మూసీ, ఈసా నదులపై ఫోర్‌లేన్‌ బ్రిడ్జీలు | Four-Line Bridges Coming Up Over Musi And Isa Rivers- Sakshi
Sakshi News home page

మూసీ, ఈసా నదులపై ఫోర్‌లేన్‌ బ్రిడ్జీలు

Sep 25 2023 3:58 AM | Updated on Sep 25 2023 6:39 PM

- - Sakshi

హైదరాబాద్: చారిత్రక మూసీ, ఈసా నదులపై అందమైన వంతెనలు అందుబాటులోకి రానున్నాయి. నగరానికి ఉత్తర, దక్షిణ మార్గాల్లో రాకపోకలకు అనుగుణంగా సరికొత్త డిజైన్లలో బ్రిడ్జీలను నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. ఔటర్‌ లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజల మౌలిక అవసరాలకు సరిపడా ప్రజా రవాణా వ్యవస్థలో పెద్దఎత్తున మార్పులు చేపట్టారు. అందులో భాగంగానే మూసీ, ఈసా నదులపై వంతెనల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ రెండు నదులపై వివిధ చోట్ల 14 బ్రిడ్జీలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వీటిలో ప్రస్తుతం హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మూసీ నదిపై 3 చోట్ల, ఈసా నదిపై 2 చోట్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. సుమారు రూ.168 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ వంతెనల నిర్మాణ పనులకు హెచ్‌ఎండీఏ ఇప్పటికే ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) పద్ధతిలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ బ్రిడ్జీల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.

తగ్గనున్న ప్రయాణ సమయం..
సుమారు రూ.42 కోట్లతో ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌ వద్ద ఒక బ్రిడ్జి నిర్మించనున్నారు. మరో రూ.35 కోట్లతో ప్రతాపసింగారం– గౌరెల్లి వద్ద నిర్మిస్తారు. మంచిరేవుల వద్ద రూ.39 కోట్ల వ్యయంతో, బుద్వేల్‌ ఐటీపార్కు–2 వద్ద ఈసా నదిపై రూ.32 కోట్లతో నిర్మించనున్నారు. రూ.20 కోట్లతో బుద్వేల్‌ ఐటీ పార్క్‌–1 సమీపంలో ఈసా నదిపై హెచ్‌ఎండీఏ వంతెనల నిర్మాణాలను చేపట్టనుంది.

ఉప్పల్‌ భగాయత్‌, ప్రతాపసింగారం ప్రాంతాల్లో సుమారు 210 మీటర్ల పొడవున మూసీపై నాలుగు వరుసల్లో వంతెన నిర్మాణం జరగనుంది. 15 నెలల్లో ఈ బ్రిడ్జీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని హెచ్‌ఎండీఏ లక్ష్యంగా పెట్టుకుంది. వంతెనల నిర్మాణం పూర్తయితే వివిధ ప్రాంతాల మధ్య దూరం తగ్గడమే కాకుండా ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement