ఇద్దరు సైబర్‌ నేరగాళ్లకు ఆరు నెలల జైలు | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు సైబర్‌ నేరగాళ్లకు ఆరు నెలల జైలు

Feb 7 2025 7:44 AM | Updated on Feb 7 2025 7:44 AM

సాక్షి, సిటీబ్యూరో: ఓ మహిళ డీమ్యాట్‌ ఖాతాలోని షేర్లను తమ ఖాతాల్లోకి మార్చుకుని మోసం చేసిన ఇద్దరు సైబర్‌ నేరగాళ్లపై నేరం నిరూపణ అయింది. వీరికి న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విఽధించినట్లు డీసీపీ దార కవిత గురువారం వెల్లడించారు. నగరానికి చెందిన ఓ మహిళకు డీ మ్యాట్‌ ఖాతాతో పాటు వివిధ కంపెనీల షేర్లు ఉన్నాయి. 2014లో ఆమెకు వారాసిగూడకు చెందని ఏఎల్‌ దీపక్‌ పరిచయం ఏర్పడింది. ఆమె తండ్రి పేరుతో ఉన్న షేర్లను ఆమె ఖాతాలోకి బదిలీ చేయిస్తానంటూ నమ్మబలికాడు. ఆమెతో ఆదిత్య బిర్లా మనీ లిమిటెడ్‌ సంస్థలో ట్రేడింగ్‌ ఖాతా తెరిపించారు. బాధితురాలికి తెలియకుండా ఆమె పేరుతో ఈ–మెయిల్‌ ఐడీ సృష్టించాడు. దీని ఆధారంగా ఆమె డీమ్యాట్‌ ఖాతాలో ఉన్న షేర్లను కాజేసి, విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. 2018లో ఈ విషయాన్ని గుర్తించిన బాధితురాలు నగర సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ దందాలో దీపక్‌కు తార్నాక వాసి ఆర్‌ శ్రవణ్‌కుమార్‌ సహకరించినట్లు తేలింది. దీంతో అధికారులు వారిని అరెస్టు చేసి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఇరువురు నిందితులను దోషులుగా తేల్చింది. ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

స్నేహితుడి భార్యను నిండా ముంచాడు...

తన స్నేహితుడి భార్యను టార్గెట్‌గా చేసుకున్న ఓ కేటుగాడు మరో వ్యక్తితో కలిసి రూ.8.13 లక్షలు కాజేశాడు. దీనికోసం సోలార్‌ ప్రాజెక్ట్‌ కోసం 100 శాతం రణం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. బాధితురాలి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుజరాత్‌ రాష్ట్ర ఆర్థిక శాఖలోని ప్రైమ్‌ మినిస్టర్స్‌ ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాంలో (పీఎంఈజీపీ) పని చేసి, కన్నుమూసిన అధికారి భార్య నగరంలో స్థిరపడ్డారు. పదవీ విరమణ చేసిన ఆమె తన భర్త ఫోన్‌ నెంబర్‌నే వినియోగిస్తున్నారు. పీఎంఈజీపీలో అతడితో కలిసి పని చేసిన ఓ వ్యక్తి దీనిని ఆసరాగా చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం ఆమెకు ఫోన్‌ చేసి మాట్లాడిన అతగాడు క్రెడిట్‌ గ్యారెంటీ ఫండ్‌ ట్రస్ట్‌ ఫర్‌ మైక్రో అండ్‌ స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (సీజీటీఎంఎస్‌ఈ) పథకం కింద సోలార్‌ ప్రాజెక్టులకు 100 శాతం రుణం ఇప్పిస్తానని చెప్పాడు. ఆమె ఆసక్తి చూపడంతో మరో వ్యక్తిని పరిచయం చేసిన అతగాడు దరఖాస్తు చేసుకునే విధానాన్ని వివరించడంతో పాటు సహకరిస్తాడని చెప్పాడు. ఆపై పత్రాల తయారీ, ఇతర ఖర్చుల పేరుతో కొంత, రిఫండబుల్‌ డిపాజిట్‌ అంటూ మరికొంత మొత్తం... ఇలా రూ.8.13 లక్షలు బదిలీ చేయించుకున్నారు. ఆపై రుణం మంజూరైందని, త్వరలోనే మీ ఖాతాలోకి వస్తుందని చెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా తన ఖాతాలోకి నగదు రాకపోవడంతో తాను చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వాలని వారిని కోరింది. అయితే రుణం మంజూరుకు మరికొంత మొత్తం డిమాండ్‌ చేయడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రూ.10 వేల చొప్పున జరిమానా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement