breaking news
time start
-
సమయం ఆదియందు... మెల్లిగా సాగెను...!
ఎంతకూ రాని బస్సు కోసం అసహనంగా ఎదురు చూస్తున్నప్పుడో, చేస్తున్న పని పరమ బోరుగా అనిపిస్తున్నప్పుడో ఎలా ఉంటుంది? టైం అస్సలు సాగడం లేదని అనిపిస్తుంది. కదూ! కానీ ఆదియందు, అంటే బిగ్ బ్యాంగ్ జరిగి, ఆ మహా విస్ఫోటనం నుంచి ఈ మహా సృష్టి పురుడు పోసుకుంటున్న తొలినాళ్లలో సమయం నిజంగానే నింపాదిగా సాగేదట! ఎంతగా అంటే, ఇప్పటి వేగంలో అది కేవలం ఐదో వంతు మాత్రమేనని అంతరిక్ష శాస్త్రవేత్తలు తాజాగా సూత్రీకరించారు...! సృష్టి తొలినాళ్లలో సమయ విస్తరణ (టైం డైలేషన్) తీరుతెన్నులపై సిడ్నీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఓ అధ్యయనం జరిపారు. కాసర్స్ అని పిలిచే సృష్టిలోకెల్లా అతి తేజోమయమైన, అత్యంత చురుకైన బృహత్ కృష్ణబిలాల సమూహాలను లోతుగా పరిశీలించారు. దాదాపు 1,230 కోట్ల ఏళ్ల క్రితం కాలం ఇప్పుడు సాగుతున్న వేగంలో కేవలం ఐదో వంతు వేగంతో నడిచేదని తేల్చారు. ఇలా చేశారు: పరిశోధక బృందం తమ అధ్యయనానికి కాసార్స్ను కాలమానినిగా మార్చుకుంది. బిగ్ బ్యాంగ్ తరువాత దాదాపు 150 కోట్ల ఏళ్ల కాల పరిధిలోని మొత్తం 190 కాసర్స్ నుంచి వెలువడే దురి్నరీక్ష్య కాంతులను పరిశోధనలో వాడుకుంది. పలు తరంగధైర్ఘ్యాల్లో వాటి ప్రకాశాన్ని నేడు ఉనికిలో ఉన్న కాసర్స్తో సరిపోల్చారు. కాల ప్రవాహ గతిలో చోటు చేసుకునే కీలక నిర్దిష్ట మార్పుల్లో కొన్ని నేటితో పోలిస్తే అప్పట్లో కేవలం ఐదో వంతు వేగంతో జరిగేవని తేల్చారు. కోటి సూర్య సమప్రభలు... కాసర్స్ అని పిలిచే కాంతిపుంజ సమూహంలోని ఒక్కో కృష్ణ బిలం పరిమాణం అత్యంత భారీగా ఉంటుంది. ఎంతగా అంటే, కొన్ని కృష్ణ బిలాలు సూర్యుని కంటే ఏకంగా కొన్ని వందల కోట్ల రెట్లు పెద్దవి! అవి తమ పరిధిలోకి వచ్చిన ఎంతటి పదార్థాన్ని అయినా అనంత ఆకర్షణ శక్తితో లోనికి లాగేసి అమాంతంగా మింగేస్తాయి. ఆ క్రమంలో లెక్క లేనన్ని వెలుతురు పుంజాలను సృష్టి మూలమూలలకూ వెదజల్లుతుంటాయి. చుట్టూ అనంత కాంతి వలయాలతో వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయి. ‘కాలమనే కాన్సెప్ట్ మనకింకా పూర్తిగా అర్థమే కాలేదని చెబితే అతిశయోక్తి కాబోదు. కాలం తీరుతెన్నులు, పరిమితులు తదితరాల గురించి కూడా మనకు తెలిసింది బహు స్వల్పం. అందుకే టైం ట్రావెల్ ( భూత, భవిష్యత్తులోకి వెళ్లగలగడం) వంటివి సాధ్యం కాదని చెబితే అది తొందరపాటే అవుతుంది‘ – గెరైంట్ లెవిస్, అధ్యయన బృంద సారథి, సిడ్నీ యూనివర్సిటీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
బదిలీలకు వేళాయె!!
