సాక్షి, హైదరాబాద్: ఉగాండా నుంచి టూరిస్ట్ వీసాపై వచ్చి... వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటూ డ్రగ్ సప్లయర్స్‌తో కలిసి తిరుగుతున్న జూలిన విక్టర్ నబితకను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) సోమవారం డిపోర్టేషన్ విధానంలో ఆమె స్వదేశానికి బలవంతంగా తిప్పి పంపింది. ఫారెనర్స్ రీజనల్ రిజి్రస్టేషన్ ఆఫీస్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) సహకారంతో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు డీసీపీ వైభవ్ గైక్వాడ్ సోమవారం వెల్లడించారు.
జూలీనా ఉగాండాలో విద్యనభ్యసించింది. ఆపై టూరిస్ట్ వీసాపై 2024 ఫిబ్రవరి 12న ముంబై వచ్చింది. అక్కడి నుంచి చెన్నై, ముంబై, బెంగళూరుల్లో కొన్నాళ్లు నివసించింది. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు కొందరు డ్రగ్ పెడ్లర్లు, సప్లయర్లతో జట్టు కట్టింది. వారి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలను సప్లయర్స్ నుంచి తీసుకురావడం, కస్టమర్లకు అందించడం మొదలుపెట్టింది. ఇందు కోసమే తరచూ హైదరాబాద్‌కు రాకపోకలు సాగించేది. ఇటీవల టోలిచౌకీ ప్రాంతంలో కొందరు డ్రగ్ పెడ్లర్స్‌తో ఉన్న జూలీనాను హెచ్–న్యూ ఇన్‌స్పెక్టర్ జీఎస్ డానియేల్ నేతృత్వంలోని బృందం పట్టుకుంది. మిగిలిన వారిని అరెస్టు చేయగా... ఆమె వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించకపోవడంతో లోతుగా ఆరా తీసింది.
దీంతో ఆమె పాస్‌పోర్టు గడువు 2033 వరకు ఉన్నప్పటికీ వీసా మాత్రం ఈ ఏడాది జనవరి 18న ఎక్స్‌పైర్ అయినట్లు తేలింది. దీంతో విషయాన్ని ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓకు తెలిపిన హెచ్–న్యూ ఆమెను డిటెన్షన్ సెంటర్‌లో ఉంచింది. డిపోర్టేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేసి ఆదివారం ఉగాండాకు తిప్పి పంపింది. 2022 నుంచి ఇప్పటి వరకు హెచ్–న్యూ దాదాపు 40 మంది విదేశీయులను పట్టుకుని, వారి దేశాలకు డిపోర్టేషన్ చేసింది. వీరిలో నైజీరియా, సూడాన్, ఘనా, ఐవరీ కోస్ట్ తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారు.


