
పని సౌలభ్యం, ప్రదేశాల సౌందర్యంపై దృష్టి
క్యాబిన్‌లకు స్వస్తి, ఓపెన్ వర్క్‌స్పేస్‌కు నాంది
అటు సాంకేతికత, ఇటు సహజత్వం..
ఇంటీరియర్, ఫర్నిచర్ సహా అన్నిట్లో మార్పులు
ఎప్పటికప్పుడు మారుతున్న అధునాతన జీవనశైలికి అనుగుణంగా భాగ్యనగరం తన వైవిధ్యాన్ని మార్చుకుంటోంది. సహజత్వం మొదలు సాంకేతికత వరకు నిత్య జీవనశైలిలో తన గుర్తింపును సుస్థిరపరుచుకుంటోంది. ప్రధానంగా ఆధునిక కార్యాలయాలు, ఉత్పాదకత, శ్రేయస్సుకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, కార్పొరేట్ కార్యాలయాలన్నీ నయాలుక్ సంతరించుకుంటున్నాయి. ఆఫీస్ అందంగా, అత్యాధునికంగా ఉండాలనే స్థాయి నుంచి ఉద్యోగుల పని సామర్థ్యం పెంచగలిగేలా ఆఫీస్ స్పేస్ డిజైన్ చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
పాతకాలపు క్యాబిన్ డెస్క్‌లు, క్లోస్డ్ క్యాబిన్ స్పేస్‌లు తీసేసి వాటి స్థానంలో ఉద్యోగుల శ్రేయస్సు, సృజనాత్మకత, జట్టు సహకారం పెరిగే విధంగా డిజైన్ చేయబడిన క్రియేటివ్ స్పేస్‌లు వచ్చాయి. 2025లో మనం చూస్తున్న కార్యాలయాలు ఒకవైపు అధునాతన సౌకర్యాలతో పాటు మరోవైపు ప్రకృతి, సహజత్వాన్ని సమ్మేళనంగా అందిస్తున్నాయి. ఈ కల్చర్ భవిష్యత్ వర్క్ కల్చర్‌ను సరికొత్త దారిలోకి తీసుకెళ్లనుంది.
ఓపెన్ ఫ్లోర్ లేఔట్..
ఆఫీస్ లోపల గోడలు లేకుండా ఓపెన్‌గా ఉన్న సీటింగ్, క్యాబిన్లు ఉద్యోగుల మధ్య సంభాషణలు పెంచుతాయి. అడ్డంకులు లేకపోవడంతో అవసరమైన చర్చలు, ఆలోచనలు పంచుకోవడం, సాంకేతిక సమస్యలపై కలిసి పనిచేయడం మంచి ఫలితాలను అందిస్తోందని సరికొత్త కార్యాలయాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి వాతావరణం టీమ్ స్పిరిట్‌ను పెంచుతోంది.
ఫర్నీచర్ సౌకర్యవంతంగా..
ఈ తరం గ్లోబల్ ట్రెండ్‌లో ఆఫీస్‌లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. వీటికి అనువైన ఫర్నీచర్ కూడా సౌకర్యవంతంగా ఉండాలి. ఎత్తు మార్చుకునే డెస్క్‌లు, మడతపెట్టే టేబుల్స్, ఎక్కడికైనా మార్చుకోగలిగే కురీ్చలు.. పైగా ఇవి సరికొత్త డిజైనింగ్‌తో ఆకర్షణీయంగా ఉండటంతో పాటు స్టోరేజ్ సదుపాయంతో ఉండే డెస్క్‌లు వంటి వినూత్న మార్పులు వస్తున్నాయి. ఇందులో భాగంగా వైట్ బోర్డ్‌లు, డిజిటల్ స్క్రీన్లు, మాడ్యులర్ ఫరి్నచర్‌తో మోడ్రన్ ఇంటీరియర్ స్పేస్ ఏర్పాటు చేస్తారు. ఇలా విభిన్న అవసరాలకు అనువైన ప్రదేశాలు ఉండటంతో ఉద్యోగులందరికీ సౌకర్యంగా ఉంటుంది.
సహజమైన కాంతి వచ్చేలా..
ప్రకృతి, సహజత్వం మన ఆరోగ్యం, మనసుకు హాయి, ఆహ్లాదం అందిస్తుంది. అందుకే ఇప్పుడు కార్యాలయాల్లో కూడా బయోఫిలిక్ డిజైన్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇందులో ముఖ్యంగా ఇండోర్ ప్లాంట్స్, వాటర్ ఫౌంటెయిన్లు, ఉడ్ డిజైనింగ్, పెద్ద పెద్ద కిటికీలు లేదా విశాలమైన ఓపెన్ గ్లాస్ విండోస్‌తో సహజ కాంతి రావడం వంటి అంశాలు ట్రెండ్‌గా మారాయి. గోడలపై గ్రీన్ ప్లాంట్ ఇన్‌స్టాలేషన్లు ఇతర సహజ పద్ధతులు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి.