● ట్రాఫిక్ సమస్యను పరిష్కరించండి
● పోలీస్ కమిషనర్ శ్వేత
వరంగల్ క్రైం: వరంగల్ ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. వరంగల్ ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు అధిగమించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ప్రత్యేకంగా ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ భరద్వాజ్‌తో పాటు రోడ్లు, భవనాలు, మున్సిపల్, ట్రాఫిక్ విభాగాల అధికారులు, ట్రైసిటీ పరిధి పోలీస్‌స్టేషన్ల అధికారులు హాజరయ్యారు. ట్రాఫిక్ పోలీస్ అధికారులు నగరంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ట్రైసిటీ పరిధిలో రాత్రి సమయాల్లో వెలుతురు సరిగ్గా లేని 159 ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో వీధి దీపాల ఏర్పాటుకు అధికారులు చొరవ చూపాలని సూచించారు. బల్దియా కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ.. పోలీస్, మున్సిపల్ శాఖల అధికా రులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ట్రాఫి క్ నియంత్రణకు అవసరమైన చర్యలను మరింత స్పష్టంగా గుర్తించవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ట్రాఫిక్ విభాగం అధికారులు, ట్రైసిటీ పరిధి ఇన్‌స్పెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.


