మిర్యాలగూడ అర్బన్: కదులుతున్న రైల్లో నుంచి దిగేందుకు ప్రయత్నించిన టికెట్ కలెక్టర్ (టీసీ) ప్రమాదవశాత్తు రైలు కింద పడి రెండు కాళ్లు కోల్పోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం జరిగింది.
రైల్వే పోలీసులు వివరాలు తెలిపారు. మహబూబాబాద్‌కు చెందిన బి.శ్యామ్‌కుమార్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో టికెట్ కలెక్టర్ (టీసీ)గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం విధులు ముగించుకుని పని నిమిత్తం నల్లగొండకు రైలులో బయల్దేరాడు. కానీ, నల్లగొండ రైల్వే స్టేషన్‌లో రైలు దిగలేదు.
రైలు మిర్యాలగూడ మీదుగా దామచర్ల మండలంలోని విష్ణుపురం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో కొద్దిగా నెమ్మదించడంతో అతడు రైల్లో నుంచి కిందకు దిగబోయాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కదులుతున్న రైలు కింద పడిపోయాడు. దీంతో అతడి రెండు కాళ్లు పూర్తిగా తెగిపడ్డాయి.
స్థానికులు గుర్తించి వెంటనే అతడిని ఆటోలో స్థానిక హెల్త్ సబ్ సెంటర్‌కు తరలించారు. అక్కడి నుంచి మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.


