మాట వినని మాక్రాన్‌.. ట్రంప్‌ మరో హెచ్చరిక | Donald Trump Says wine tariffs France Macron snub | Sakshi
Sakshi News home page

మాట వినని మాక్రాన్‌.. ట్రంప్‌ మరో హెచ్చరిక

Jan 20 2026 3:34 PM | Updated on Jan 20 2026 3:53 PM

Donald Trump Says wine tariffs France Macron snub

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాను అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలనే ఆలోచనతో ట్రంప్‌ ముందుకు సాగుతున్నారు. ప్రపంచ దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు టారిఫ్‌లను ఆయుధంగా వాడుతున్నారు. తాజాగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌.. తన మాట వినని కారణంగా టారిఫ్‌లు విధిస్తానంటూ ట్రంప్‌ కక్ష సాధింపు చర్యలకు దిగారు.

అయితే, గాజా శాంతి మండలిలో చేరాలన్న ట్రంప్‌ ఆహ్వానాన్ని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మాక్రాన్‌పై ట్రంప్‌ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఈ నేపథ్యంలో మాక్రాన్‌ను టార్గెట్‌ చేసిన ట్రంప్‌.. తాజాగా ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు వేస్తానని బెదిరించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. మాక్రాన్‌ తప్పకుండా శాంతి మండలిలో చేరాల్సిందే. లేని పక్షంలో ఫ్రాన్స్‌ వైన్, షాంపైన్‌ దిగుమతులపై 200 శాతం టారిఫ్‌లు విధిస్తాను అని హెచ్చరించారు. అనంతరం, ఫ్రాన్స్‌పై టారిఫ్‌లు విధిస్తే.. మాక్రాన్‌ శాంతి మండలిలో చేరాల్సిన అవసరం ఉండదు అని సెటైర్లు సైతం వేయడం గమనార్హం. మరోవైపు.. గ్రీన్‌లాండ్‌ విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఉద్దేశించిన మండలిలో భాగం కావాలని భారత్‌ సహా కొన్ని దేశాలను డొనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానించారు. ఈ క్రమంలో గాజా పునరాభివృద్ధికి నిధుల సమీకరణ, పాలన పర్యవేక్షణకు మండలిని తొలుత ఉద్దేశించారు. ఇక, గాజాలో ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ రెండోదశలో భాగంగా దీనిని తెరపైకి తెచ్చారు. అయితే, ట్రంప్‌ ఆహ్వానాన్ని మాక్రాన్‌ తిరస్కరించారు. ట్రంప్‌ హెచ్చరికలపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులకు లొంగబోమని స్పష్టం చేశారు. దీంతో, ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement