2025 ఇంకొన్ని రోజుల్లో ముగుస్తుంది. బంగార ధరలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది (2025) ప్రారంభంలో రూ.78,000 ఉన్న గోల్డ్ రేటు.. ప్రస్తుతం రూ.1.3 లక్షలకు చేరుకుంది. దీంతో 2026లో పసిడి ధరలు ఇంకెలా ఉండబోతున్నాయో అని చాలామంది ఆందోళన చెందుతున్నారు.
2026 డిసెంబర్ నాటికి బంగారం ధర ఔన్సుకు 14% పెరిగి 4,900 డాలర్లకు చేరుకుంటుందని.. గోల్డ్‌మన్ సాచ్స్ (Goldman Sachs) అంచనా వేసింది. సెంట్రల్ బ్యాంక్ డిమాండ్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతలు వంటివి గోల్డ్ రేటు పెరగడానికి కారణమవుతున్నాయి. వచ్చే ఏడాది కూడా బంగారం ధర భారీగా పెరుగుతుందని నివేదికలో గోల్డ్‌మన్ సాచ్స్ వెల్లడించింది.
భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. గ్లోబల్ మార్కెట్లో కూడా గోల్డ్ రేటు 61 శాతం పెరిగింది. ఈ విధంగా ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. ట్రంప్ టారిఫ్స్ ప్రకటనలు. స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిన సమయంలో చాలామంది పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇది కూడా గోల్డ్ రేటు గణనీయంగా పెరగడానికి ఓ కారణమైంది.
ప్రస్తుతం బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. ఎందుకంటే అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చితులు, ద్రవ్యోల్బణం సమయంలో పెట్టుబడిదారులకు గోల్డ్ సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఉపయోగపడుతుంది. రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు సైతం బంగారంపై పెట్టే పెట్టుబడి.. మిమ్మల్ని ఆర్ధిక సమస్యల నుంచి బయటపడేస్తుందని చెబుతున్నారు. కాబట్టి చాలామంది పసిడిపై పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. కాబట్టి రేటు కూడా పెరుగుతుందని స్పష్టంగా అవగతం అవుతోంది.
నేటి ధరలు
వరుస హెచ్చుతగ్గుల మధ్య ఈ రోజు (డిసెంబర్ 20) బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,34,180 వద్ద.. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,23,000 వద్ద నిలిచాయి. చెన్నైలో మాత్రమే ఈ ధరలు కొంత ఎక్కువగా ఉన్నాయి.
ఇదీ చదవండి: మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్