– మే 1 నుంచి నిషేధం ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం – ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారికి కచ్చితంగా స్థానభ్రంశం – అనుకూలమైన అధికారులను నియమించుకోవాలని సీఎం ఆదేశం? – మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికే పోస్టింగుల్లో ప్రాధాన్యత బదిలీల జాతరకు దాదాపు ముహూర్తం ఖరారైంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీపై మే 1 నుంచి 20 వరకూ 20 రోజుల పాటు నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఈ నెలాఖరులో జీఓ జారీ చేసే అవకాశం ఉంది. ఇటీవల అమరావతిలో జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సర్పంచ్ ఎన్నికలు, ఆపై ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో అన్ని మండల కేంద్రాల్లో అనుకూల అధికారులను నియమించుకోవాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సారి బదిలీల్లో పనితీరు, ఇతర అంశాలతో పనిలేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికే పోస్టింగులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. –సాక్షి ప్రతినిధి, అనంతపురం. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు ఆర్థిక శాఖ రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా, జోనల్స్థాయి ఉద్యోగుల బదిలీలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. రాష్ట్రకేడర్ ఉద్యోగులను బదిలీ నుంచి మినహాయించనున్నారు. మే ఒకటో తేదీకి ఉద్యోగంలో చేరి రెండేళ్ల సర్వీసు పూర్తికాని వారికి కూడా బదిలీ నుంచి మినహాయించనున్నారు. ఐదేళ్లు పూర్తయినవారిని కచ్చితంగా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్రకేడర్ ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అధికారపార్టీకి అనుకూలంగా పనిచేసే వారికే ప్రాధాన్యత బదిలీలు పూర్తిగా అధికారపార్టీ కనుసన్నల్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే జూలైతో సర్పంచ్ల పదవీకాలం ముగియనున్నాయి. ఆపై సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టిన తర్వాత పింఛన్లు మినహా ఎలాంటి సంక్షేమ పథకాలూ లబ్ధిదారులకు చేరలేదు. కనీసం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. దీంతో తక్కిన సంక్షేమ పథకాల సంగతి పక్కనపెడితే కనీసం కొన్ని ఇళ్లయినా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మండలస్థాయి అధికారులు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసేవారిని నియమించుకోవాలని సీఎం బాహాటంగానే చెప్పినట్లు తెలుస్తోంది. పనితీరు, ఆరోపణలతో పనిలేకుండా, ఉన్నతాధికారుల ఆలోచనలను పరిగణలోకి తీసుకోవల్సిన అవసరం లేకుండా ‘మేం లేఖ ఎవరికిస్తే వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వు!’ అనే ధోరణిలో అధికారపార్టీనేతలు వ్యవహరించే అవకాశం ఉంది. భారీగా బేరాలు! అధికారుల బదిలీల అంశం అధికార పార్టీనేతలకు వరంగా మారనుంది. కోరుకున్న పోస్టింగు దక్కించుకునేందుకు అధికారపార్టీ నేతల ఆశీస్సులు తప్పనిసరి అని భావించిన అధికారులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు క్యూ కడతారు. ఆయా ఎమ్మెల్యేలతో సిఫార్సు లేఖలు తీసుకుంటారు. దీంతో పోస్టింగును బట్టి అధికార పార్టీ నేతలు రేటు ఖరారు చేసే అవకాశం ఉంది. తహసీల్దార్, ఎంపీడీఓ, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్తో పాటు పలు కీలకశాఖల పోస్టుల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు వచ్చేదాకా బదిలీల్లో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉన్నతాధికారులది. మూడేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. ఈ ఏడాది ఏకంగా ముఖ్యమంత్రే బదిలీలకు సంబంధించి ‘మార్గనిర్దేశం’ చేయడంతో ఆయా శాఖల అధికారులు ప్రేక్షకపాత్ర పోషించి సంతకం పెట్టడం మినహా బదిలీల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.