
యుద్ధం కారణంగా గాజాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతంలో మానవతా సహాయం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరొకవైపు విషాద ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం గాజాలోని జికిమ్ క్రాసింగ్‌లో ఆహారం కోసం జనం ఎగబడటంతో 48 మంది పాలస్తీనియన్లు మృతిచెందారని, పదుల సంఖ్యలో జనం గాయాలపాలయ్యారని స్థానిక మీడియా తెలిపింది.
మానవతా సహాయ బృందం క్రాసింగ్‌కు చేరుకున్న సమయంలో, ఆహారం కోసం బాధితులు ఎగబడినప్పుడు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాజా సిటీలోని షిఫా హాస్పిటల్ ఈ ఘటనలో మృతుల సంఖ్యను 48గా నిర్ధారించింది. మానవతా సహాయ బృందం నుంచి కొందరు పిండి సంచులను తీసుకుని పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్ పోలీసులు జనసమూహంపై కాల్పులు జరిపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ సాగిస్తున్న సైనిక దాడి, కఠినమైన దిగ్బంధనం కారణంగా గాజాలో సంక్షోభం మరింత తీవ్రమయ్యింది.
ఈ పరిస్థితుల నేపధ్యంలో గాజాలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిషికేషన్ (ఐపీసీ) గాజాలో కరువు తీవ్రతపై హెచ్చరించింది. తక్షణ చర్యలు లేకపోతే మరిన్ని మరణాలు నమోదవుతాయని పేర్కొంది. మానవతా సహాయ సంస్థలు మరింతగా ముందుకు రావాలని కోరింది. గాజాలోకి మరింత మానవతా సహాయాన్ని అనుమతించడానికి అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచుతోంది. యూఎన్ తెలిపిన వివరాల ప్రకారం గాజాకు 600 ట్రక్కుల మానవతా సహాయం అందగా, 220 ట్రక్కుల సామాగ్రిని మాత్రమే అనుమతించారు. మానవతా సహాయాన్ని అందుకునే దిశగా జరుగుతున్న తొక్కిసలాటల్లో ఇప్పటి వరకూ వెయ్యిమంది పాలస్తీనియన్లు మృతిచెందారు.