breaking news
TC injured
-
టికెటడిగినందుకు.. రైలు నుంచి తోసేశారు!
-
బేగంపేట రైల్వేస్టేషన్ లో మహిళా టీసీపై దాడి
హైదరాబాద్ : టికెట్ కలెక్టర్ గీత ఘటన మరవక ముందే మరో మహిళా టీటీఈపై దుండగులు దాడి చేశారు. ఈ సంఘటన బుధవారం ఉదయం బేగంపేట రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైల్లో విధులు నిర్వహిస్తున్న టీటీఈ కౌసల్య టికెట్ అడిగినందుకు... ఎనిమిది మంది దుండగులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే చికిత్స నిమిత్తం కౌసల్యను లాలాగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. కాగా దాడికి పాల్పడినవారిలో నలుగురిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. మహిళా టీసీలపై దాడి చేయటం వారం రోజుల్లో ఇది రెండో సంఘటన. దాంతో మహిళా రైల్వే టీసీలు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంగ్లీష్ కథనం కోసం.... ఈ నెల 18న టీసీ గీతను హఫీజ్ పేట రైల్వే స్టేషన్ లో దుండగులు కదులుతున్న రైల్లో నుంచి తోసేశారు. టికెట్ లేకుండా ప్రయాణించినందున జరిమానా కట్టాలని గీత అడిగిన పాపానికి దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. గతంలోనూ కేరళ ఎక్స్‌ప్రెస్‌లో విజయ్ కుమార్ అనే టీసీని దుండగులు రైల్లో నుంచి తోసివేయటంతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. -
మహిళా టీసీని రైల్లో నుంచి తోసేశారు
హైదరాబాద్ : హైదరాబాద్ హఫీజ్‌పేట్ రైల్వేస్టేషన్లో శుక్రవారం దారుణం జరిగింది. టికెట్ అడిగినందుకు ఓ మహిళా టీసీని ...దుండగులు కదులుతున్న రైల్లో నుంచి తోసేశారు. ఈ ఘటనలో గాయపడిన టీసీ గీతను చికిత్స నిమిత్తం మెట్టుగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్నవారిని జరిమానా కట్టమన్నందుకు దుండగులు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. రైలు లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గత నెల్లో కేరళ ఎక్స్‌ప్రెస్ లో ఇటువంటి సంఘటనే జరిగింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నప్రయాణికుడికి జరిమానా రాసిన కాజీపేట రైల్వేస్క్వాడ్‌గా పనిచేస్తున్న టికెట్ కలెక్టర్ విజయ్‌కుమార్ ను నలుగురు దుండగులు కదులుతున్న రైల్లో నుంచి కిందకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన అతడు హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు.