
ఉగాండా అధ్యక్షునిగా ముసేవేని రికార్డు
ఈసారి కూడా మళ్లీ ఎన్నికల బరిలోకి
ప్రత్యర్థిగా మాజీ పాప్ స్టార్
వయసు 80 ఏళ్లు. అందులో దేశాధ్యక్షునిగానే ఏకంగా 40 ఏళ్లు! ఇదీ, ఉగాండా ప్రెసిడెంట్ యోవేరి ముసేవేని ట్రాక్ రికార్డు! అయినా తనివి తీరలేదేమో, ఈ వయసులో కూడా మళ్లీ అధ్యక్ష బరిలో దిగుతున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆయనే అభ్యర్థి అని పాలక నేషనల్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్ (ఎన్‌ఆర్‌ఎం) పార్టీ ప్రకటించింది. అందుకు ముసేవేని అంగీకరించారు కూడా. ఎన్‌ఆర్‌ఎం గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన 40 ఏళ్ల రికార్డను మరింత మెరుగు పరుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
జనవరిలో ఎన్నికలు
ఉగాండాలో 2026 జనవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పాప్ స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బాబీ వైన్ వాటిలో ముసేవేని ప్రధాన ప్రత్యర్థిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. విపక్ష నేషనల్ యూనిటీ పార్టీ తనను నామినేట్ చేస్తే ముసేవేనిపై తలపడేందుకు సిద్ధమని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ‘‘దేశంలో అణచివేత పెరుగుతోంది. విపక్షాల్లో కొనసాగడమే దుర్భరంగా మారింది.
విపక్ష నేతలపై నేరుగా ఉగ్రవాది ముద్ర వేస్తున్నారు’’ అన్నారాయన. వైన్ 2021 సార్వత్రిక ఎన్నికల్లో కూడా బరిలో దిగినా ముసేవేని చేతిలో ఓటమి చవిచూశారు. మరో ప్రముఖ ప్రతిపక్షం ఫోరం ఫర్ డెమొక్రటిక్ చేంజ్ (ఎఫ్‌డీసీ) నేత కిజ్జా బెసిగ్యే దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాజీ సైనికాధికారి అయిన ఆయన గత నవంబర్ నుంచి నిర్బంధంలో ఉన్నారు.
పశుల కాపర్ల కుటుంబం
యోవేరి ముసేవేని 1944లో ఉగాండాలోని ఎంబారా జిల్లాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పశువుల కాపర్లు, పెంపకదారు లు. ఆయన మిషనరీ పాఠశాలల్లో చదివారు. టాంజానియాలోని దారెస్సలాం విశ్వవిద్యాలయంలో చదువుతుండగా ఆఫ్రికన్ విముక్తి ఉద్యమాలతో అనుబంధం ఏర్పడింది. వామపక్ష విద్యార్థి సంఘానికి చైర్మన్ అయ్యారు. నేషనల్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్ (ఎన్‌ఆర్‌ఎం) ఆధ్వర్యంలోని సాయుధ దళమైన నేషనల్ రెసిస్టెన్స్ ఆర్మీకి నేతృత్వం వహించారు.
1980ల్లో నాటి అధ్యక్షుడు ఒబోటే పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశారు. 1986లో తిరుగుబాటు నాయకుడిగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. నాటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆయన పదవిలో కొనసాగడానికి వీలుగా రాజ్యాంగాన్ని రెండుసార్లు సవరించి మరీ వయో,, పదవీకాల పరిమితులను తొలగించారు! ఆ తర్వాత 2001, 2006, 2011, 2016 ఎన్నికల్లో ముసేవేని వరుస విజయాలు సాధించారు.
2017లో మరోసారి రాజ్యాంగ సవరణ చేసి అధ్యక్ష అభ్యర్థుల వయో వయో పరిమితిని పూర్తిగా ఎత్తేశారు. తద్వారా 2021లో తిరిగి ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఉగాండాను ముసేవేని ప్రగతి పథంలోకి నడిపించారు. రాజకీయ స్థిరత్వం అందించారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చారు. మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. పత్రికా స్వేచ్ఛకు మద్దతిచ్చారు.
ఇదంతా నాణేనికి ఒకవైపే ముసేవేనిపై తీవ్ర అవినీతి మచ్చలున్నాయి. దాంతో కొన్నేళ్లుగా ఆయన ఆదరణ, ప్రాబల్యం తగ్గుతూ వస్తున్నాయి. విపక్ష నేతలను వేధించడం, నిర్బంధించడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఉత్తర ఉగాండాను దశాబ్దాలుగా భయభ్రాంతులను చేస్తున్న లార్డ్స్ రెసిస్టెన్స్ ఆర్మీ (ఎల్‌ఆర్‌ఏ)ని కట్టడి చేయడంలో విఫలమయ్యారని ముసేవేని ఆరోపణలు ఎదుర్కొన్నారు. సోమాలి యాలో ఆఫ్రికన్ యూనియన్ దళానికి సైనిక సాయం చేసి ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే 2013లో దక్షిణ సూడాన్ చెలరేగిన అంతర్యుద్ధంలో ప్రభుత్వానికి మద్దతిచి్చవిమర్శలపాలయ్యరు.
– సాక్షి, నేషనల్ డెస్క్