
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆదేశాల దరిమిలా యెమెన్ రాజధానిపై జరిగిన దాడుల్లో 20 మంది పౌరులు మృతిచెందారని ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. హౌతీ ఆరోగ్య, పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటనలో అమెరికా దాడుల్లో 20 మంది పౌరులు మరణించారని , మరో తొమ్మిది మంది గాయపడ్డారని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపింది.
యెమెన్‌లోని హౌతీ ఉగ్రవాదులపై శక్తివంతమైన సైనిక చర్యను ప్రారంభించాలని తాను అమెరికా సైన్యాన్ని ఆదేశించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు. హౌతీ ఉగ్రవాదులు(Houthi Rebels) అమెరికాతో పాటు ఇతర నౌకలు, విమానాలు, డ్రోన్‌లపై దాడులకు ప్రేరేపించే విధంగా నిరంతర ప్రచారాన్ని నిర్వహించారని ట్రంప్ పేర్కొన్నారు. కాగా తాము జిబౌటి ఓడరేవు నుండి బయలుదేరిన మూడు అమెరికన్ సైనిక సరఫరా నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు యెమెన్ హౌతీ గ్రూప్ పేర్కొంది. హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరియా మాట్లాడుతూ రెండు అమెరికన్ డిస్ట్రాయర్లను కూడా తాము లక్ష్యంగా చేసుకున్నామని అన్నారు. మరోవైపు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు టెహ్రాన్ ఆర్థిక వనరులు, ఆయుధ మద్దతు, సైనిక శిక్షణను అందిస్తోందనే అమెరికా ఆరోపణను ఐక్యరాజ్యసమితికి ఇరాన్ శాశ్వత మిషన్ తోసిపుచ్చింది.
ఇది కూడా చదవండి: Vadodara: ‘తాగలేదు.. గుంతల వల్లే కారు అదుపు తప్పింది’