హన్మకొండ అర్బన్: క్రమం తప్పకుండా గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించడం, అధిక ప్రమాద లక్షణాలున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా మాతృ మరణాలను నివారించవచ్చని డీఎంహెచ్‌ఓ అప్పయ్య వైద్యాధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జిల్లాలో ఈ ఏడాది జరిగిన మూడు మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు. ఒక్కో కేసును విశ్లేషించి మరణాలకు గల కారణాలు, లోపాలను గుర్తించి భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మాతా శిశు సంక్షేమ కార్యక్రమ అధికారి డాక్టర్ రజిత, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ లక్ష్మీరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రదీప్‌రెడ్డి, పరకాల ఏరియా ఆస్పత్రి అనెస్థటిస్ట్ డాక్టర్ నారాయణరెడ్డి, వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సుల (నాన్ ప్రొఫెషనల్) రెండో సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని పలు పరీక్ష కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ పి.శ్రీనివాస్, డాక్టర్ తిరుమలాదేవి పరిశీలించారు. 90 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.
కేయూ క్యాంపస్: తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ సెంటర్ (టాస్క్)తో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గురువారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈమేరకు ఆకళాశాలలో ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతికి, టాస్క్ జిల్లా అభివృద్ధి అధికారి మామిడాల రామకృష్ణ అవగాహన ఒప్పంద పత్రం అందించారు. విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు ఆ పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్‌ను అందించేందుకు ఈ ఎంఓయూ తోడ్పడనుంది. ఆకళాశాల టాస్క్ సంచాలకులు డాక్టర్ గిరిప్రసాద్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీలత పాల్గొన్నారు.
హన్మకొండ చౌరస్తా: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో మంత్రి వివేక్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన జీఓ 97పై నెలకొన్న అపోహలను నివృత్తి చేసి, స్పష్టత ఇవ్వాలని మంత్రిని కోరారు.


