వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెర తీశారు. వెనెజువెలా, కెనడా, గ్రీన్‌లాండ్ ద్వీపంతో కూడిన అమెరికా మ్యాప్‌ను ట్రంప్ తాజాగా విడుదల చేశారు. దీంతో, ట్రంప్ తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగకుండా ట్రంప్.. మ్యాప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేసిన రెండు ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక పోస్టులో గ్రీన్‌లాండ్ సరిహద్దులో అమెరికా జెండాను పాతుతున్నట్లు చూపించే చిత్రాన్ని షేర్ చేశారు. ఆ చిత్రంలో ఆయనతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మైలురాయి బోర్డుపై ‘గ్రీన్‌లాండ్ అమెరికా భూభాగం-2026లో ఏర్పాటైంది’ అని రాసి ఉన్న సూచిక బోర్డు కనిపిస్తుంది.

మరో పోస్టులో ఏకంగా అమెరికా మ్యాప్‌ను మార్చేశారు. ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్‌తో పాటుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్‌మర్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సహా ఇతర నాటో నేతలు కనిపించారు. అయితే, ఆ ఫొటోలో ఓ బోర్డుపై అమెరికా మ్యాప్ ఉంది. ఆ మ్యాప్‌లో కెనడా, గ్రీన్‌లాండ్, వెనిజువేలా దేశాలు అమెరికా భాగాలుగా చూపించారు. దీంతో, అమెరికా మ్యాప్ ఇప్పుడు సంచలనంగా మారింది.
గ్రీన్‌లాండ్‌లోకి యుద్ధ విమానం..
మరోవైపు.. ట్రంప్ తొలి పోస్ట్ పెట్టిన కాసేపటి తర్వాత నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (ఎన్‌ఓఆర్‌ఏడీ) ఎక్స్ వేదికగా కీలకమైన ట్వీట్ చేసింది. ఒక యుద్ధ విమానాన్ని గ్రీన్‌లాండ్‌లోని పిటుఫిక్ వైమానిక స్థావరానికి పంపుతున్నామని ఎన్‌ఓఆర్‌ఏడీ కమాండ్ ప్రకటించింది. గ్రీన్‌లాండ్ భద్రత కోసం రూపొందించిన పలు దీర్ఘకాలిక ప్రణాళికల అమలు కోసమే ఆ విమానాన్ని పంపుతున్నామని వెల్లడించింది. డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌ల సమన్వయంతోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపింది.

అమెరికాలో కెనడా 51వ రాష్ట్రం..
2025 సంవత్సరం మే నెల చివరి వారంలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే. కెనడా అనేది అమెరికాలో 51వ రాష్ట్రం అవుతుందన్నారు. నాటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కెనడా గవర్నర్ అవుతారని కామెంట్ చేశారు. కానీ కెనడా కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఈ వ్యాఖ్యలను ఖండించారు. కెనడా ఎన్నటికీ అమెరికాలో కలవదని తేల్చి చెప్పారు. అయినా ట్రంప్ తన వాదనను కొనసాగించారు.


