపూర్వక రుజువు లేకుండా పోయిందని రక్షిత్ చెప్పారు.
రాజీనామా చేసిన తర్వాత, రక్షిత్ 2021లో కంపెనీకి లీగల్ నోటీసు పంపాడు. ఆ తర్వాత 2022 జనవరిలో తన బకాయిల చెల్లింపు, తనకు సంబందించిన సర్టిఫికెట్లను, ఇతర పత్రాలను విడుదల చేయాలని కోరుతూ సివిల్ దావా వేశాడు.
ఇదీ చదవండి: ఉద్యోగాన్ని వదలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
ఎండీ రోహిత్ కుడుకులి ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీ రక్షిత్ ఆరోపణలను ఖండించింది. రక్షిత్ ప్రాజెక్ట్ మధ్యలో పరారయ్యాడని వాదించింది. కానీ, న్యాయమూర్తి శివానంద్ మారుతి జిపారే అధ్యక్షతలోని అదనపు సిటీ సివిల్ మరియు సెషన్స్ కోర్టు రక్షిత్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 6 శాతం వార్షిక వడ్డీతో రూ. 3 లక్షలు బకాయిలు చెల్లించాలని, అతని సర్టిఫికెట్లను విడుదల చేయాలని ఆదేశించింది. కపెంనీ తన చర్య ద్వారా బాధితుడికి కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని వ్యాఖ్యానించింది. కరీర్‌ను ప్రమాదంలో పడేసేలా, బకాయిలు, ఇతర పత్రాలను నిలిపివేయడానికి కోర్టు తప్పుబట్టింది.