అక్రమ అరెస్టులపై మండిపాటు
హన్మకొండ: బీఆర్‌ఎస్ నాయకుల గృహ నిర్బంధం వరుసగా రెండో రోజు కొనసాగింది. తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర ప్రతిఘటన వ్యక్తమవుతుందని భావించిన పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. ప్రధాన నాయకులకు గృహనిర్బంధం విధించగా, ఇతర నాయకులను సమీపంలోని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈక్రమంలో బుధవారం హనుమకొండ వడ్డేపల్లిలోని స్వగృహంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, నక్కలగుట్టలోని స్వగృహంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఇందిరానగర్‌లోని స్వగృహంలో రాష్ట్ర రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, టీచర్స్ కాలనీలోని స్వగృహంలో ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాజీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. నర్సంపేట ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు పిలుపునిచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే ఉద్యమానికి మద్దతు తెలిపే నాయకులను పోలీసులు అడ్డుకోవడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. విగ్రహం తొలగించినంత మాత్రాన చరిత్ర చెరిగిపోదన్నారు.


