కంటతడి పెట్టించే కష్టాల కొలిమి..సాధించాలన్న ఆశయాన్ని కన్నీళ్లు చుట్టుముట్టేస్తున్నా..వెనకడగు వేయలేదు. మనసును మెలిపెట్టే బాధనంతటిని లక్యాన్ని మరింత చేరువ చేసే సాధనంగా మార్చాడు. జీవిత పోరాటంలో ఎలా గెలుపుని ఒడిసి పట్టుకోవాలో చెప్పే స్ఫూర్తిదాయకమైన స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. అతడు అడగడుగునా ఎదురయ్యే సవాళ్లను, కంటతడి పెట్టిస్తున్న ప్రతి కష్టాన్ని దాటుకుంటూ ఉన్నతస్థాయికి చేరుకోవడమే గాక, తన బాధ్యతల విషయంలోనూ రాజీకి తావివ్వకుండా ఎలా సమర్థవంతంగా నిర్వర్తించింది రెడ్డిట్‌లో షేర్ చేసుకున్నాడు.
ఆ పోస్ట్‌లో తాను ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలో పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించానని పేర్కొన్నాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే అతడి తండ్రి తన పిల్లలకు మంచి మెరుగైన జీవితాన్ని అందించాలనే తపనతో ఢిల్లీ వెళ్లాడు. కానీ విధి మరోలా తలిచింది. అనూహ్యంగా 2013లో తండ్రి ఆకస్మిక మరణం తన జీవితాన్ని పూర్తిగా విషాదకరమైన జీవితంలోకి నెట్టేసింది.
అయితే అతడు ఎంతటి కఠినమైన సమస్యలు వచ్చినా..చదువును వదలకూడదన్న సంకల్పంతో ముందుకు సాగాడు. అలా 2015లో రూ. 3.15 లక్షల ప్యాకేజ్‌తో బహుళ సంస్థలో ఉద్యోగాన్ని సంపాదించాడు. ఆ సక్సెస్‌ని అక్కడితో ఆపకుండా 2018 నాటికి వేరే కంపెనీకి మారి రూ. 7.5 లక్షల ప్యాకేజీని అందుకున్నాడు.
ఢిల్లీ అద్దె ఇంట్లో ఉంటూ అప్పులన్నీ తీర్చేశాడు. కానీ నవంబర్ 2020లో మళ్లీ విషాదం చుట్టుమట్టింది. ఆ ఏడాది తన తల్లిని కోల్పోయాడు. దాంతో అతడిపై తమ్ముడు, చెల్లి బాధ్యతలు మీద పడ్డాయి. తనలా తన తోబుట్టువులను కూడా మంచి స్థాయిలో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో వారి చదువుల విషయంలో రాజీపడకుండా చదివించాడు. దాని ఫలితం సోదరికి రూ. 11 లక్షల వార్షిక ప్యాకేజ్‌తో ఉద్యోగం రాగా, తమ్ముడికి బీటెక్ సెకండియర్‌లో ఉండగానే జాబ్ కొట్టేశాడు.
అలాగే తన స్వగ్రామంలోని ఇంటిని 2021లో పునర్‌నిర్మించే పనులు ప్రారంభించాడు. ఆ ఇల్లు అక్టోబర్ 2022 నాటికి పూర్తవ్వగా, నవంబర్ 2022లో, తాను వివాహం చేసుకున్నట్లు తెలిపాడు. అలాగే తన వివాహం ఇంటి నిర్మాణాన్ని కవర్ చేయడానికి సుమారు రూ. 20 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నానని, దాని ఈ ఏడాది ఆగస్టు 2025 నాటికి క్లియర్ చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం తన దగ్గర ఎలాంటి పొదుపులు లేవు గానీ అతిపెద్ద సక్సెస్‌ని సాధించగలిగానని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు.
ఇదేంటి అనుకోకండి. ఎందుకంటే జీవితం నన్ను బాధించే కష్టాల కడలిలో ముంచినా..వెనక్కిచూడలేదు, ఆగిపోలే..!. స్థైర్యంతో ముందుకు సాగిపోయాను..మంచి స్థాయికి చేరుకున్నా. అలాగే నా తోబుట్టువులను సెటిల్ చేయగలిగా. ఇంత పెద్ద విజయాన్ని అందుకున్నా. గుర్తించుకోండి సక్సెస్ అటే ఎన్ని కోట్లు కూడబెట్టాం అన్నది కాదు. జీవితం మనల్ని ఎంత కష్టబెట్టినా..తడబడకుండా ముందుకు సాగడం అని సగర్వంగా పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకర్షించడమే కాదు..ఇది గొప్ప స్ఫూర్తిగాకమైన స్టోరీ బ్రదర్ అంటూ అభినందనలు వెల్లువెత్తాయి.
(చదవండి: ఎలుక మాదిరి విచిత్రమైన జీవి..14 గంటల వరకు ఆడజీవితో..!)


