కాలుష్య రహితం.. పర్యావరణ హితం | CM Revanth At Davos: Future City is country first net-zero greenfield city | Sakshi
Sakshi News home page

కాలుష్య రహితం.. పర్యావరణ హితం

Jan 21 2026 2:36 AM | Updated on Jan 21 2026 3:58 AM

CM Revanth At Davos: Future City is country first net-zero greenfield city

ఇజ్రాయెల్‌ ప్రతినిధితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

దేశంలోనే తొలి నెట్‌ జీరో గ్రీన్‌ ఫీల్డ్‌ నగరంగా ఫ్యూచర్‌ సిటీ 

దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

ఏఐ, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లు 

ఇప్పటికే మరుబెని, సెమ్‌ కార్ప్‌ల భాగస్వామ్యం 

యూఏఈ మంత్రికి వివరించిన సీఎం.. కలిసి పనిచేస్తామన్న అల్‌మార్రీ 

పలు సంస్థల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి భేటీ 

యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీపై సౌదీ సంస్థ ‘ఎక్స్‌పర్టైజ్‌’ ఆసక్తి 

ఏఐ రంగంలో తెలంగాణతో రాయల్‌ ఫిలిప్స్‌ భాగస్వామ్యం 

వివిధ రంగాల్లో కలిసి పనిచేసేందుకు గూగుల్‌ సంసిద్ధత

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే తొలి కాలుష్య రహిత, పర్యావరణ హిత (నెట్‌ జీరో గ్రీన్‌ఫీల్డ్‌) స్మార్ట్‌ సిటీగా తెలంగాణలో రూపుదిద్దుకోనున్న ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’ అభివృద్ధి ప్రాజెక్టు ప్రత్యేకతలను దావోస్‌ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు. 30 వేల ఎకరాల్లో ఏఐ, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, నివాస, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే మరుబెని, సెమ్‌ కార్ప్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వామ్యం కావడం గురించి తెలియజేయడంతో పాటు, రిలయన్స్‌ గ్రూప్‌ (వంతారా) ఏర్పాటు చేస్తున్న జంతు ప్రదర్శనశాల ప్రత్యేకతలను వివరించారు. 

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌ వెళ్లిన సీఎం నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధుల బృందం తొలిరోజు వరుస భేటీలు నిర్వహించింది. అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులతో రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. మరోవైపు యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌మార్రీతో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఫ్యూచర్‌ సిటీ గురించి చెప్పారు. ఈ భేటీల్లో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను సీఎం ఈ సందర్భంగా వివరించారు.   

ఫ్యూచర్‌ సిటీపై యూఏఈ ఆసక్తి 
భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ప్రాజెక్టులో తెలంగాణతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్‌ తెలిపారు. తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఆసక్తితో ఉందన్నారు. ఈ  ప్రాజెక్టును వేగవంతం చేఏందుకు రెండు ప్రభుత్వాల అధికారులతో సంయుక్త టాస్‌్కఫోర్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. యూఏఈ ఫుడ్‌ క్లస్టర్‌తో తెలంగాణ కలిసి పనిచేసి గ్రామీణ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.  

సీఎంతో ‘ఎక్స్‌పరై్టజ్‌’ భేటీ 
యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీతో భాగస్వామ్యంపై సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ ‘ఎక్స్‌పరై్టజ్‌’ ఆసక్తి చూపింది. సీఎం రేవంత్‌తో ఆ సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ మొహమ్మద్‌ ఆసిఫ్‌ భేటీ అయ్యారు. తమ సంస్థలో ఏటా సుమారు 5 వేల మంది నైపుణ్యం కలిగిన సిబ్బంది నియామకం జరుగుతోందని, యంగ్‌ ఇండియాతో భాగస్వామ్యం తమకు ఉపకరిస్తుందని చెప్పారు. 

