ఎన్ని సిట్‌లు వేసినా భయపడేదే లేదు: మాజీ మంత్రి హరీశ్‌రావు
విచారణ పేరిట అధికారులు ‘అడిగిందే అడుగుడు.. సొల్లు పురాణం’ అన్నట్టుగా వ్యవహరించారు
సీఎం బావమరిది బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే నోటీసులు
కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
పోలీసులకు నేనే వంద ప్రశ్నలు వేశా..
అప్పటి డీజీపీని, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఇప్పటి డీజీపీని విచారణకు పిలవాలని చెప్పా
సాక్షి, హైదరాబాద్: సిట్ పేరుతో రేవంత్ ప్రభుత్వం తనకు ఇచ్చిన నోటీసుల్లో పస లేదని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. విచారణ పేరిట సిట్ అధికారులు నిరాధార ఆరోపణలు చేస్తూ ‘అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం’అన్నట్లుగా వ్యవహరించారని విమర్శించారు. ముగ్గురు అధికారులు విచారణ జరుపుతూ మధ్యలో తరచూ బయటకు వెళ్లి ఫోన్లు మాట్లాడారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్‌రెడ్డి బావమరిది సింగరేణి టెండర్ల కుంభకోణాన్ని బయట పెట్టినందుకే నాకు నోటీసులు ఇచ్చారు. సీఎంకు దమ్ముంటే సింగరేణి కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి.
ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకు ఎన్ని సిట్‌లు వేసినా భయపడేది లేదు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించినందుకు నాపై ఇదివరకే అనేక అక్రమ కేసులు నమోదు చేశారు. పోలీసుల వెనుక దాక్కుని పిరికిపందలా నోటీసులు పంపడం కాదు, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొనాలి. రేవంత్ కుంభకోణాలు కుండబద్ధలు కొట్టినట్లు బయట పెడుతూనే ఉంటా. నోటీసులతో మీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు..’అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మీడియా సమావేశం తర్వాత హరీశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘విచారణలో నేనే పోలీసులకు వంద ప్రశ్నలు వేశా. సమాధానాలు చెప్పలేక వారే ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
గతంలో నేనేమైనా హోం మంత్రిగా పనిచేశానా? ఫోన్ ట్యాపింగ్ అంశం నాకేం తెలుసు? అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డిని విచారణకు పిలవాలని చెప్పా..’అని హరీశ్ తెలిపారు. కాగా సిట్ కార్యాలయానికి వెళ్లే ముందు కూడా హరీశ్‌రావు..కేటీఆర్‌తో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల్లో నష్ట నివారణకే డైవర్షన్
‘చట్టాన్ని గౌరవించి సిట్ విచారణకు హాజరవుతున్నా. రేవంత్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. బొగ్గు స్కామ్‌తో పాటు వాటాలు పంచుకోవడంలో మంత్రులు తన్నుకుంటున్న వైనాన్ని బయట పెట్టా. మున్సిపల్ ఎన్నికలకు ముందు తమ అవినీతి బండారం బయట పడితే నష్టం జరుగుతుందనే రేవంత్ డైవర్షన్ రాజకీయాలకు తెరలేపాడు. పంచాయతీ ఎన్నికలకు ముందు కేటీఆర్‌కు, ప్రస్తుతం నాకు నోటీసులు ఇచ్చి ఎన్నికల మీద మేము దృష్టి కేంద్రీకరించకుండా కుట్రలు పన్నుతున్నాడు.
కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాకపోతే విచారణ జరపాలి
ఫోన్ ట్యాపింగ్ పేరిట రేవంత్ రెండేళ్లుగా సీరియల్ నడుపుతున్నాడు. ఎంతగా పక్కదారి పట్టించినా బొగ్గు, విద్యుత్, హిల్ట్ కుంభకోణాలను బయట పెట్టడమే కాకుండా, ఆంధ్రాకు అమ్ముడు పోయిన తీరుపై నిలదీస్తాం. కుంభకోణంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాస్తున్నా. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాకపోతే రేవంత్ తన బావమరిదితో కలిసి చేస్తున్న కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి. నైనీ బ్లాక్‌తో పాటు ఇతర టెండర్లు రద్దు చేసి అవినీతిపరులను అరెస్టు చేయాలి..’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
హరీశ్‌రావు నివాసానికి కేటీఆర్
కేటీఆర్ మంగళవారం ఉదయం కోకాపేటలోని హరీశ్‌రావు నివాసానికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు నేతలు భారీ కాన్వాయ్‌తో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణ భవన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు వారికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి సిట్ విచారణ కోసం వెళ్లేందుకు బయలుదేరిన హరీశ్‌రావును అనుసరించేందుకు ప్రయతి్నంచిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా విచారణ అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీశ్‌రావుకు ఉదయం నుంచి అక్కడే వేచి ఉన్న కేటీఆర్, ఇతర నేతలు స్వాగతం పలికారు.


