జనగణన వివరాలు అత్యంత గోప్యం | - | Sakshi
Sakshi News home page

జనగణన వివరాలు అత్యంత గోప్యం

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

జనగణన వివరాలు అత్యంత గోప్యం ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలి

ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలి

ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలి

ప్రిన్సిపల్‌ ఎన్యూమరేషన్‌ ఆఫీసర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌

బంజారాహిల్స్‌లో జనగణనను పరిశీలిస్తున్న ఆర్వీ కర్ణన్‌

సాక్షి,సిటీబ్యూరో: సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ ముగియడంతో సోమవారం క్యూర్‌ పరిధిలోని ట్రై కార్పొరేషన్లలో ఇంటింటి సర్వే ద్వారా జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ జూన్‌ 9వ తేదీ వరకు కొనసాగనుంది. సెన్సస్‌ యాక్ట్‌ ప్రకారం ప్రజలు తమ వివరాలివ్వడం తప్పనిసరి అని, ఎన్యూమరేటర్లకు సహకరించి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని క్యూర్‌ పరిధిలోని 60 సర్కిళ్లు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ సర్కిల్‌కు ప్రిన్సిపల్‌ ఎన్యూమరేషన్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ కోరారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమకు అందుతున్న సంక్షేమ పథకాలకు జనగణనతో గండిపడుతుందనే అపోహలున్నాయని, దీని ద్వారా జనా భా, భవనాల వివరాలు సేకరించడం మినహా, ఇతరత్రా ఏ కార్యక్రమానికీ వినియోగించరని తెలిపారు. ఆర్‌టీఐ ద్వారా సైతం ఎవరికీ సమాచారం వెళ్లదని, అత్యంత గోప్యంగా ఉంటుందని, జనగణన వివరాలు డౌన్‌లోడ్‌, షేర్‌ చేయలేరని స్పష్టం చేశారు. ఎన్యూమరేటర్లకు గుర్తింపు కార్డు, క్యూఆర్‌ కోడ్‌ ఉంటాయని, వారితోపాటు జీహెచ్‌ఎంసీ సిబ్బంది సైతం ఉంటారని పేర్కొన్నారు. ఏవైనా ఫిర్యాదులుంటే ప్రజలు జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌ నెంబర్‌కు చేయవచ్చన్నారు.

19,868 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్స్‌

క్యూర్‌ పరిధిలో 19,868 బ్లాకులుగా ఇళ్లను డిజిటలైజ్‌ చేసినట్లు కర్ణన్‌ తెలిపారు. ఒక్కో బ్లాక్‌లో 200– 300 ఇళ్లుంటాయని, జనగణన కోసం 25,175 మంది సిబ్బందిని నియమించామని వివరించారు. వివరాల్ని మొబైల్‌ యాప్‌లో నమోదు చేస్తారని, జనగణనను డిజిటల్‌గా జరపడం ఇదే తొలిసారని తెలిపారు. ఇంట్లో ఉన్న వారెవరైనా వివరాలు ఇవ్వవచ్చని, కుటుంబ యజమాని పేరు, ఫోన్‌ నెంబర్‌ ఇవ్వడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇళ్లలో మాత్రమే కాక సంస్థల పరంగానూ ఎన్యూమరేషన్‌ జరుగుతుందని, ప్రతి భవనంలో ఉంటున్న వారి వివరాలు సేకరించడమే లక్ష్యమన్నారు. శని, ఆదివారాల్లోనూ ఎన్యూమరేషన్‌ జరుగుతుందని తెలిపారు. క్యూర్‌లో 1.27 లక్షల మంది మాత్రమే సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ చేసుకున్నట్లు చెప్పారు.

వ్యక్తుల వారీ వివరాలు వచ్చే సంవత్సరం

ఇది కుటుంబ సర్వే మాత్రమేనని, వ్యక్తుల వారీగా అసలైన జనగణన సర్వే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జరుగుతుందని కర్ణన్‌ తెలిపారు. ఇప్పుడు సర్వే చేసే ఎన్యూమరేటర్లు, ప్రతి ఇంటికీ వెళ్లి ఇంటి నెంబర్‌, ఎన్యూమరేషన్‌ నెంబర్‌ ప్రత్యేకంగా వేస్తారన్నారు.

పర్యవేక్షిస్తూ.. పరిశీలిస్తూ..

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌–12లోని ఎన్‌బీటీనగర్‌లో జనగణనను కర్ణన్‌ సోమవారం పర్యవేక్షించారు. జనాభా వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లను ఆదేశించారు.

ప్రభుత్వం ప్రజలకు అవసరమైన పథకాలు ప్రవేశపెట్టేందుకు, పాలసీలు రూపొందించేందుకు జనగణన ఎంతో కీలకం. దీని ద్వారా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. తెలిసిన సాధారణ వివరాలే నమోదు చేస్తారు. అందరూ సహకరించండి.

– ఆర్‌వీ కర్ణన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement