కేటీఆర్ పర్యటనలో అపశ్రుతి..
● గుండెనొప్పితో వీడియో జర్నలిస్టు మృతి
జీడిమెట్ల: కేటీఆర్ జీడిమెట్ల పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. వీడియో రికార్డింగ్ చేస్తుండగా వీడియో జర్నలిస్టు దామోదర్ గుండెనొప్పితో కుప్పకూలాడు. ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాలానగర్ కళ్యాన్‌గర్‌కు చెందిన దామోదర్(52) ఆజ్‌తక్, ఇండియాటుడే చానళ్లలో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. గురువారం జీడిమెట్లలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు దామోదర్ అక్కడికి వచ్చాడు. కేటీఆర్ రాగానే వీడియో రికార్డు చేస్తున్న దామోదర్ ఒక్కసారిగా ఛాతీనొప్పి రావడంతో కుప్పకూలాడు. దీనిని గమనించిన పోలీసులు అతడిని సమీంపంలోని ప్రైవేట్ అస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో పోలీసులు ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు. దామోదర్ బావమరిది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన మృతిపట్ల పలువురు రిపోర్టర్లు సంతాపం వ్యక్తం చేశారు.
దామోదర్ కుటుంబానికి అండగా ఉంటాం
గాంధీఆస్పత్రి: సీనియర్ వీడియో జర్నలిస్ట్, ఆజ్‌తక్ చానల్ కమెరామెన్ దామోదర్ కుటుంబానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గురువారం ఉదయం ఆయన విధినిర్వహణలో ఉండగా గుండె పోటు రావడంతో మృతి చెందాడు. దీంతో దామోదర్ భౌతికకాయాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. గురువారం సాయంత్రం గాంధీ మార్చురీకి చేరుకున్న కేటీఆర్ దామోదర్ పార్ధీవదేహానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామోదర్ కుటుంబానికి బీఆర్‌ఎస్ అన్నివిధాల అండగా ఉంటుందన్నారు. దామోదర్ ఆకస్మిక మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గాంధీ ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ కృపాల్‌సింగ్ నేతృత్వంలో దామోదర మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అంబులెన్స్‌లో బాలానగర్‌లోని స్వగృహానికి తరలించారు. ఎమ్మెల్యే వివేకానందగౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు క్రిశాంక్, ముఠా జయసింహ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


