Sakshi News home page

పుతిన్‌ ప్రైవేట్‌ ఆర్మీలో తెలంగాణ వాసులు

Published Fri, Feb 23 2024 7:42 AM

- - Sakshi

సాక్షి, హైదరాబాద్: రష్యాలో సెక్యూరిటీ గార్డు, హెల్పర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామన్న బ్రోకర్ల వలకు చిక్కి 12 మంది భారతీయ యువకులు ప్రస్తుతం ప్రాణభయంతో విలవిల్లాడుతున్నారు. ఉక్రెయిన్‌పై పోరులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌కు చెందిన ప్రైవేటు సైన్యం ‘ది వాగ్నర్‌’ గ్రూప్‌లో బలవంతంగా పనికి కుదర్చడంతో వారంతా బాంబులు, తుపాకుల మోత మధ్య బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. తమను వీలైనంత త్వర గా తిరిగి తీసుకెళ్లాలని తమ కుటుంబీకులకు ఆడి యో, వీడియో సందేశాలు పంపుతున్నారు. ఈ బాధితుల్లో హైదరాబాద్‌లోని బజార్‌ఘాట్‌కు చెందిన మహమద్‌ అస్ఫాన్‌, నారాయణ్‌పేట జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్‌ మహ్మద్‌ సుఫియన్‌ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.

నమ్మించి మోసం..
బాబా బ్లాగ్స్‌ పేరుతో యూట్యూబ్‌ చానల్‌ నిర్వహించే ఫైసల్‌ ఖాన్‌ అలియాస్‌ బాబా ప్రస్తుతం షార్జాలో ఉంటున్నాడు. దాదాపు 50 వేల మంది ఫాలోవర్లు ఉన్న తన బ్లాగ్‌ ద్వారానే రష్యాలో సెక్యూరిటీ గార్డు, హెల్పర్‌ ఉద్యోగాలు ఉన్నాయంటూ ఎర వేశాడు. దీనికి ఆకర్షితుడైన బజార్‌ఘాట్‌ ప్రాంతానికి చెందిన మహమద్‌ అస్ఫాన్‌ (30) మొదట బాబాను సంప్రదించాడు. ఏడాది కాలం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేలా రష్యాలో ఉద్యోగాలు ఉన్నాయని నమ్మబలికాడు. అతన్నుంచి రూ.3 లక్షలు వసూలు చేసి ఉద్యోగం ఖరారు చేస్తానంటూ నమ్మబలికాడు.

మాస్కోలోని తన సబ్‌ ఏజెంట్లు సుఫాయాన్‌, మోయిన్‌, రమేష్‌లను సంప్రదించాలని సూచించాడు. దీంతో గతేడాది నవంబర్‌ 12న అస్ఫాన్‌ చైన్నె విమానాశ్రయం నుంచి షార్జా మీదుగా రష్యా చేరుకున్నాడు. ఈ ప్రయాణం కోసం విజిట్‌ వీసా ఏర్పాటు చేసిన బాబా.. జాబ్‌ వీసాను మోయిన్‌ ఇస్తాడని నమ్మించాడు. అక్కడకు వెళ్లిన అతన్ని రిసీవ్‌ చేసుకున్న రమేష్‌ సెక్యూరిటీ ఉద్యోగం అని చెప్పి తీసుకువెళ్లాడు.

సంతకాలు తీసుకొని..
మాస్కోలోని ఒక మాల్‌లో పని చేయాలంటూ రష్యన్‌ భాషలో రాసి ఉన్న పత్రంపై అస్ఫాన్‌తో రమేష్‌ సంతకాలు చేయించాడు. రమేష్‌, మోయిన్‌లు అస్ఫాన్‌ సహా 12 మంది భారతీయులను ఆ సమీపంలోని సైనిక శిబిరానికి తీసుకెళ్లి తుపాకులు వినియోగించడంలో ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. సెక్యూరిటీ గార్డు విధుల్లో భాగంగానే ఇది ఇస్తున్నట్లు నమ్మించారు. ఆపై వారిని దాదాపు వెయ్యి కి.మీ. దూరంలోని ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోకి చేర్చారు. దీంతో తాను సంతకం చేసింది పుతిన్‌కు చెందిన ప్రైవేట్‌ ఆర్మీ ది వాగ్నర్‌ గ్రూప్‌లో ఏడాదిపాటు పని చేసేందుకని అస్ఫాన్‌ ఆలస్యంగా గుర్తించాడు. ఆజాద్‌ యూసుఫ్‌ అనే భారతీయుడు తమ కళ్లెదుటే అశువులు బాయడంతో మిగిలిన వారంతా ఆందోళన చెందారు. అనంతరం వారిని అక్కడ నుంచి ఉక్రెయిన్‌లోని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు.

రూ. లక్ష జీతమంటూ సుఫియన్‌ను మోసగించి...
నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన డ్రైవర్‌ జహీర్‌, నాసీమా రెండో కుమారుడు సయ్యద్‌ మహ్మద్‌ సుఫియన్‌ ఇంటర్‌ వరకు చదువుకొని 2021లో జీవనోపాధి కోసం దుబాయ్‌ వెళ్లి హోటల్‌లో పనిచేస్తున్నాడు. అక్కడే అతనికి బాబా పరిచయమయ్యాడు. దుబాయ్‌లో పనిచేస్తే రూ.30 వేలే వస్తాయ్‌..అదే రష్యాలో హెల్పర్‌గా పనిచేస్తే రూ.లక్ష వరకు జీతం వస్తుందని నమ్మించాడు. ఇందుకుగాను తనకు రూ.3 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. అందుకు సుఫియన్‌ అంగీకరించడంతో తల్లిదండ్రులు అప్పు చేసి ఆ డబ్బు కుమారుడికి ఇచ్చారు. డిసెంబర్‌ 17న దుబాయ్‌కు అక్కడి నుంచి 18న రష్యాకు సుఫియాన్‌ వెళ్లాడు.

రక్షించాలంటూ సందేశాలు..
అస్ఫాన్‌ గతేడాది డిసెంబర్‌ 13 వరకు కుటుంబీకులతో సంప్రదింపులు జరిపినా ఆపై సిగ్నల్స్‌ దొరకలేదు. మిగిలిన 11 మందికీ సరైన సిగ్నల్స్‌ లభించక కుటుంబీకులకు ఆడియో, వీడియో సందేశాలు పంపారు. వాటిలోనే తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ రికార్డుల్లో బాంబుల మోతలు, తుపాకీ కాల్పులు వినిపిస్తున్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. అస్ఫాన్‌ సోదరుడు ఇమ్రాన్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘అస్ఫాన్‌కు భార్య, కుమార్తె (2), కుమారుడు (8 నెలలు) ఉన్నారు. ఉక్రెయిన్‌లోని యుద్ధక్షేత్రంలో ఉన్న అతడిని ఇక్కడకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

అస్ఫాన్‌ ఇటీవల పంపిన సందేశంలో వారి చుట్టూ ఉన్న వాళ్లు యుద్ధంలో మరణిస్తున్నారని చెప్పాడు. నన్ను వెనక్కు తీసుకురావడానికి ఏదైనా చేయాడంటూ వేడుకున్నాడు’ అని పేర్కొన్నాడు. బాధిత కుటుంబాల కోరిక మేరకు స్పందించిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఈ అంశంపై మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు.

Advertisement

What’s your opinion

Advertisement