అన్నదమ్ములను చిదిమేసిన రోడ్డు ప్రమాదం! | - | Sakshi
Sakshi News home page

అన్నదమ్ములను చిదిమేసిన రోడ్డు ప్రమాదం!

Apr 22 2023 5:08 AM | Updated on Apr 22 2023 7:12 AM

- - Sakshi

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గత శనివారం తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ అన్న శుక్రవారం తెల్లవారుజామున అపోలో ఆస్పత్రిలో కన్నుమూశాడు. అన్నదమ్ముల మృతితో జర్నలిస్టు కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 70లోని జర్నలిస్టు కాలనీలో పావని ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌లోని రాంబాబు సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. అతడి కుమారులు తరుణ్‌ ఆదిత్య(18), రత్న సత్యసాయి(14) గత శనివారం తమ నాయనమ్మను చూసేందుకు బైక్‌పై జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 36 మీదుగా వెళ్తున్నారు.

తరుణ్‌ ఆదిత్య బైక్‌ నడుపుతుండగా వెనుక రత్న సత్యసాయి కూర్చున్నాడు. అదే సమయంలో జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ వైపు నుంచి రాంగ్‌ రూట్‌లో చట్నీస్‌ వైపు వెళుతున్న షేక్‌ అలీముద్దీన్‌ వీరి బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తరుణ్‌ ఆదిత్య, రత్న సత్యసాయి గాల్లోకి ఎగిరి ఫుట్‌పాత్‌పై పడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే రత్నసత్యసాయి మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన తరుణ్‌ ఆదిత్యను అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన షేక్‌ అలీముద్దీన్‌ సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా అన్నదమ్ముల్లో తరుణ్‌ ఇటీవల ఇంటర్‌ పరీక్షలు రాసి ఎంసెట్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. తమ్ముడు సత్యసాయి పదవ తరగతి పరీక్షలు రాసి ఇంటర్‌లో చేరేందుకు సన్నద్ధమవుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement