‘డిజిటల్ అరెస్టు’ కేసులోముగ్గురికి అరదండాలు
నగరవాసికి ఫోన్ చేసి రూ.37.7 లక్షలు స్వాహా
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ వ్యక్తిని డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టి, అతడి నుంచి రూ.37.7 లక్షలు కాజేసిన కేసులో ముగ్గురు నిందితులను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ఈ త్రయంపై దేశ వ్యాప్తంగా ఆరు కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు. మనీలాండరింగ్, డ్రగ్స్ రవాణా పేరుతో ఫోన్లు చేసి, డిజిటల్ అరెస్టు ద్వారా దండుకునే ముఠాకు నిందితులైన మహ్మద్ రిజ్వాన్, విక్రమ్ సింగ్, నిఖిల్ కుమార్ సహకరిస్తున్నారు. తమ పేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాలను అందించడం, అమాయకులకు ఎర వేసి ఖాతాలు తెరిపించడం చేస్తున్నారు. నగరంలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ విషయం గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేసి తీసుకువచ్చారు. కమీషన్లకు ఆశపడి వీరు అందించిన బ్యాంకు ఖాతాలను వినియోగించి సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి రూ.3 కోట్లు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు.
మాట్రిమోనియల్ ఫ్రాడ్‌లో రూ.3.38 లక్షలు...
సైదాబాద్‌కు చెందిన ఓ మహిళకు ఆన్‌లైన్‌లో విదేశీయుడిగా పరిచయమైన సైబర్ నేరగాడు పెళ్లి పేరుతో ఎర వేసి రూ.3.38 లక్షలు కాజేశాడు. దీనిపై గురువారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వినయ్‌నగర్‌లో నివసించే బాధితురాలికి (47) ఆన్‌లైన్ ద్వారా హిరద్ మహ్మద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను లండన్‌లో ఉన్నట్లు చెప్పడంతో పాటు దానికి ఆధారంగా కొన్ని పత్రాలను సృష్టించి పంపిన అతగాడు ఆమెతో పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఆపై ఢిల్లీలోని యూకే అఫైర్స్ ఆఫీస్ అధికారులుగా ఆమెతో మాట్లాడాడు. వీసా ప్రాసెసింగ్‌తో పాటు ఇతర ఖర్చుల పేరుతో ఆమె నుంచి రూ.3.38 లక్షలు కాజేసి మోసం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతిక ఆధారాలతో పాటు బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మాట్రిమోనియల్ ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
కేసు దర్యాప్తు చేసిన సిటీసైబర్ క్రైమ్ పోలీసులు
రాజస్థాన్‌లోని సికార్ జిల్లా వాసుల పట్టివేత