విద్యా, ఉద్యోగ అవకాశాల నడుమ ఉన్న అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం చెప్పారు. మధ్య ఆసియా ప్రాంతంలో ఎక్స్‌పరై్టజ్‌ సంస్థ పెట్రో కెమికల్స్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ఎరువులు, స్టీల్, సిమెంట్, వాటర్‌ ట్రీట్‌మెంట్, విద్యుత్‌ ఉత్పత్తి వంటి నైపుణ్యాధారిత రంగాల్లో ప్లాంట్‌ నిర్వహణ సేవలను అందిస్తోంది. 

తెలంగాణతో భాగస్వామ్యంపై రాయల్‌ ఫిలిప్స్‌ ఆసక్తి 
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగంలో తెలంగాణతో భాగస్వామ్యంపై హెల్త్‌ టెక్‌ సంస్థ రాయల్‌ ఫిలిప్స్‌ ఆసక్తి చూపింది. హైదరాబాద్‌లో నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పాటు అవకాశాలపై చర్చించేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి బృందంతో భేటీ సందర్భంగా సంస్థ వైస్‌ ప్రెసిడెంట్, గ్లోబల్‌ హెడ్‌ జాన్‌ విల్లెమ్‌ స్కీజ్‌ గ్రాండ్‌ ఈ విషయం వెల్లడించారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత సేవలను ప్రశంసించారు. 

కాగా ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ నెక్స్ట్–జెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ 2026–2030’ ప్రత్యేకతలను రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఔషధ తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పారిశ్రామిక క్లస్టర్‌ను తెలంగాణలో నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ను ఏఐకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏఐ సిటీని నిర్మిస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. నెదర్లాండ్స్‌ ప్రధాన కార్యాలయాన్ని సదర్శించాల్సిందిగా సీఎం రేవంత్‌ను రాయల్‌ ఫిలిప్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ విల్లెమ్‌ స్కీజ్‌ గ్రాండ్‌ ఆహ్వానించారు. 

పలు రంగాల్లో కలిసి పనిచేస్తామన్న గూగుల్‌ 
ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో  కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకుంటామని తెలిపింది. ట్రాఫిక్‌ నియంత్రణ, సైబర్‌ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్‌లలో భాగస్వామ్యం పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎం రేవంత్‌తో భేటీ అయిన గూగుల్‌ ఆసియా పసిఫిక్‌ ఏరియా (ఏపీఏసీ) ప్రెసిడెంట్‌ సంజయ్‌ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. 

ట్రాఫిక్‌ కంట్రోల్, సైబర్‌ సెక్యూరిటీ, స్టార్టప్‌ ఇన్నోవేషన్‌కు మరింత మద్దతు వంటి రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. తొలి ‘గూగుల్‌ ఫర్‌ స్టార్టప్స్‌ హబ్‌’ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినందుకు సంస్థ బృందానికి రేవంత్‌ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆయా అంశాల్లో తెలంగాణకు పూర్తి స్థాయిలో మద్దతు అందించేందుకు గూగుల్‌ సిద్ధంగా ఉందని గుప్తా అన్నారు.   

యూనిలీవర్‌ జీసీసీ 
ప్రపంచ వ్యాప్తంగా వస్తు వినియోగరంగంలో అగ్రగామిగా ఉన్న యూనిలీవర్‌ సంస్థ, హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం యూనిలీవర్‌ చీఫ్‌ సప్లై చైన్‌ అండ్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ విల్లెమ్‌ ఉయిజెన్తో సమావేశమయ్యారు. తెలంగాణలో జీసీసీ ఏర్పాటు అంశంపై విస్తృతంగా చర్చించారు. 

ఇజ్రాయెల్‌ ఇన్నోవేషన్‌ అథారిటీ చైర్మన్‌ అలోన్‌ స్టోపెల్‌తో కూడా సీఎం భేటీ అయ్యారు. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్‌ స్టార్టప్‌లకు సహకారాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహా పలు రంగాల్లో ఇజ్రాయెల్‌ స్టార్టప్‌లతో కలిసి తెలంగాణ పైలట్‌ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement